సర్కార్ కీలక నిర్ణయం – వ్యవసాయ భూముల్లో అడవుల పెంపకం – రైతన్నలకు డబ్బులే డబ్బులు! –
రాష్ట్రంలో ఆగ్రో ఫారెస్ట్రీ విధానం – వ్యవసాయ భూముల్లో అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం – రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షణలో నిబంధనలు అమలు
Forest Products on Agricultural Lands : దేశంలో రోజు రోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్యం ఎన్ని పాలసీలు తీసుకొచ్చినా వాటి ఫలితాలు మాత్రం కనబడటంలేదు. అయితే అడవుల విస్తీర్ణ పెంచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలో వ్యవసాయ భూముల్లో అడవుల పెంపకాన్ని (ఆగ్రో ఫారెస్ట్రీ) ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను జారీ చేసింది.
నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ – 2014 : వ్యవసాయ భూముల్లో పెంచిన చెట్ల నరికివేతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన కార్యదర్శులకు లేఖ రాసింది. నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ – 2014 ప్రకారం ఈ నిబంధనల రూపకల్పన జరిగింది. ఇది చెట్ల కొట్టివేత, అటవీయేతర ప్రాంతాల్లో కలప ఉత్పత్తులకు సర్టిఫికేషన్ జారీకి ఉపయోగపడుతుంది.
ఆగ్రో ఫారెస్ట్రీ విధానం : దీనివల్ల రైతులు, భూ యజమానులు, ఇతర భాగస్వాములు ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అనుసరించడానికి దోహదపడుతోంది. దేశంలో ఇంధన వనరులు, కలప, దాణాలకు పెరుగుతున్న డిమాండును పరిశీలించి దానిని అందుకోవడానికి ఈ పాలసీ దోహదం చేస్తుంది. దిగుమతులతోపాటు సంప్రదాయ అడవులపై ఒత్తిడిని తగ్గించడానికి వీలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ముసాయిదా నిబంధనలను స్వీకరించి రాష్ట్రాల్లో ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించటం వల్ల రైతులకు అదనపు ఆదాయంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షణలో : ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రైవేటు భూముల్లో పెంచిన కొన్ని రకాల జాతుల చెట్లను కొట్టి, రవాణా చేసుకోవడానికి ఎలాంటి పరిమితులు లేవు. ఇప్పటికే రాష్ట్రాలు కల్పిస్తున్న మినహాయింపులకు ఈ ముసాయిదా నిబంధనలు ఎలాంటి అడ్డంకులు కల్పించవు అని కేంద్రం పేర్కొంది. ఈ నిబంధనల అమలు బాధ్యతను రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది.
ఇలా పెంచాలి :
వ్యవసాయ భూముల్లో అటవీ ఉత్పత్తులను పెంచాలనుకున్నవారు నేషనల్ టింబర్ మేనేజ్‌మెంట్ సిస్టంలో పేర్లు నమోదు చేసుకోవాలి. అందులో భూమి, యజమాని వివరాలు పొందుపరచాలి.
పేరు నమోదు చేసుకొనేటప్పుడే ఏయే జాతుల మొక్కలను పెంచబోతున్నదీ వివరాలు చెప్పాలి. ఇప్పటికే మొక్కలు నాటి ఉంటే అవి ఏ జాతికి చెందినవి, వాటిని నాటిన కాలం, ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నాయి అనే వివరాలు వారికి అందించాలి.
రాష్ట్ర స్థాయి కమిటీ నిర్దేశించిన సమయం ప్రకారం దరఖాస్తుదారులు మొక్కల వివరాలను అప్‌డేట్ చేస్తూ వెళ్లాలి. అందులో మొక్క చుట్టుకొలత, ఎత్తు గురించి పేర్కొనాలి. జియోట్యాగ్ చేసిన ఫైల్ అప్‌లోడ్ చేయాలి.
వ్యవసాయ భూముల్లో ఇదివరకే ఉన్న చెట్లను కొట్టేయాలనుకుంటే అవి 10కి మించి ఉంటే వెంటనే నేషనల్ టింబర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత గుర్తింపు పొందిన ఏజెన్సీ దాన్ని తనిఖీచేసి చెట్ల నరికివేతకు అనుమతులు జారీ చేస్తుంది.