తండ్రి కోరికను తమ కలగా మార్చుకుని ఒకే కుటుంబంలో ముగ్గురికి పోలీసు ఉద్యోగాలు – FAMILY MEMBERS GET GOVT JOBS TG
కరీంనగర్ జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చందిన ఒకే కుటుంబంలో ముగ్గురికి పోలీసు ఉద్యోగాలు – కుమారులు కేంద్ర బలగాల్లో – కుమార్తె ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా కొలువు
Karimnagar Three Siblings get Police Jobs : ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలతో పాటు ఉద్యోగానికి సంబంధించిన సబ్జెక్టులు, ఇతర కోచింగులు అంటూ ఎంతో సమయం వెచ్చించి కష్టపడి చదివే వారికే సాధ్యమవుతోంది. ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే తల్లిదండ్రులు సంబరపడతారు. బంధువులు, స్నేహితులు పొగడ్తలతో ముంచెత్తుతారు. అలాంటిది ఒకరికి, ఇద్దరికి కాదు ఇంట్లో ఉన్న ముగ్గురికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే ఆ సంతోషానికి హద్దులు అవధులు ఉండవు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒకే కుటుంబానికి చెందిన సోదరులు, సోదరి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరిచేత ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళితే,
సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చందిన పోతుల ఇందిర చంద్రయ్య దంపతులు ఉన్నారు. వారిది వ్యవసాయి కుటుంబం. ఉన్న రెండు ఎకరాల్లో ఒక వైపు వ్యవసాయం చేస్తూ మరోవైపు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అజయ్, శ్రావణ్, నవత సంతానం. వీరిలో పెద్ద కుమారుడు అజయ్ కరీంనగర్‌లోని ప్రతిమ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇటీవల సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఎంపికయ్యారు.
ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివి : కుమార్తె నవత ప్రభుత్వ విద్యాలయాల్లోనే పీజీ చదివింది. గత సంవత్సరం ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ప్రస్తుతం తిమ్మాపూర్‌లో విధులు నిర్వహిస్తోంది. చిన్న కుమారుడు శ్రావణ్ సైతం సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో లఖ్‌నవూలో విధులు నిర్వహిస్తున్నారు.
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అయినా, ప్రభుత్వ విద్యాలయాల్లో చదివి, కష్టపడే తత్వం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని వీరు నిరూపించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు అందుకోవడమేకాక పలువురికి ఆదర్శంగా నిలిచారు.
నాన్న కోరికే నా కల : తాను స్కూల్లో చదివే రోజుల్లో నాన్న చంద్రయ్య తనను కష్టపడి చదివి పోలీసు ఉద్యోగం సాధించాలని చెప్పేవారని పోతుల అజయ్ తెలిపారు. తాను మాత్రం డాక్టర్ కావాలనే కలతో ఎంబీబీస్ పూర్తి చేశానని అన్నారు. తమ్ముడు కేంద్ర బలగాల్లో (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్‌గా ఎంపిక కాగా, చెల్లెలు సైతం ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారని అన్నారు. నాన్నకు తనని పోలీస్ చేయాలనే కోరిక ఉండడంతో తాను కూడా సీఏపీఫ్ పరీక్ష రాశానని చెప్పారు. ఇటీవల తుది ఫలితాల్లో అసిస్టెంట్ కమాండెంట్ (సీఆర్పీఎఫ్)గా ఎంపికైనట్లు వెల్లడించారు.
“నేను పాఠశాలలో చదువుతున్న రోజుల్లో మా నాన్న చంద్రయ్య నన్ను కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగం సాధించాలని చెప్పేవారు.నేను మాత్రం డాక్టర్ కావాలనే కలతో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. తమ్ముడు కేంద్ర బలగాల్లో , చెల్లి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు సాధించారు. నాన్నకు నన్ను పోలీస్ చేయాలని కోరిక ఉండటంతో నేనూ సీఏపీఫ్ పరీక్ష రాశాను. ఇటీవల తుది ఫలితాల్లో అసిస్టెంట్ కమాండెంట్ (సీఆర్పీఎఫ్)గా ఎంపికయ్యాను. దీంతో నాన్న కోరిక కూడా తీరింది.” – పోతుల అజయ్