GASTRIC PROBLEM AND SOLUTIONS

“గ్యాస్ ట్రబుల్”​​తో ఇబ్బంది పడుతున్నారా? – తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సమాధానమిదే! – GASTRIC PROBLEM AND SOLUTIONS

పొట్టలోగ్యాస్తగ్గేదెలా? – జాగ్రత్తలు పాటిస్తే మేలంటున్న నిపుణులు!

Gas Trouble and Solutions : ప్రస్తుతం గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా పొట్టలో ఉబ్బరం, నొప్పి, గ్యాస్‌ బాధలు వంటివి బాగా పెరుగుతున్నాయి. పులితేన్పులు, అపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గార్డెక్స్, బ్రేవరీ క్యాపుల్స్ వంటి చికిత్సల సాయంతో గ్యాస్ ట్రబుల్ నుంచి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో గ్యాస్ ట్రబుల్​కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

మనం తీసుకున్న ఆహారం నోటిలో బాగా నమిలిన తర్వాత ఆహారనాళం ద్వారా పొట్టలోని జీర్ణాశయంలోకి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఆహారాన్ని జీర్ణం అవ్వడానికి యాసిడ్​తో పాటు పెప్సిన్ వంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. కొంతమందిలో ఆ యాసిడ్, ఆహారాన్ని జీర్ణం చేసే పరిమాణంలో లేనప్పుడు మరింత యాసిడ్ ఉత్పన్నం అవుతుందని, ఈ యాసిడ్​కు మంట పుట్టించే గుణం ఉంటుందని వివరించారు. అందుకే, యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న కొద్ది పొట్టలో మంటగా అనిపిస్తుందని, దీంతో పాటు గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దీంతో పొట్టంతా ఉబ్బరించినట్టుగా మారుతుందంటున్నారు. గ్యాస్ పైకి ఎగదన్నుకు వస్తూ పొట్టలో, ఛాతీలో, గొంతులో మంటగా అనిపిస్తుంటుందని, పులితేన్పులు, ఆపానవాయువులతో అసౌకర్యంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు.

కొంతమందికి ఆహారం మితంగా తీసుకున్నా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. మరికొందరికి తిన్న తర్వాత నొప్పి వస్తుంది. టైంకి తినకపోవడం. స్ట్రెస్ ఎక్కువ అవ్వడం. కొన్ని సార్లు మందులు ఎక్కువగా వాడినా కూడా అధికంగా గ్యాస్ ఏర్పడుతుంది. దీనికి తోడు మసాలా ఫుడ్ లేదా స్పైసీ ఫుడ్ లేకపోతే మనం తీసుకునే ఫుడ్లోనే అడల్టరేషన్ ఉంటుంది. ఇది కూడా గ్యాస్ ట్రబుల్కి కారణమవుతుంది. – డా. చంద్రశేఖర్ పులి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్.

గ్యాస్ ట్రబుల్కు కారణాలుఈ సమస్యకు ఎన్నో కారణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనలో చాలామంది కొద్దిపాటి ఖాళీ లేకుండా పొట్ట పగిలేలా తినడం, తిన్న వెంటనే పడుకోవడం, కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకుంటారని వివరించారు. అంతేకాకుండా ఉప్పు, కారం, మసాలా పదార్థాలు అధికంగా తీసుకోవడం, అతిగా ఆందోళన, ఒత్తిడికి గురవడం ఇవన్నీ పొట్టలో గ్యాస్ బాధల్ని పెంచుతాయంటున్నారు.

ఆహారనాళం, జీర్ణకోశం కలిసే ‘జీఈ జంక్షన్’లో ఓ మూతలాంటి నిర్మాణం ఉంటుందని, ఒక్కసారి జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారం మళ్లీ పైకి రాకుండా ఈ జీఈ మూత అడ్డుగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహారపు మెతుకులు, దీంతో పాటు యాసిడ్ రావడంతో గ్యాస్ బాధలు, ఛాతీలో మంట వంటి ఇబ్బందులు పెరుగుతాయని పేర్కొన్నారు. కొన్ని సార్లు మనం రోజూ వేసుకునే మందుల మూలంగా కూడా గ్యాస్ ట్రబుల్ సమస్యగా మారుతూ ఉంటుందన్నారు. ఈ క్రమంలో గ్యాస్ ట్రబుల్​కు కారణాలను పసిగట్టేందుకు, యాసిడ్ లెవెల్స్​ని తెలుసుకునేందుకు ప్రస్తుతం పీహెచ్ మానోమెట్రీ, బ్రేవో క్యాప్సుల్స్ వంటి అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయంటున్నారు.

కొంతమందికి పొట్టలో ఇన్ఫెక్షన్ల వల్ల గ్యాస్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పాలు, పాల ఉత్పత్తులు, బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్, పప్పులు, కాలీఫ్లవర్ వల్ల పొట్టలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కొన్ని రకాల మందులు, జీవనశైలి మార్పు, ఆహారపు అలవాట్లు ద్వారా గ్యాస్ ట్రబుల్ను తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో గ్యాస్ సమస్యలు తక్కువగా ఉంటాయి. – డా. నాగార్జున యార్లగడ్డ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్

పరిష్కారమేంటి? : కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే అప్పుడే తయారు చేసిన మజ్జిగను తీసుకోవడం ఒక మంచి పరిష్కారమంటున్నారు. ఎందుకంటే మజ్జిగకు క్షార గుణం ఉంటుందని, ఇది పొట్టలోని యాసిడ్​తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని వివరించారు. దీంతో యాసిడ్ తన ప్రభావాన్ని కోల్పోతుందని తెలిపారు. కానీ, పులిసిన మజ్జిగకు క్షార గుణం కన్నా ఆమ్ల గుణం పెరుగుతుందంటున్నారు. దీంతో గ్యాస్ ట్రబుల్ తగ్గకపోగా, మరింత తీవ్రం కావొచ్చని హెచ్చరిస్తున్నారు. తాజా పెరుగు కూడా గ్యాస్ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తాయని, ఇందులోని ప్రోబయోటిక్ ఫ్యాక్టర్స్ పొట్టలోని బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను, గ్యాస్ బాధను తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్యాస్ ట్రబుల్​కు మనలో చాలామంది ‘రజో-డి’,’జెంటాక్’ వంటి మాత్రల్ని వాడుతుంటారని, వీటి విషయంలో సంబంధిత డాక్టర్ సలహా తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.

అలవాట్లతో : గ్యాస్ ట్రబుల్​తో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేళకు భోజనం చేయాలని, చిన్న చిన్న మోతాదులో ఎక్కువ సార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. రాత్రి భోజనాన్ని త్వరగా ముగించాలని, ఈ టైంలో చిరుతిండ్లకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. బరువును నియంత్రణలో పెట్టుకోవడంతో పాటు ధూమపానం, మద్యం వంటి అలవాట్లను మానుకోవాలని చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రకు ఉపశమించే ముందు బెడ్​పై ఎడమవైపు తిరిగి పడుకోవాలని, కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు ఆహార నాళం మూత తెరచుకొని ఆహార పదార్థాలు, పొట్టలోని ఆమ్లం వెనక్కు తన్నుకొచ్చే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. తలకింద కాస్త ఎత్తుగా ఉండే దిండు పెట్టుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. ఒకవేళ గ్యాస్ ట్రబుల్ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top