తక్కువ ఖర్చుతో విదేశాలకు పార్సిల్స్ పంపాలా? – పోస్టాఫీస్‌లో అందించే ఈ సేవలు మీకోసమే –
పంపిచాల్సిన వస్తువు నమూనాలు తీసుకురావాల్సిన అవసరం లేదు – కస్టమ్ అధికారిని కలవాల్సిన అవసరం ఉండదు – ఈ–పోర్టల్ ద్వారా వస్తువు ఎక్కడ ఉందో ట్రాక్ చేసే సదుపాయం
indian postal service international : చదువు, ఉద్యోగాల కోసం మనవారు చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. అక్కడే స్థిరపడుతుంటారు. ప్రతి చిన్న అవసరానికి వారు స్వగ్రామాలకు రావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం వారికి ఏదైనా వస్తువులను చేరవేయాలన్నా అధిక మొత్తంలో ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే,
కేంద్ర ప్రభుత్వం ‘పోస్టాఫీసు డాక్ నిర్యత్ కేంద్రం’ ద్వారా మన ఇంట్లో నుంచి ఏ వస్తువునైనా వేరే దేశానికి పంపించే సేవలను అందిస్తోంది. ఈ కేంద్రాల ద్వారా ఉత్పత్తులను ఎయిర్ పార్శిల్, స్పీడ్‌పోస్ట్, ఐటీపీఎస్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎగుమతి చేయవచ్చు. నగరంలోని జనరల్ పోస్టాఫీస్ (జీపీవో)లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.
ప్రత్యేకతలు :
- ఉత్పత్తి నమూనాలు తీసుకురావాల్సిన అవసరం లేదు.
- ఎగుమతి పోస్టల్ బిల్లు నేరుగా దాఖలు చేయక్కల్లేదు. వెబ్సైట్లో పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ (పీబీఈ)లో అవసరమైన పత్రాలు అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
- కస్టమ్ హౌస్ ఏజెంట్, కస్టమ్ అధికారిని కలవాల్సిన అవసరం ఉండదు.
- కస్టమ్ తనిఖీ తర్వాత పీబీఈని పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఏవైనా విచారణలు, అభ్యర్థించిన పత్రాలకు నోటిఫికేషన్లు పోర్టల్‌లో అందుతాయి. వాటికి కావాల్సిన పత్రాలు పోర్టల్‌లో అప్లోడ్ చేస్తే చాలు.
- ఈ-పోర్టల్ ద్వారా వస్తువు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
జీపీవోలో డాక్ నిర్యత్ కేంద్రం ద్వారా సేవలు :
- అంతర్జాతీయ స్పీడ్‌పోస్ట్ పార్శిల్ (ఈఎంఎస్): ఒక్కో పార్శిల్ 35 కేజీల వరకు, తక్కువ ఖర్చుతో 106దేశాలకు పంపిణీ చేయవచ్చు.
- అంతర్జాతీయ ట్రాక్ చేయబడిన ప్యాకెట్ సర్వీస్(ఐటీపీఎస్): రెండు కిలోల వరకు పార్సిళ్లను యూఎస్ఏ పరిధిలోని 39 దేశాలకు, ఆసియా పసిఫిక్ రీజియన్ దేశాలకు చాలా తక్కువ ధరకు పంపించవచ్చు.
ఎగుమతులకు సులభ మార్గం : జీఎస్టీ నంబరు ఉన్న వారు వేరే దేశాలకు ఏవైనా వస్తువులు సులువుగా ఎగుమతి చేసుకోవడానికి ఈ డీఎన్కేలు ఉపయోగించుకోవచ్చు అని హైదరాబాద్ జీపీవో ఛీఫ్ పోస్ట్‌మాస్టర్ ప్రసాద్ తెలిపారు.
రిజిస్ట్రేషన్ : ఎగుమతిదారులు https://dnk.cept.gov.in/customers.web/ పోర్టల్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదిపూర్తయ్యాక వారికి ఒక ఐడీ వస్తుంది. ఆ కోడ్ ద్వారా పాన్ / జీఎస్టీ నంబరు, అవసరమైన ఇతర పత్రాలు పూర్తి చేయాలి. తరవాత పంపించే వస్తువుల వివరాలను పోర్టల్‌లోని పీబీఈలో ఎంటర్ చేస్తే పీబీఈ నంబర్ వస్తుంది.
ఆయా వస్తువులను దగ్గరలోని డీఎన్కేకి తీసుకెళ్తే వారు ఓ లేబుల్(సీఎన్22, సీఎన్23 కస్టమ్స్ డిక్లరేషన్) వేస్తారు. దాన్ని విదేశీ పోస్టాఫీస్‌కు పంపిస్తారు. అక్కడ పరీక్షించి అవసరమైన పత్రాలను అడుగుతారు. అన్నీ పూర్తయిన తర్వాత వస్తువు ఎగుమతికి లెట్ ఎక్స్‌పోర్టు ఆర్బర్ను ఇస్తుంది. దాన్ని పీబీఈ కస్టమర్ ఐడీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Mallapuram kt dhoddi( m) J Gadwal