అధికారిక చిహ్నం, కుటుంబ పెద్ద చిత్రంతో స్మార్ట్ రేషన్ కార్డులు.
నూతన పద్ధతిలో రేషన్ పంపిణీ – క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరకుల వివరాలన్నీ కనిపించేలా డిజైన్
Smart Ration Cards in AP: కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్నటువంటి రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్‌కార్డులను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏటీఎం కార్డు పరిమాణంలో రూపొందిస్తోంది. కార్డు ముందు వైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, కుటుంబ పెద్ద చిత్రం, రేషన్ దుకాణం సంఖ్య, ఇతర వివరాలుంటాయి. ఈ-పోస్ యంత్రాల సాయంతో కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబానికి సంబంధించి తీసుకునే సరకుల వివరాలన్నీ కనిపించేలా కార్డును డిజైన్ చేశారు.
జాప్యం లేకుండా ఏర్పాట్లు: శ్రీకాకుళం జిల్లాలోని 30 మండలాల పరిధిలో కొత్తగా 866 మందికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీరందరికీ స్మార్ట్‌కార్డులు సరఫరా చేయనున్నారు. ఇప్పటివరకు ఉన్న 6,60,739 పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవాటిని అందజేస్తారు. దుకాణాల్లో బియ్యం, పంచదార, ఇతర సరకులు సులభంగా తీసుకోవచ్చు. కార్డుదారులు దుకాణాల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.
స్మార్ట్‌కార్డులు అందుబాటులోకి వచ్చిన తరువాత లభ్ధిదారులకు మేలు జరుగుతుందని శ్రీకాకుళం డీఎస్వో జి. సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా పంపిణీ చేసే వివిధ సరకులు, ఇతర వివరాలు కార్డులో పొందుపరుస్తారని ఆయన తెలిపారు. వచ్చే నెలలో కొత్తవి అందజేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సూర్యప్రకాశరావు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అర్హులందరికీ రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. మే నెల 7వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. మే 15 వ తేదీ వరకు పరిశీలిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,206 గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 21,197 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అనంతపురం జిల్లాలో దాదాపు 11,211 దరఖాస్తులు రాగా, శ్రీసత్యసాయి జిల్లాలో 9,986 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
అధికంగా అదనపు సభ్యులను చేర్చాలని: దరఖాస్తుదారుని చిరునామా మార్పు, ఆధార్ సరిచేయడం, అదనపు సభ్యులను చేర్చుట, సభ్యుల తొలగించడం, కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు, విభజన కార్డుకు, స్వాధీనం చేసే కార్డులకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అందులో ప్రధానంగా రేషన్‌కార్డులో కొత్తవారిని చేర్చడానికి ఎక్కువగా దరఖాస్తులు వస్తుండటం గమనార్హం. సచివాలయాల్లో డిజిటల్ సహాయకుల లాగిన్‌లో ఈ వివరాలు నమోదు చేస్తారు. తర్వాత వాటిని వీఆర్వో లాగిన్‌కు పంపుతారు. రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తికి ఈకేవైసీ(EKYC) చేస్తారు. ఆ తర్వాత తహశీల్దారు లాగిన్‌కు పంపుతారు. తహశీల్దారు అప్రూవల్ చేస్తే అర్హులైన వ్యక్తికి రేషన్ కార్డు నంబరుకి సంబంధించిన సంక్షిప్త సమాచారం చరవాణికి వస్తోంది.
సూపర్