ఉద్యోగం వదిలి పొలం వైపు కదిలి – డ్రాగన్ ఫ్రూట్ సాగుతో లక్షలు సంపాదిస్తున్న యువకుడు – DRAGON FRUIT FARMING
సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి పొలం వైపు కదిలిన వెంకటేశ్వరరావు – అంజీరా, డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు – మంచి యాజమాన్య పద్ధతులతో 5-8 టన్నుల వరకూ దిగుబడి
Dragon Fruit Cultivation: ఎంసీఏ చదువు, పెద్ద ప్రతిష్ఠాత్మక సంస్థలో కొలువు. సంవత్సరానికి ఏడాదికి రూ.10 లక్షల ప్యాకేజీ. ఇవేవీ అతనికి సంతృప్తి ఇవ్వలేదు. పొలంతో స్నేహం చేయాలి, సరికొత్త పంటలు పండించాలనే తపనతో తన ఉద్యోగానికి స్వస్తి పలికాడు. కొలువులో కొనసాగమని అందరూ చెప్పినప్పటికీ తన మనసు చెప్పిన మాటలకే ఓటేశారు. వినూత్న పద్ధతులతో సాగుతూ డ్రాగన్, అంజీరా వంటి పంటలతో లాభాలు పండిస్తున్నారు. వెంకటేశ్వరరావు అనే యువకుడు.
పొలం మీద మమకారం: ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరామ్పురానికి చెందిన యువకుడు వెంకటేశ్వరరావుకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే చాలా ఇష్టం. తండ్రితో పాటు తనూ పొలం పనులకు వెళ్లేవారు. ఏడాది మొత్తం కష్టపడినా చివరికి మిగిలేది అప్పుల తిప్పలేనని వెంకటేశ్వరరావు గ్రహించాడు. అప్పటి నుంచి లాభాలు తెచ్చిపెట్టే పంటలు పండించాలనే ఆలోచనలు అతనికి ఉండేవి.
కానీ చదువుకుని వ్యవసాయం చేస్తే ఒకవేళ మంచి ఫలితాలు రాకపోతే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారనే భావనతో ముందడుగు వేయలేదు. అదే సమయంలో హైదరాబాద్లో ఏడాదికి రూ.10 లక్షల ప్యాకేజీతో కూడిన ఉద్యోగం వచ్చింది. 2011 నుంచి 2020 వరకు ఉద్యోగం చేశారు. అందులో సంతృప్తి లేకపోవడంతో ఉద్యోగం వదిలి ఊరొచ్చేశారు.
వినూత్నమైన ఆలోచనలతో: తండ్రి సాగు చేస్తున్న నాలుగు ఎకరాల పొలంలో సాధారణ పంటలకు వెంకటేశ్వరరావు స్వస్తి చెప్పారు. అందులోని మూడెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ వేశారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టుతో సాగులో మెలకువలను తెలుసుకున్నారు. పుస్తకాలను సైతం పరిశీలించారు. నూతన సాగు ఒరవడిని ఆకళింపు చేసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాధారణంగా ఎకరానికి 5 టన్నుల దిగుబడి వస్తుంది. దీనికి మంచి యాజమాన్య పద్ధతులతో 5-8 టన్నుల వరకూ దిగుబడిని సాధిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఎకరంలో అంజీరా సాగు మొదలుపెట్టారు. సాధారణంగా ఎకరానికి 600 కిలోల దిగుబడి వస్తుంది. కానీ వెంకటేశ్వరరావు చొరవతో 700 కిలోలపైగా దిగుబడి సాధిస్తున్నారు. ఏటా రూ.10-12 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు.
విమర్శించిన వారికి సాగుతో బదులు: అంత జీతం వస్తున్న ఉద్యోగం వదిలి తిరిగి ఇంటికి రావడంతో గ్రామస్థులు, బంధువుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు వ్యవసాయం చేసేవారే సాగు మానేసి హైదరాబాద్ వెళుతుంటే ఉద్యోగం వదిలి ఇక్కడేం చేస్తావని అందరూ మాట్లాడారు. కానీ వెంకటేశ్వరరావు అవేమీ పట్టించుకోలేదు. సాగు పద్ధతుల అధ్యయనంపై పూర్తి దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1.5 లక్షల ఉద్యాన రాయితీ ఆసరాగా నిలిచింది. మొదటి పంట దిగుబడితోనే విమర్శించిన వారి ప్రశ్నలకు బదులిచ్చారు. ఉద్యోగంలో ఏడాదిలో వచ్చే ఆదాయం కంటే ఎక్కువ సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.