అన్నదాత సుఖీభవ జాబితాలో మీ పేరు లేదా – ఇలా సరిచేసుకోండి – ANNADATA SUKHIBHAVA SCHEME 2025
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకంలో రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అర్హుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసిన కూటమి ప్రభుత్వం – రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉండటంతో సరిదిద్దాలని ఆదేశం
Mistakes in Annadata Sukhibhava Beneficiary List: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులు ఏటా అతివృష్టి లేదా అనావృష్టితో నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి రైతులకు భరోసా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం పీఎం సమ్మాన్ నిధిలో రూ.6 వేలను 3 విడతలుగా అందిస్తోంది. దీనికి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నుంచి రూ.14 వేలను కలిపి మొత్తం రూ.20 వేలను రైతుల ఖాతాల్లో త్వరలో జమ చేయనుంది.
ఇప్పటికే సంబంధిత అధికారులు జాబితాను సిద్ధం చేశారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 1,98,514 కుటుంబాలు ఈ పథకానికి ఎంపిక కాగా తాజాగా మృతి చెందిన వారు ఎవరైనా ఉంటే మ్యుటేషన్ చేయించుకుంటే ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించింది. ఆ విధంగా మండలాల్లో అధికారులు వివరాలను నమోదు చేస్తున్నారు.
కుటుంబంలో ఒకరికి మాత్రమే: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ పన్నులు చెల్లించే వారిని ఈ పథకంలో అనర్హులుగా చూపించారు. సమస్య ఉన్న వారు ఆడిటర్‌ను సంప్రదిస్తే ధ్రువపత్రం ఇస్తారు. అది వ్యవసాయ అధికారులకు ఇస్తే పరిశీలించి జాబితాలో నమోదు చేస్తారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. వెబ్‌ల్యాండ్‌లో రైతు ఆధార్ సంఖ్య తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను సంప్రదించి సరి చేసుకోవాలి. పేరు నమోదైన రైతు మృతి చెందినట్లయితే అందులో మార్పు జరగకపోయినా సరే వర్తించదు.
పొదలకూరు వ్యవసాయాధికారి ప్రతాప్ పథకానికి సంబంధించి మాట్లాడుతూ పొదలకూరు మండలంలో 105 మందిని అనర్హులుగా గుర్తించామని, వీరి కోసం మరలా ప్రభుత్వం గడువు పెంచిందని తెలిపారు. జాబితాలో పేరు లేకపోయినట్లయితే వ్యవసాయ కేంద్రాల్లో సహాయకులను సంప్రదించి సరిదిద్దుకోవాలని సూచించారు.
ఎన్పీసీఐ లింక్ తప్పనిసరి: అర్హులైన వారి బ్యాంకు ఎన్పీసీఏ లింక్ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఇ.సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హుల జాబితా వివరాల్లో దాదాపు 6,900 కుటుంబాలు వారి ఆధార్ నంబరుకు బ్యాంక్ ఎన్పీసీఐ లింక్ లేక అనర్హతకు గురవుతున్నాయని అధికారులు అన్నారు. తిరస్కరణ జాబితాలో ఉన్న వారు గమనించి సరిచేసుకోవాలని వివరించారు.
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో రైతుల కుటుంబాలకు రూ.20 వేల చొప్పున ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం అర్హుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. రెవెన్యూ రికార్డుల్లో కొన్ని తప్పులు ఉండటంతో వాటిని సరిదిద్దాలని వ్యవసాయశాఖ సిబ్బంది రెవెన్యూ యంత్రాంగానికి తిరిగి పంపించారు. ఈ దస్త్రాల పరిష్కారంలో అక్కడ జాప్యం చోటుచేసుకుంటోంది. వేలల్లో తప్పులను యుద్ధప్రాతిపదికన సరిచేయాల్సి ఉంది. ఇది పూర్తయితేనే అర్హులకు లబ్ధి చేకూరుతుంది.
సమన్వయంతో పరిష్కారం: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ఆన్‌లైన్ పోర్టల్‌లో అర్హులైన రైతుల ఎంపిక బాధ్యత గ్రామస్థాయిలో రైతు సేవాకేంద్రం సిబ్బందికి అప్పగించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన జాబితాను మండల వ్యవసాయాధికారి, తహసీల్దారు పరిశీలించి ఆమోదం తెలపాలి. రైతుల భూములకు సంబంధించిన వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పరిశీలిస్తున్నప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి.
వీటిని రెవెన్యూ యంత్రాంగం సకాలంలో పరిష్కరించడం లేదు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది పరస్పర సహకారంతో త్వరితగతిన నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు. తప్పులు సరిదిద్దితేనే రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నందున కలెక్టర్లు దృష్టి సారించి వేగవంతం చేయాలని ఆదేశించారు.
సరిదిద్దాల్సినవి ఇవే
- రైతుల పట్టాదారు పాసుపుస్తకాలకు తప్పు ఆధార్ మ్యాప్ కావడం.
- ఒకే ఆధార్ నంబరును ఎక్కువమంది పట్టాదారులకు నమోదు చేయడం.
- రీసర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లకు ఎక్కువ మొత్తం విస్తీర్ణం నమోదు కావడం.
- రీసర్వే గ్రామాల్లో ఒకే విస్తీర్ణం చాలామందికి నమోదవడం.
- పట్టాదారులకు ఆధార్‌నంబరు అనుసంధానం కాకపోవడం.