Monsoon Veggies That May Cause Food Poisoning

Monsoon Veggies That May Cause Food Poisoning

బీ అలెర్ట్.. వర్షాకాలంలో మీరు ఈ తప్పులు చేస్తున్నారా..? జబ్బులు వస్తాయి జాగ్రత్త..!

వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో కొన్ని కూరగాయలపై బాక్టీరియా, ఫంగస్, క్రిములు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. వాటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉంది. వర్షాలు కురుస్తున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని రకాల కూరగాయలను తినకుండా ఉండటం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరలు

పాలకూర, మునగాకు, చుక్కకూర, క్యాబేజీ లాంటి ఆకుకూరలు మామూలుగా ఆరోగ్యానికి మంచివి. కానీ వర్షాకాలంలో ఇవి తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. వర్షపు నీరు, తడి నేల వల్ల వాటిపై క్రిములు, సూక్ష్మజీవులు, పరాన్నజీవులు పేరుకుపోతాయి. మామూలు నీటితో కడిగినా ఇవి పూర్తిగా పోవడం కష్టం. పచ్చిగా లేదా సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

కాలీఫ్లవర్, బ్రోకలీ

కాలీఫ్లవర్, బ్రోకలీ నిర్మాణంలో చిన్న చిన్న రంధ్రాలుంటాయి. వాటిలో వర్షపు తేమ నిలిచిపోయే అవకాశం ఎక్కువ. అలాంటి తేమ ఉన్న చోట పురుగులు, క్రిములు, బ్యాక్టీరియా నివసిస్తాయి. సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే అజీర్తి కలగవచ్చు. అందుకే వీటిని తినే ముందు ఉప్పు నీటిలో నానబెట్టి బాగా ఉడికించడం అవసరం.

పచ్చి కూరగాయలు

వర్షకాలంలో దోసకాయ, టమాటా, ముల్లంగి లాంటి తేమ ఎక్కువగా ఉండే కూరగాయలను పచ్చిగా తినడం మంచిది కాదు. ఈ కాలంలో సలాడ్‌ ల రూపంలో పచ్చి కూరగాయలు తినడం వల్ల అజీర్ణం, విరేచనాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే వీటిని కొద్దిగా ఆవిరిపై ఉడికించడం లేదా మరిగించి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

సీజనల్ కూరగాయలే మేలు

వర్షాకాలంలో మన ప్రాంతంలో కాలానికి తగ్గట్టు లభించే కూరగాయలను వాడటం చాలా మంచిది. ఉదాహరణకు సొరకాయ, కాకరకాయ, బీరకాయ లాంటి కూరగాయలు తేలికగా జీర్ణమవుతాయి. శుభ్రపరచడం కూడా సులభం. వీటిని త్వరగా వండుకోవచ్చు కాబట్టి శరీరంపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వీటిలో తేమ తక్కువగా ఉంటుంది కనుక క్రిముల ముప్పు కూడా తక్కువ.

కూరగాయల శుభ్రత

తినే ముందు ప్రతి కూరగాయను చాలా సార్లు నీటితో కడగాలి. ఒకసారి కడిగిన తర్వాత ఉప్పు కలిపిన నీటిలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టడం వల్ల సూక్ష్మజీవులు తొలగిపోతాయి. ఇలాంటి కూరగాయలను మరిగించడం లేదా ఆవిరిపై ఉడికించడమే ఉత్తమం. పచ్చిగా తినే అలవాటు మానేయడం ఆరోగ్యానికి మంచిది.

వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. తినే కూరగాయల ఎంపిక, శుభ్రత, వండే పద్ధతిపై శ్రద్ధ పెట్టాలి. కాలానుగుణంగా, తక్కువ తేమ ఉన్న కూరగాయలు తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top