ఫోర్టిఫైడ్ ఫుడ్ ఐటమ్స్ కొంటున్నారా? – నిజంగానే పోషకాలున్నాయో లేదో ఇలా పరీక్షించండి – FORTIFIED FOODS NUTRIENTS
‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ ఎంపిక చేసిన ల్యాబ్‌లలో పరీక్షించుకోవచ్చు – దేశవ్యాప్తంగా 52 హైదరాబాద్‌లో 2 ప్రయోగ శాలలు – ఇకపై అనుమానాలుంటే నేరుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసే అవకాశం
Fortified Really Contain Nutrients : శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మనం తింటున్న ఆహార పదార్థాల్లో ఆశించిన పోషకాలుంటున్నాయా? ఇటీవల చాలా మంది ముఖ్యంగా మహిళలు ఐరన్, బీ9, బీ12 విటమిన్ల లోపాలతో బాధపడుతున్నారు. దీన్ని నివారించేందుకు ఫోర్టిఫైడ్ రైస్, ఫోర్టిఫైడ్ మైదా, ఫోర్టిఫైడ్ గోధుమపిండిని వినియోగిస్తున్నారు. వీటిలో ఐరన్, బీ9, బీ12 విటమిన్లు ఉన్నాయంటూ వాణిజ్య కంపెనీలు చేస్తున్న ప్రచారాన్ని వాస్తవాలని వారు నమ్ముతున్నారు. కానీ, వాటిలో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పోషకాలు ఉండటం లేదంటూ దేశవ్యాప్తంగా ‘భారత ఆహార భద్రతా ప్రమాణాల మండలి’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కి ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలో మార్కెట్‌లో ఫోర్టిఫైడ్ రైస్ పేరుతో అమ్మే బియ్యంలో ఆ ప్యాకెట్‌పై ముద్రించిన పోషకాలున్నాయో, లేదో వినియోగదారులు తనిఖీ చేసుకునేందుకు వీలుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 52 ప్రయోగశాలలను ఎంపిక చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్‌లో 2- విమ్‌టా, బ్యూరో వెరిటస్ ఇండియా ప్రయోగశాలలు ఉన్నాయి.
ఏది ఎంతెంత ఉండాలి? : కిలో ఫోర్టిఫైడ్ రైస్, మైదా, గోధుమ పిండిలో ఐరన్ 28 నుంచి 42.5 మిల్లీ గ్రాములు (మి.గ్రా.), జింక్ 10 నుంచి 15 మి.గ్రా., ఫోలిక్ ఆమ్లం 75 నుంచి 125 మి.గ్రా., విటమిన్ బీ9, బీ12లు 0.75 నుంచి 1.25 మి.గ్రా. వరకు
వంద శాతం నిర్వచనం లేనే లేదు : కొన్ని ఆహార పదార్థాలపై తయారీ సంస్థలు ‘100 శాతం నాణ్యత లేదా స్వచ్ఛత లేదా నాచురల్’ అని ముద్రిస్తున్నాయి. ఆహార భద్రతా ప్రమాణాల చట్టంలో ఎక్కడ 100 శాతం నాణ్యత, స్వచ్ఛతకు పూర్తి నిర్వచనం లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. ఇకపై ఏ ఆహార ఉత్పత్తిలోనూ 100 శాతం అని ప్యాకెట్ పైన ముద్రించవద్దని హెచ్చరించింది.
ఇకపై ఇలా చెక్ చేసుకున్నాకే :
- మార్కెట్లలో నిత్యావసరాలను ప్రధానంగా ఆహారోత్పత్తులను కొనేవారు అప్రమత్తంగా ఉండాలి. రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్యాకెట్‌పై తయారీదారు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్ నంబరు ఉందో, లేదో తనిఖీ చేయాలి. అనుమానాలుంటే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెబ్‌సైట్‌లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
- ప్యాకెట్‌పై ముద్రించిన తేదీ ప్రకారం వినియోగ గడువు (ఎక్స్‌పైరీ డేట్) ఉందో, ముగిసిందో పరిశీలించాకే కొనాలి.
ఎఫ్సీఐకి సరఫరా చేయాలన్న నిబంధన : పేదల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంగా రేషన్ వినియోగదారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు మధ్యాహ్న భోజనం పథకానికి పోషక విలువలతో కూడిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఇకపై ఆహార భద్రత కార్డుల ద్వారా పేదలకు కూడా అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించి కస్టమ్ మిల్లింగ్ చేయిస్తున్న క్రమంలో ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్‌ను తయారు చేసి ఎఫ్‌సీఐకి సరఫరా చేయాలన్న నిబంధన విధించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో : ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో మర ఆడించి ఎఫ్‌సీఐకి అప్పగించేవారు. సాధారణ బియ్యం వరకు మిల్లింగ్ సరిపోతుంది. పోషకాలతో కూడిన బియ్యం పంపిణీ చేయాలన్న నిర్ణయంతో ప్రతి మిల్లులో ప్రత్యేకంగా బ్లెండింగ్ యంత్రాన్ని బిగించారు. పారాబాయిల్డ్, రా రైసు మిల్లుల్లోనూ ఈ బ్లెండింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో సరఫరా చేయాల్సి ఉండటంతో ప్రభుత్వానికి అందజేసే బియ్యంలో పోషకాలను చేర్చాల్సి ఉంటుంది. బ్లెండింగ్ యూనిట్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు.