ఐటీ జాబ్‌ను వదులుకొని సేంద్రీయ వ్యవసాయం – ఆర్గానిక్‌గా ఫుడ్ వ్యాపారం చేస్తున్న దంపతులు – SRESHTE ORGANICS LACHANNAGUDIPUDI
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న టెకీ దంపతులు – ఆర్గానిక్ పద్ధతిలో ఆహార పదార్థాల తయారీ, రైతులతో కలిసి పనిచేస్తూ బైబ్యాక్ మోడల్ అమలు
Tech Couple Organic Food Business in Guntur District: సాఫ్ట్వేర్ ఉద్యోగం, లక్షల్లో జీతం, ఇంకేం కావాలి ఇది సరిపోదా? జీవితానికి అనిపిస్తుంది కదా! కానీ ఆ యువజంట మాత్రం దాంతో సరిపెట్టుకోలేదు. సహజసిద్ధమైన ఆహార పదార్థాలను అందరికీ అందించాలని నిశ్చయించుకున్నారు. కార్పొరేట్ కొలువులకు స్వస్తి పలికి ఆర్గానిక్ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారీ గుంటూరుకు చెందిన మణికంఠ, దుర్గాపావని దంపతులు. ఆ సంగతులేంటో ఈ కథనంలో చూసేద్దాం.
ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. కానీ అందుకు తగ్గట్టుగా ఆహారం నాణ్యత ఉంటడం లేదు. అది గ్రహించిన ఆ భార్యభర్తలు సహజసిద్ధమైన ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా అందిస్తున్నారు. రైతుల దగ్గర గిట్టుబాటు ధరలో పంట కొనుగోలు చేస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. వినియోగదారులకు ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలమను అందిస్తున్నారు.
గుంటూరు జిల్లా లచ్చన్నగుడిపూడికి చెందిన ఈ దంపతులు ఐటీ ఉద్యోగులు. మణికంఠ ఇన్ఫోసిస్, దుర్గాపావని యాక్సెంచర్‌లో జాబ్ చేస్తున్నారు. కానీ ఆ ఉద్యోగం వారికి సంతృప్తిని ఇవ్వలేదు. వ్యవసాయంపై మక్కువతో సేంద్రియ సాగునే జీవిత ఆశయంగా మలుచుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని పండించడంతో పాటు రైతుల జీవితాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.
మణికంఠ దుర్గాపావనిలు ఇద్దరు వ్యవసాయ కుటుంబ నుంచి వచ్చినప్పటికి సాగుపై ఎలాంటి అనుభవం లేదు. కొడైకెనాల్లోని “సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ” పద్ధతిలో రెండేళ్లు శిక్షణ తీసుకున్నారు. విత్తనాల ఎంపిక నుంచి సాగు విధానాలు, పంటల ప్రాసెసింగ్, ఉప ఉత్పత్తుల తయారీలో అవగాహన పెంచుకున్నారు. ముందుగా స్వగ్రామంలో సహజ పద్ధతుల్లో ఆహర పదార్థాలను తయారు చేస్తూ శ్రేష్టే ఆర్గానిక్ సంస్థను ప్రారంభించామని చెబుతున్నారీ దంపతులు.
బైబ్యాక్ మోడల్ అమలు: ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రసాయనలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దానికి చెక్ పెట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నారీ దంపతులు. ప్రజలలో రోజుకీ పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలను అధిగమించేలా ఈ ఆర్గానిక్ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయని చెబుతున్నారీ దంపతులు.
రైతులతో కలిసి పనిచేస్తూ బైబ్యాక్ మోడల్ అమలు చేశారు. రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా జీవామృతం, ఘనజీవామృతం మాత్రమే వాడాలని రైతులకు సూచిస్తారు. సేంద్రియ విధానంలో పండించే పంటకు ఎంత ధర ఇస్తామనేది ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. దీని ద్వారా రైతు నష్టపోకుండా ఉంటాడని చెబుతున్నారీ భార్యభర్తలు.
శ్రేష్ఠే ఆర్గానిక్ పుడ్స్: శ్రేష్ఠే ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులలో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం 400 కు పైగా సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. అలాగే చిరుధాన్యాలతో చేసిన మిఠాయిలు, చిరుతిళ్లను కూడా ప్రవేశపెట్టారు. ప్రజల ఆరోగ్యంలో వచ్చిన మార్పులనే తమ విజయంగా పరిగణిస్తామని చెబుతున్నారు. సేంద్రియ ఆహారం ఒక జీవన శైలిగా మారాలని వీరు చెబుతున్నారు.
ఈ ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలని శ్రేష్టే ఆర్గానిక్ పేరుతో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వాట్సప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సొంతగా యాప్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. వ్యవసాయ రంగంలో రసాయనాల వాడకాన్ని తగ్గించి సహజ పద్ధతులను ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు.
“పంటలను మధ్యవర్తి లేకుండా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నాం. ప్రకృతి ఆధారిత పంటలకు అందరూ దూరమైపోయాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేము ఈ శ్రేష్ఠే ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను స్థాపించాం.సేంద్రియ విధానంలో పండించే పంటకు ఎంత ధర ఇస్తామనేది ముందుగానే ఒప్పందం చేసుకుంటాం. దీని ద్వారా రైతు నష్టపోకుండా ఉంటాడు. ప్రస్తుతం వాట్సప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యంలో వచ్చిన మార్పులనే మా విజయంగా భావిస్తాం“-మణికంఠ, శ్రేష్టే ఆర్గానిక్ సంస్థ వ్యవస్థాపకుడు