రైతు ఆలోచన అదిరింది – పైరుకు పూర్తి స్థాయిలో సాగు నీరు – FARMING WITH WATER PIPES IN KUDERU
పొలమంతా ఎక్కడ కావాలంటే అక్కడ తడిసేలా పైపులను నెలకొల్పిన రైతు – 14 ఎకరాల పొలంలో రెండు మడుల మధ్యలో వినూత్నంగా ఏర్పాటు.
Farmer Installed Pipes on All Sides To Irrigate His Field: పొలానికి నీరు పెట్టాలంటే కూలీలు దొరక్క అవస్థలు పడే పరిస్థితి ఉంది. ఒకవేళ పొలం అంతా నీరు పారే విధంగా పంట కాలువలు తీస్తే స్థలం వృథా, ప్లాస్టిక్, రబ్బరు పైపులతో మడి దగ్గరికి పైపును ఎత్తుకుని తీసుకెళ్లడం, ఆ మడి అయ్యాక పక్క మడికి జరపడం, పొరపాటున కూలీలు మర్చిపోతే పొలానికి నీరు ఎక్కువైపోవడం, పైపుకు కన్నాలు పడకుండా జాగ్రత్తగా చూసుకోవడం ఇదంతా ఎంతో కష్ట సాధ్యమైన ప్రక్రియ, ఖర్చుతో కూడుకున్నది.
ఆలోచన అదుర్స్: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కుడేరుకు చెందిన రైతు సిహెచ్‌ఎస్‌ఎస్‌వి ప్రసాద్ పొలానికి నీరందించేందుకు సులువైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. తనకు గల 14 ఎకరాల పొలంలో రెండు మడుల మధ్యలో నుంచి 5 అడుగుల లోతులో 4 ఇంచుల మందం ఉండే పైపును భూగర్భంలో వేసుకున్నాడు. దానికి 3 ఇంచుల పైపు అమర్చి రెండు వైపులా మడులు తడిచేందుకు వీలుగా వతతో ఉండే ట్యాపులను ఏర్పాటు చేసుకున్నారు.
అనంతరం మోటారు వేసి ఏ మడి తడవాలో అక్కడ ఉన్న పైపు వత తీస్తే చాలు ఆ మడికి మాత్రమే నీరు అందుతుంది. పదేళ్ల కిందట సుమారు రూ.3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసుకున్న ఈ పైపుల వ్యవస్థ కారణంగా కూలీల కొరతకు పరిష్కారంతో పాటు నీటి వృథా సైతం తగ్గి సాగుకు ఎంతో ఉపయుక్తంగా ఉందని ఆయన తెలిపారు.
ORGANIC FERTILIZER WITH WATER HYACINTH: పశ్చిమగోదావరి జిల్లాలో గుర్రపుడెక్కతో వినూత్న రీతిలో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. పంట కాలువల్లో విపరీతంగా పెరిగే ఈ తీగతో సాగునీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతుంటాయి. వీటి కారణంగా అనేక సంవత్సరాలుగా అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం సైతం ప్రతి సంవత్సరం భారీగా ఖర్చు చేస్తోంది. గుర్రెపుడెక్క సమస్యకు పరిష్కారం చూపేందుకు పశ్చిమగోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణి వినూత్నంగా ఆలోచించారు.
గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీకి కలెక్టర్ చదలవాడ నాగరాణి శ్రీకారం చుట్టారు. డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో కుండీల్లో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీని ప్రయోగాత్మంగా మొదలుపెట్టారు. దీనివలన రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు, స్థానిక మహిళలకు ఉపాధి సైతం దక్కుతోంది.
3 అడుగుల వెడల్పు, 9 అడుగుల పొడవు ఉండే కుండీల్లో కింద గడ్డిని పొరగా వేసి, ఆపైన ముక్కలుగా చేసిన గుర్రపుడెక్క, దానిపైన రెండు అంగుళాల మందంలో ఆవుపేడను ఏడు నుంచి ఎనిమిది పొరలుగా వేశారు. అనంతరం దానిని 21 రోజుల పాటు అలా వదిలేశారు. అదే విధంగా మైక్రోబయల్ కల్చర్‌ను ఉపయోగించి త్వరగా కంపోస్టింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. అనంతరం ఏర్పడిన మిశ్రమాన్ని ఏడు వారాల తర్వాత గుళికలుగా తయారుచేశారు. ఎరువు తయారీ ప్రాంతంలో క్రిమికీటకాలు ఉండే ప్రమాదం ఉండటంతో దీనిని ఇళ్లకు, గోదాములకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.