డెబిట్ కార్డు లేకుండా ATMకు వెళ్లిపోయారా? తొందరపడొద్దు ఈ ట్రిక్స్‌తో ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు! – CARDLESS CASH WITHDRAWAL FROM ATM
Cardless Cash Withdrawal From ATM : చాలాసార్లు మనం డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం సెంటర్‌కు వెళ్లిపోతుంటాం. హడావుడిలో, ఏవో ఆలోచనల్లో పడి డెబిట్ కార్డును ఇంట్లోనే మర్చిపోతుంటాం. ఈవిధంగా ఏటీఎం సెంటర్‌కు వెళ్లినా, మనం ఎంచక్కా డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. డెబిట్ కార్డుతో పనే లేదు. అదెలాగో తెలియాలంటే ఈ కథనాన్ని ఇప్పుడే చదివేయండి.
ఖాతాదారులకు గొప్ప వెసులుబాటు
బ్యాంకింగ్ టెక్నాలజీ కొత్త రెక్కలు తొడుగుతున్న కాలమిది. సరికొత్త సాంకేతికత బ్యాంకుల ఖాతాదారులకు ఎన్నో కొత్త సౌకర్యాలను తెచ్చిపెట్టింది. డబ్బులను డిపాజిట్ చేయడం దగ్గరి నుంచి విత్ డ్రా చేసుకోవడం దాకా ప్రతీచోటా సూపర్ ఫాస్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏటీఎం సెంటర్ అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేది డెబిట్ కార్డు. అయితే దాని అవసరమే లేకుండా డబ్బులను విత్‌డ్రా చేసుకునే గొప్ప వెసులుబాటును బ్యాంకులు మనకు కల్పిస్తున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలంటే మన చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో ఏదైనా యూపీఐ యాప్ లేదా బ్యాంకు యాప్ యాక్టివ్‌గా ఉంటే సరిపోతుంది.
డెబిట్ కార్డు లేకుండా నగదు విత్డ్రా ఇలా
- ఏటీఎం స్క్రీన్‌పై మనకు ‘కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాఅల్’ లేదా ‘యూపీఐ క్యాష్ విత్‌డ్రాఅల్’ లేదా ‘యోనో క్యాష్’ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అనంతరం ఏటీఎం స్క్రీన్‌పై ఒక క్యూఆర్ కోడ్ లేదా కోడ్ నంబర్ కనిపిస్తాయి.
- వెంటనే మన ఫోన్‌లోని ఫోన్‌పే, గూగుల్ పే లాంటి ఏదైనా ఒక యూపీఐ యాప్‌ను తెరిచి, ఆ క్యూఆర్ కోడ్‌ను ‘స్కాన్ అండ్ పే’ ఆప్షన్‌తో స్కాన్ చేయాలి.
- తదుపరిగా మనం విత్‌డ్రా చేయదల్చిన అమౌంటును ఏటీఎం స్క్రీన్‌పై ఎంటర్ చేయాలి.
- చివరగా యూపీఐ పిన్‌ను ఎంటర్ చేసి, ఆ లావాదేవీని ధ్రువీకరించాలి.
- ఆ తర్వాత కొన్ని సెకన్లలోనే ఏటీఎం నుంచి డబ్బులు బయటికి వస్తాయి. ఇక డెబిట్ కార్డుతో పనేం ఉండదు.
- ఈవిధంగా ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే క్రమంలో ఎస్‌బీఐ తమ యోనో యాప్ ద్వారా 6 అంకెల ‘యోనో క్యాష్ కోడ్’ను జారీ చేస్తోంది. ఈ క్యాష్ కోడ్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయగానే డబ్బులు విత్‌డ్రా అవుతాయి.
- ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన ఐ మొబైల్, యూకో బ్యాంక్‌కు చెందిన యూక్యాష్ వంటి యాప్స్ కూడా ఈ తరహా కార్డురహిత ఏటీఎం లావాదేవీల కోసం పనికొస్తాయి.
ఇవి తప్పకుండా గుర్తుంచుకోండి
- మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ యాక్టివ్‌గా ఉండాలి.
- కార్డు రహిత/యూపీఐ నగదు విత్‌డ్రా ఫీచర్ ఆ బ్యాంకు బ్రాంచీ లేదా ఆ బ్యాంకు ఏటీఎం కలిగి ఉండాలి.
- కార్డురహితంగా ఏటీఎంలో విత్‌డ్రా చేసుకునే రోజువారీ నగదు లిమిట్ అనేది ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉండొచ్చు.
ఏటీఎం ఛార్జీలు 3 రకాలు
- మనం ఖాతా కలిగిన బ్యాంకు ఏటీఎం నుంచి కాకుండా, మరో బ్యాంకుకు చెందిన ఏటీఎం నుంచి ప్రతినెలా పరిమితికి మించి నగదును విత్‌డ్రా చేస్తే ‘ఔట్ ఆఫ్ నెట్‌వర్క్ ఫీజు’ను విధిస్తారు.
- మనకు ఖాతా లేని బ్యాంకుకు చెందిన ఏటీఎం నుంచి ప్రతినెలా పరిమితికి మించి నగదును విత్‌డ్రా చేసుకుంటే, ఆ ఏటీఎం ఆపరేటర్ మనపై ఫీజును విధిస్తాడు. దీన్నే ‘ఏటీఎం ఆపరేటర్ ఫీజు’ అంటారు.
- విదేశాల్లో మనం ఏదైనా ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకుంటే, మనపై అంతర్జాతీయ లావాదేవీ ఛార్జీని విధిస్తారు. ఇందులో ఏటీఎం ఆపరేటర్ ఫీజుతో పాటు భారతీయ కరెన్సీని విదేశీ కరెన్సీగా మార్చేందుకు అయిన ఛార్జీ కలిసి ఉంటాయి.