పిడుగులను పసిగట్టే ‘దామిని’ – మరెన్నో విషయాలు చెప్పే మేఘ్‌దూత్ – DAMINI LIGHTNING ALERT APP
దామిని పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం – అపాయాన్ని ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తున్న యాప్ – మరిన్ని వాతావరణ సమాచార యాప్‌లు మీకోసం.
Damini Lightning Alert App: వర్షాకాలం వచ్చిందంటే చాలు నిత్యం ఎక్కడో ఒకచోట పిడుగులు పడుతూనే ఉంటాయి. వాటి తీవ్రతకు ప్రజలు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం తరచూ జరుగుతూ ఉంటుంది. 3 రోజుల క్రితం విజయనగరం జిల్లా రేగిడి మండలం వెంకటరాయపురంలో పిడుగుపడి పొలంలో పనులు చేస్తున్న రైతు మృతిచెందారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పలు చోట్ల నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల నుంచి బయటపడడానికి కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ (Ministry of Earth Sciences) ‘దామిని’ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా అపాయాన్ని ముందుగానే గుర్తించి అప్రమత్తం కావచ్చు.
దామిని లైట్నింగ్ అలర్ట్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఫోన్ యూజర్లకు యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారంతా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో సమాచారాన్ని పొందడానికి మనకి కావాల్సిన భాషను ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం అక్కడ అడిగే కొన్ని వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జీపీఎస్ లొకేషన్ తెలుసుకోవడం కోసం దామిని యాప్‌కు అనుమతి ఇవ్వాలి. మన సమీపంలో పిడుగు పడే అవకాశం ఉంటే ఈ దామిని యాప్ ద్వారా ముందస్తు సమాచారం తెలుస్తుంది. ఆ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో సైతం షేర్ చేసుకోవచ్చు. తద్వారా ఇతరుల ప్రాణాలను కూడా మనం కాపాడవచ్చు.
అన్ని జాగ్రత్తలూ ఈ యాప్‌లోనే: పిడుగు పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఈ యాప్‌లో ఉన్నాయి. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కిందకు వెళ్లడం ప్రమాదమని హెచ్చరిస్తుంది. చెట్లు పిడుగును త్వరగా ఆకర్షిస్తాయని, అందుకే వెళ్లకూడదని చెబుతుంది. అందులోనూ నిటారుగా ఉన్న చెట్టు కిందకు అస్సలు వెళ్లొద్దని ఈ యాప్ హెచ్చరిస్తుంది. మెరుపులు ఎక్కువగా ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ల కూడదని, ఆరుబయట ఉంటే ఇళ్లలోకి వెళ్లాలంటూ సూచిస్తుంది.
అదే విధంగా పిడుగు పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైతం యాప్‌లో ఉంటాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించకపోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రమాదాల నుంచి బయట పడేందుకు, పిడుగుపాటును ముందుగానే గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ దామిని యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
రైతులకు ఉపయోగపడే మరిన్ని యాప్‌లు: వర్షాలు, పిడుగులు, ఉరుములు, మెరుపులు తదితర సమాచారాన్ని ప్రజలు, రైతులు ముందుగానే తెలుసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం దామిని, రేయిన్ అలారమ్, మేఘ్‌దూత్, కిసాన్ సువిధ తదితర యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
మేఘ్‌దూత్ (Meghdoot App) యాప్‌లో రానున్న 4 రోజుల వాతావరణ సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. వారం క్రితం నాటి సమాచారం, ప్రస్తుత సమయంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం తదితర సమాచారాన్ని అందిస్తుంది. వర్షాల గురించి సమాచారం, వివిధ ప్రాంతాల్లోని వర్ష సూచనను తెలుసుకునేందుకు రెయిన్ అలారమ్ యాప్ (Rain Alarm App) ఉపయోగపడుతుంది. కిసాన్ సువిధ యాప్ ద్వారా వాతావరణ వివరాలతోపాటు 5 రోజుల ముందస్తు హెచ్చరికలను, మార్కెట్ ధరలను, బీమా సమాచారాన్ని, ఎరువుల గురించి, విత్తనాలు, నీటి నిర్వహణపై పలు సూచనలు కిసాన్ సువిధ యాప్‌లో (Kisan Suvidha App) పొందొచ్చు.