సమగ్ర వివరాలు తెలిసేలా – స్వయం సహాయక సంఘాల కోసం ‘లోకోస్’ యాప్ – LOKOS APP IN SELF HELP GROUPS
స్వయం సహాయక సంఘాలకు చెందిన సమగ్ర వివరాల కోసం అందుబాటులోకి లోకోస్ యాప్ – ఇప్పటికే ప్రారంభమైన శిక్షణలు
Lokos App in AP : స్వయం సహాయక సంఘాలకు చెందిన పూర్తి లావాదేవీలు, సమావేశాలు తదితర వివరాలు అన్నీ ఒకేచోట ఉంచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోకోస్ యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. అవకతవకలను అరికట్టేందుకు, మహిళలకు పూర్తిస్థాయిలో సమాచారం అందించేందుకు 2023లో దీనిని పోర్టల్ రూపంలో తీసుకొచ్చింది. అయితే అప్పట్లో నిర్వహణకు గత వైఎస్సార్సీపీ సర్కార్ వెనకడుగు వేసింది. దీంతో క్షేత్రస్థాయికి చేరలేదు. కాని ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో దీని నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా, క్లస్టర్, మండల, గ్రామస్థాయిలో శిక్షణ మొదలు పెట్టారు. వీవోల నుంచి అధికారుల వరకు అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.
పొదుపు సంఘాలకు మంజూరవుతున్న రుణాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతం. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం(జాతీయ గ్రామీణ లైవ్లీహుడ్ మిషన్) పథకం కింద నిధులు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దీనికి అనుబంధంగా ఎస్- ఎన్‌ఆర్‌ఎల్‌ఎం అమలవుతోంది. దీనిని సెర్ప్ శాఖ పర్యవేక్షిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ విభాగాలు చూస్తున్నాయి. ఈ సందర్భంగా దేశం మొత్తం వివరాలు ఒకేచోట ఉండేలా ప్రణాళికలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ప్రత్యేక లాగిన్ ఐడీల ద్వారా వివరాలు : సిబ్బందికి శిక్షణ పూర్తయ్యాక అన్ని వివరాలు ఈ యాప్‌లో కనిపించనున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్ ద్వారా దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ప్రత్యేక లాగిన్ ఐడీల ద్వారా ఎక్కడినుంచైనా వివరాలు చూడొచ్చు. సంఘాలతో పాటు జీవనోపాధుల ఫొటోలు, ఇతర వివరాలన్నీ ఇందులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని, దీంతో ఆర్థికస్థితిగతులు తెలుస్తాయని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ తెలిపారు. అవగాహన కార్యక్రమాలు పూర్తవగానే వీటిని వినియోగించవచ్చని చెప్పారు.
రాష్ట్రంలో తీసుకొచ్చిన యాప్కు అనుసంధానంగా : ఉమ్మడి విజయనగరం జిల్లాలో 62,850 స్వయం సహాయక సంఘాల్లో 6,92,155 మంది సభ్యులు ఉన్నారు. బ్యాంకు లింకేజీ, ఉన్నతి, స్త్రీనిధి, పెట్టుబడి సాయం, పొదుపు నిల్వ, అంతర్గత అప్పులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమావేశాలు, తీర్మానాలు, రుణాలు, వసూళ్లు, బ్యాంకులకు చెల్లింపులు తదితర వివరాలన్నీ ఇందులో ఉండనున్నాయి. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ లాంటి పథకాల గురించి కూడా తెలుసుకోవచ్చు. పారదర్శక సేవల్లో భాగంగా గతంలో రాష్ట్రంలో తీసుకొచ్చిన ‘మన డబ్బులు మన లెక్కలు’ యాప్‌కు ఇది అనుగుణంగా పనిచేయనుంది.
మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణాలు దారి మళ్లించకుండా ఉండేందుకు స్రీనిధి రీపేమెంట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్త్రీనిధి పేరిట అవసరమైన వారికి వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తోంది. ఈ రుణాన్ని ప్రతినెలా వాయిదాల రూపంలో చెల్లించాలి. ఈ నగదును కొన్ని సంఘాల అధ్యక్షులు, సీఏలు అక్రమంగా మళ్లించి సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఆ తర్వాత అక్రమాలు వెలుగులోకి వచ్చినా వారి నుంచి ఆ సొమ్ము రాబట్టుకోలేని పరిస్థితి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం స్త్రీనిధి రీపేమెంట్ యాప్‌ను రూపొందించింది. ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్‌ను సంబంధిత వీవోఏ, సీసీ, స్త్రీనిధి మేనేజర్లు ఇన్‌స్టాల్ చేసుకుని తమ ఐడీలతో లాగిన్ అవుతారు. వీరిలో ఎవరి వద్దకైనా వెళ్లి ఈ యాప్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా రుణ వాయిదాలు చెల్లించొచ్చు.