తెలంగాణ మహిళలకు గుడ్న్యూస్.. నేటి నుంచి చెక్కుల పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఇందిరా మహిళాశక్తి సంబరాలలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) నేటి నుంచి రూ.344 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేయనుంది. గ్రామీణ సంఘాలకు రూ. 300 కోట్లు, పట్టణ సంఘాలకు రూ. 44 కోట్లు అందజేయనున్నారు. ప్రమాద బీమా కింద మరణించిన సభ్యుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, రుణ బీమా కింద రుణాల మాఫీ అందిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్న్యూస్ చెప్పింది. ఇందిరా మహిళాశక్తి సంబరాలను పురస్కరించుకుని మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) భారీ ఆర్థిక చేయూతను అందించనుంది. వడ్డీలేని రుణాల పథకం కింద రూ. 344 కోట్ల విలువైన చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు నేటి నుంచి పంపిణీ చేయనుంది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కతో పాటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. తద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గుతుంది.
ప్రభుత్వం ఇటీవల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)కు రూ. 344 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ. 300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ. 44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శనివారం నుంచి ఈ నెల 18 వరకు ఈ చెక్కుల పంపిణీ జరుగుతుంది. ఈ నిధులు పంపిణీ చేసిన వెంటనే ఆయా సంఘాల ఖాతాల్లో జమవుతాయి. వడ్డీ చెక్కులతో పాటు, మహిళా సంఘాల సభ్యులకు అమలు చేస్తున్న ప్రమాద బీమా, రుణ బీమా పథకాల చెక్కులను కూడా పంపిణీ చేయనున్నారు.
మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబానికి బీమా పథకం కింద రూ. 10 లక్షలు అందజేయనున్నారు. రుణాలు తీసుకున్న మహిళా సంఘాల సభ్యులు మరణిస్తే.. వారి పేరిట ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది. గత ఏడాదిన్నర కాలంలో మరణించిన 385 మంది సభ్యుల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను, 2,502 మంది కుటుంబాలకు రుణ బీమా చెక్కులను నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, వారి ఆర్థిక స్వావలంబనకు గణనీయంగా దోహదపడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ చర్యలు మహిళల సాధికారతకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.