PET Plastic Recycling Machines in Hyderabad

వాడేసిన బాటిల్స్ ఈ మెషీన్​లో వేయండి – క్యాష్​ బ్యాక్​, కూపన్లు పొందండి! – PET PLASTIC RECYCLING MACHINES

2025 నాటికి హైదరాబాద్​లో ప్లాస్టిక్ వ్యర్థాలు 495 టన్నులకు చేరనుందని సీఎస్​ఐఆర్ సంస్థ అంచనా – ప్లాస్టిక్ సేకరించేందుకు ఆర్​వీఎంలు, పెట్‌ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యంత్రాల ఏర్పాటు – రీసైక్లింగ్​తో ఎన్నో ఉత్పత్తులు తయారీ.

PET Plastic Recycling Machines in Hyderabad : గ్రేటర్‌ హైదరాబాద్​లో రోజూ 8 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 14 శాతం ప్లాస్టిక్‌ ఉంటోంది. నివాస గృహాల నుంచి 365 టన్నుల ప్లాస్టిక్‌ వెలువడుతోంది. 2025 సంవత్సరానికి 495 టన్నులకు చేరనుందని సీఎస్‌ఐఆర్‌ సంస్థ అంచనా వేసింది. సుమారు 40 వేల మిలియన్ల ప్లాస్టిక్‌ బాటిళ్లు మురుగు కాలువలు, నాలాల్లో పేరుకుపోతున్నాయని తెలిపింది. అయితే వీటికి చెక్‌ పెట్టేందుకు రివర్స్‌ వెండింగ్‌ మెషీన్స్‌ (ఆర్‌వీఎం) లేదా ప్లాస్టిక్‌ ష్రెడర్‌ యంత్రాలను ఎక్కువగా ఏర్పాటు చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

ప్రోత్సాహకాలతో ప్రజా భాగస్వామ్యం : దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్‌వీఎంలను ఏర్పాటు చేశారు. దానితోపాటు ‘డిపాజిట్‌ రిటర్న్‌ స్కీమ్‌’ ద్వారా ఎక్కువ మంది పౌరులను ఇందులో భాగస్వామ్యం చేశారు. చెన్నై, దిల్లీ, నోయిడా, మంగళూరు, వెల్లూరు, శివమొగ్గ, గురుగావ్, హుబ్బళి, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

ఉపయోగాలివీ : పెట్‌ బాటిళ్లు, అల్యూమినియం క్యాన్‌లు, గాజు సీసాలను ఆర్వీఎంలు సేకరిస్తాయి. రీసైక్లింగ్‌ ద్వారా కొత్త ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవసరాన్ని, ల్యాండ్‌ఫిల్‌లలో వ్యర్థాలను తగ్గిస్తాయి. కేజీ పెట్‌ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ వల్ల సుమారు 4.9 లీటర్ల నీటిని, 2 లీటర్ల ఇంధనాన్ని, 0.08 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించొచ్చని అధ్యయనాలు తెలిపాయి. నగరాల్లో ప్లాస్టిక్​ సేకరించేందుకు ఆర్​వీఎంలు ఏర్పాటు చేసి దీని ద్వారా వారికి క్యాష్​బ్యాక్​, కూపన్​లు అందిస్తూ వ్యర్థాల సేకరణను ప్రోత్సహిస్తున్నారు. రీసైక్లింగ్​ తర్వాత వాటిని టెక్స్​టైల్​ ఫైబర్స్​గా మార్చి టీషర్ట్​లు , టోపి వంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.

రివర్స్‌ వెండింగ్‌ మెషీన్స్‌ అంటే : ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లు, అల్యూమినియం క్యాన్‌లు, గాజు సీసాలను సేకరించి వేస్తే ఆర్‌వీఎం రీసైక్లింగ్‌ కోసం తయారు చేస్తుంది. ఇవి నగరంలో ఈపీఆర్‌ (ఎక్స్‌టెండెడ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ) విధానానికి సహకరిస్తాయి. తయారీదారులు, బ్రాండ్‌ యజమానులు వారి ఉత్పత్తుల వ్యర్థ నిర్వహణకు పూర్తి బాధ్యత వహించాలనే నిబంధన ఉండగా పునర్వినియోగం, రీసైక్లింగ్‌లో ఇవి సహకరిస్తాయి. పౌరులు ఖాళీ బాటిల్, క్యాన్‌లను ఆర్‌వీఎంలో జమ చేస్తే బార్‌కోడ్‌ లేదా మెటీరియల్‌ను స్కాన్‌ చేసి, ఆబ్జెక్ట్‌ డిటెక్షన్‌ టెక్నాలజీ ద్వారా రీసైక్లబుల్‌ అని గుర్తిస్తుంది.

గతంలో ఏర్పాటు చేసినా : 2021లో జీహెచ్‌ఎంసీ, ఐజీఈఎస్‌-సీసీఈటీ సంయుక్త ఆధ్వర్యంలో చార్మినార్‌ సర్కిల్‌లో ఒకటి, రెండు ఎంజీబీఎస్‌ వద్ద ఆర్‌వీఎంలను ఏర్పాటు చేశారు. కాచిగూడ, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలోనూ దక్షిణ మధ్య రైల్వే వీటిని ఏర్పాటు చేసింది. దీనిపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించకపోవడం, సాంకేతికత సమస్యలను పరిష్కరించకపోవడంతో ఎక్కువ సంఖ్యలో విస్తరించలేదు.

హైదరాబాద్‌లో పెట్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, నగరంలో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి, వ్యర్థాలను రీసైక్లిల్ చేయడానికి రివర్స్ వెండింగ్ మెషీన్లు (ఆర్​వీఎంలు) ఏర్పాటు చేస్తున్నారు. ఈ యంత్రాలు పెట్​ సీసాలు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, రీసైక్లింగ్ ప్రక్రియకు సిద్ధం చేస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top