ఇంటి పెద్ద మరణిస్తే కేంద్రం అందించే రూ.20 వేల సాయం గురించి తెలుసా? – రెండేళ్లలోపు ఎప్పుడు అప్లై చేసినా అర్హులే.
కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం – అవగాహన లేకపోవడంతో జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేయని ప్రజలు.
National Family Benefit Scheme in Telangana : నిరుపేద కుటుంబాల్లో ఇంటి పెద్ద మరణిస్తే ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌బీఎస్ (జాతీయ కుటుంబ ప్రయోజన పథకం) అమలు పరుస్తోంది. ఒకప్పుడు ఈ పథకం కింద వేలాది మంది ప్రజలు దరఖాస్తులు చేసుకునే వారు. కానీ ప్రస్తుతం సరైన అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు పూర్తిగా తగ్గిపోయాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన యజమానులు, ప్రతి ఏడాది వందలు, వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు.
సమన్వయ లోపం కారణంగా : అయినా సరే అప్లికేషన్లు మాత్రం ఆశించినంతగా రావడం లేదు. గడిచిన ఆరు నెలల్లో ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఇటీవల జరిగిన దిశ సమావేశంలో దరఖాస్తులు ఎందుకు రావడం లేదని మెంబర్స్ ప్రశ్నించారు. ఆయా శాఖల్లో సమన్వయ లోపం కారణంగా అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తేట తెల్లమైంది. చాలా ఏళ్లుగా ఈ పథకం కొనసాగుతున్నప్పటికీ, ప్రజలకు అసలు విషయమే తెలియడం లేదు. అవగాహన లోపంతో చాలా మంది అప్లికేషన్లు పెట్టడం లేదు.
రూ.20 వేల ఆర్థిక సాయం : దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉండే కుటుంబానికి చెందిన యజమాని అనివార్య కారణాల రీత్యా మృతి చెందితే జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో భాగంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. పేద వర్గాలకు చెందిన కుటుంబ పెద్ద మరణించినప్పుడు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కులం, ఆదాయం, కుటుంబ సభ్యుల సర్టిఫికేట్, బ్యాంకు అకౌంట్ పత్రాలతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.
పాలనాధికారి నుంచి ప్రభుత్వానికి : స్థానిక మండలంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. మరణించిన వ్యక్తి వయస్సు 18 నుంచి 60 మధ్య ఉండాలి. మృతి చెందినప్పటి నుంచి రెండేళ్లలోపు ఎప్పుడైనా ఈ పథకానికి దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం కల్పిస్తున్నారు. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఆయా తహసీల్దార్లు స్థానికంగా విచారణ చేసి, అనంతరం ఆపై ఆర్డీవో కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్‌కు వస్తాయి. అనంతరం పాలనాధికారి ప్రభుత్వానికి నివేదికను అందిస్తారు.
అర్హుల కోసం ఆరా : దిశ సమావేశంలో సభ్యులు ఎన్‌ఎఫ్‌బీఎస్ కోసం ప్రశ్నించడంతో అధికారులు త్వరితగతిన అర్హుల కోసం ఆరా తీస్తున్నారు. ఆయా మండలాల్లో ఇటీవల కుటుంబ పెద్ద ఎవరైనా మరణించి ఉంటే సంబంధిత కుటుంబీకుల నుంచి వెంటనే అప్లికేషన్లు తీసుకోవాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఒక్క కామారెడ్డి జిల్లాలోనే చేయూత కింద 50,796 మంది వితంతు పింఛన్లు పొందడం గమనార్హం.
దాదాపుగా వాస్తవానికి వీరందరూ కుటుంబ పెద్దను పోగొట్టుకున్న వారే. కానీ చాలా మందికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై అవగాహన లేక దరఖాస్తులు చేయడం లేదు. ఈ చేయూత పింఛన్లు పొందుతున్న వారిలో ఎవరైనా అర్హులు ఉంటే, ఇప్పటికైనా వెంటనే ఎన్‌ఎఫ్‌బీఎస్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.