ఈ డ్రింక్స్‌తో ‘కిడ్నీ’లకు ముప్పు! – దూరంగా ఉండాలంటున్న నిపుణులు – REDUCE KIDNEY DAMAGE RISK
కిడ్నీసమస్యలతో బాధ పడుతున్నారా? – ఈ పానీయాలకు దూరంగా ఉండాలట!
Reduce Kidney Damage Risk : కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి, వ్యర్థ పదార్థాలను తొలగించి, శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడుతాయి. కానీ, చాలామంది గుండె, ఊపిరితిత్తులు, కాలేయ ఆరోగ్య విషయంలో తీసుకున్నా జాగ్రత్తలు, మూత్రపిండాల విషయానికి వచ్చే సరికి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా కిడ్నీ సమస్యలు, రాళ్లు సహా ఇతర సమస్యల బారీన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ముఖ్యంగా కొన్ని పానీయాలు మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపతాయని, అటువంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
కార్బోనేటేడ్ పానీయాలు : సోడా లేదా కూల్ డ్రింక్స్‌లో అధిక చక్కెర, ఫాస్పోరిక్ యాసిడ్, కృత్రిమ రంగులు, రుచులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫాస్పోరిక్ యాసిడ్ కిడ్నీల పనితీరును ప్రభావితం చేయడంతో పాటు రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా డార్క్ కోలాను రుచి, సంరక్షణ కోసం ఫాస్పోరిక్ ఆమ్లంతో తయారు చేస్తారని, ఇది మూత్రపిండాలకు హాని కలిగించవచ్చనని National Kidney Foundation అధ్యయనంలో పేర్కొంది.
అంతేకాకుండా ఇవి క్రమం తప్పకుండా తాగడం వల్ల మూత్రపిండాల్లో గ్లోమెరులర్ పనితీరుకు హాని కలిగిచడంతో పాటు ఒబెసిటీ, ఇన్సులనిన్ నిరోధకత ప్రమాదాన్నిపెంచుతుందని ఈ రెండూ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణామని నిపుణులు వివరించారు.
ఆల్కహాల్ : అధికంగా మద్యం సేవించడం వల్ల అధిక రక్తపోటు, కాలేయ వ్యాధి, కిడ్నీలు దెబ్బతినడానికి దారితీస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది కిడ్నీలపై అదనపు ఒత్తిడిని కలిగిచడంతో పాటు రక్తపోటును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాలక్రమేణా మూత్రపిండాల పనితీరును తగ్గిస్తుందని పేర్కొన్నారు. అధికంగా మద్యం సేవించడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు కూడా దారితీస్తుందని, ఇది మూత్రపిండాలకు హానికరమని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక మద్యపానం మూత్రపిండాలపై మరింత హానికరమైన ప్రభావాలను చూపుతుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.
ఎనర్జీ డ్రింక్స్ : ఇవి తాత్కాలికంగా శక్తిని పెంచినప్పటికీ, అవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందని, ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుందని తెలిపారు. ఎనర్జీ డ్రింక్స్ లో అధిక కెఫిన్ తో పాటు చక్కెర, ఇతర ఉత్తేజపరిచే పదార్థాలు ఉంటాయని ఇవి మూత్రపిండాలపై మరింత భారం పడేలా చేస్తాయని పేర్కొన్నారు.
పండ్ల రసాలు : కిడ్నీల ఆరోగ్యంపై పండ్ల రసాల ప్రభావం సానుకూలంగా, ప్రతికూలంగా ఉంటుందంటున్నారు నిపుణులు. కొన్ని పండ్ల రసాలు శరీరానికి అవసరమైన పోషకాలు వంటి ప్రయోజనాలు అందిస్తున్నాయని, కానీ ప్యాక్ చేసిన జ్యూస్‌లలో, ఫ్రూట్స్ షాప్‌లోని పండ్ల రసాల్లో సహజ చక్కెరతో పాటు అదనపు షుగర్ కంటెంట్ ఉంటుందని పేర్కొన్నారు. అధికంగా షుగర్ కంటెంట్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు హాని కలుగుతుందని, సాధ్యమైనంత వరకు తాజాగా ఇంట్లో తయారుచేసిన పండ్లరసాలు లేదా పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు.
స్పోర్ట్స్ డ్రింక్స్ : వీటిలో సోడియం, పొటాషియం వంటి అధిక ఎలక్ట్రోలైట్స్ అనేవి మూత్రపిండాలకు సాధారణ వడపోత, నియంత్రణ విధులకు అంతరాయం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటివి సాధారణ వ్యక్తులు వ్యాయామం తర్వాత వీటిని తీసుకోవడం మంచిదే కావచ్చు, కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఇలాంటివి తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు పెరిగి ఇతర సమస్యలు తలెత్తవచ్చనని పేర్కొన్నారు.
తగినంత నీరు తాగకపోవడం: తగినంత నీరు తాగకపోవడం మూత్రపిండాలకు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి సరిపడా నీరు లేకపోతే మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను సరిగ్గా వడపోయలేవు, ఇది డీహైడ్రేషన్, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుందని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.