ఈ సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు – మీ సేవలోనే అప్లై చేసుకోవచ్చు!
మీ సేవ పరిధిలోకి మరో రెండు సర్వీసులు – వివాహ ధ్రువీకరణ నమోదు, వ్యవసాయేతర మార్కెట్ విలువ పత్రాలు ఇకపై మీసేవలోనే
Meeseva Services Expansion : ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వివిధ ధ్రువపత్రాలను సకాలంలో అందిస్తున్న మీసేవ సెంటర్లు ఇకపై మరిన్ని సేవలు అందించనున్నాయి. ధ్రువపత్రాల జారీలో జాప్యం నివారించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2011లో ‘సులభంగా వేగంగా నినాదంతో మీసేవ సెంటర్లు ఏర్పాటు చేసింది. మొదట కొన్ని రకాల సేవలతో ప్రారంభం కాగా దశల వారీగా వాటిని విస్తరించారు. రెవెన్యూ, రవాణా, పోలీస్, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, ఎలక్ట్రికల్, దేవాదాయ, వ్యవసాయ, రిజిస్ట్రేషన్, సివిల్ సప్లైయ్స్, విద్యా శాఖలకు చెందిన 300 రకాల పౌర సేవలు ప్రస్తుతం అందిస్తున్నారు.
నిన్న 9 నేడు 2 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల కిందట తొమ్మిది రకాల సేవలను మీసేవ పరిధిలోకి తీసుకొచ్చింది. రెవెన్యూ శాఖ పరిధిలోని గ్యాప్ సర్టిఫికెట్, పేరు మార్పిడి, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల పునఃజారీ(రీఇష్యూ), మైనార్టీ సర్టిఫికెట్, క్రిమీ లేయర్-నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్, వయో వృద్ధుల నిర్వహణ కేసుల పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నాయి. ఫారెస్ట్ డిఫార్ట్‌మెంట్ పరిధిలో వన్య ప్రాణుల దాడిలో మృతి చెందిన మనుషులు, జంతువులకు అందించే పరిహారం, కలప(టింబర్) డిపోలు, సామిల్ పర్మిషన్లు, క్రమబద్ధీకరణ, నిర్వహణ లాంటి 9 ఐచ్ఛికాలను జాబితాలో చేర్చారు. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన వివాహ ధ్రువీకరణ పత్రం(మ్యారేజ్ సర్టిఫికెట్), నాన్ అగ్రికల్చర్ మార్కెట్ వాల్యూ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అందుబాటులో మార్కెట్ విలువ పత్రాలు : గృహ నిర్మాణాలు, ఇతర బ్యాంకు లోన్ల కోసం వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువ ధ్రువపత్రాలనేవి తప్పనిసరి. గతంలో వీటిని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో మ్యానువల్‌గా తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు వాటిని సైతం మీసేవ ద్వారా అందిస్తున్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు, ఇళ్లు, స్థలం పత్రాలు, పన్ను రసీదు, జిల్లా, గ్రామం వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఏజెంట్ లేకుండా నేరుగా : ఇది వరకు వివాహ రిజిస్ట్రేషన్ కోసం టీ-పోలియో యాప్ ద్వారా లేదా ఏజెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మీసేవ కేంద్రం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
- భార్య, భర్త ఆధార్, వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమోలు, ఇరువైపులా పెళ్లి పత్రికలు(వెడ్డింగ్స్ కార్డ్స్), తల్లిదండ్రుల వివరాలు, రెండు పెళ్లి ఫొటోలు, ముగ్గురు సాక్షుల ఆధార్ కార్డులు, ఆలయంలో పెళ్లి చేసుకుంటే ఆలయం నుంచి, ఫంక్షన్‌హాల్‌లో చేసుకుంటే సంబంధిత యాజమాన్యం నుంచి తీసుకున్న రసీదులతో తగు పత్రాలను జత చేసి మీసేవ కేంద్రంలో అందజేయాలి.
- మీసేవ కేంద్రం నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదుచేసి స్లాట్‌ను బుక్ చేస్తారు. నిర్ణీత తేదీ, సమయం మేరకు దంపతులు 3 సాక్షులతో కలిసి సబ్ రిజిస్ట్రార్ ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తును పరిశీలించి వివాహ నమోదు పత్రం(మ్యారేజ్ సర్టిఫికెట్) జారీ చేస్తారు.
మీ సేవలో అందించే సేవల్లో కొన్ని ముఖ్యమైనవి :
- క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు
- భూముల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్
- స్టడీ గ్యాప్ డాక్యుమెంట్
- ఆధార్ సంబంధిత సేవలు
- క్రీమీలేయర్, నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు
- రెసిడెన్సీ సర్టిఫికేట్
- ఖాస్రా, పహాణీల లాంటి పాత ధ్రువీకరణ పత్రాలు
- ఆర్వోఆర్-1(బి) సర్టిఫైడ్ కాపీలు
- జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు
- విద్యుత్ బిల్లు చెల్లింపులు
- నీటి బిల్లు చెల్లింపులు
- లెర్నర్స్ లైసెన్స్ దరఖాస్తు
- ఆస్తి పన్ను చెల్లింపు