Millions of tons of gold treasure discovered in the country
Gold Discovery: జాక్‌పాట్ లాంటి వార్త.. దేశంలో బయటపడ్డ లక్షల టన్నుల బంగారపు నిధి
ఒకవైపు కొండెక్కిన బంగారం ధరలు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు..ఈ నేపథ్యంలో బంగారం అన్న మాటకే సామాన్యుడు బెంబేలెత్తే పరిస్థితి.
మేలిమి పసిడి మిడిసిపడుతోంది. భారీ రేట్లతో ఎగిరెగిరిపడుతోంది. టచ్ చేసి చూడు అంటూ సామాన్యులకు ఛాలెంజ్ విసురుతోంది. ఇలాంటి స్థితిలో జాక్‌పాట్ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. లక్షల టన్నుల బంగారపు నిధి బయటపడింది. భూగర్భంలో దాగిన ఆ బంగారు కొండను జియాలజిస్టులు కనుగొన్నారు. దీంతో ఎక్కడ చూసినా సంతోషం వెల్లివిరిస్తోంది. ఇటీవలి కాలంలో ఇది అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి అని, ఖనిజ వనరుల శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి అన్నారంటే ఇది ఎంత పెద్ద ఆవిష్కారమో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఆ పసిడి కొండ ఎక్కడ ఉందో తెలుసుకుందాం…
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా తెహసిల్‌లోని మహాగవాన్ కియోలారి ప్రాంతంలో భారీ బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. ఒకటి రెండూ కాదు ఏకంగా కొన్ని వందల ఎకరాల్లో భారీగా నిల్వలున్నాయని గుర్తించింది. మహాగవాన్ కియోలారి అంతటా మట్టి నమూనాలను సేకరించి, పరీక్షలు జరిపి, రసాయన విశ్లేషణ ద్వారా బంగారం మాత్రమే కాకుండా, రాగి, ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని గుర్తించింది. దీనికి GSI అనేక పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలోనే ఇక్కడ బంగారం, రాగి, ఇతర విలువైన ఖనిజాల జాడలను వెల్లడించింది. ఈ బంగారపు నిక్షేపాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం.
ఇండియాకు జబల్‌పూర్ గోల్డ్‌మైన్ గేమ్‌ఛేంజర్‌గా చెప్పుకోవచ్చు. 100 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. లక్షల టన్నులు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. శాంపిల్ టెస్టింగ్, ల్యాబ్ అనాలసిస్‌తో నిర్ధారణ చేయనున్నారు. వాణిజ్యపరంగా పసిడి తవ్వకాలు లాభసాటి కానున్నాయి.
మధ్యప్రదేశ్‌లో బంగారపు నిక్షేపాల జాడ బయటపడడం ఇదే మొదటిసారి కాదు. కొన్నేళ్ల క్రితం జబల్‌పూర్‌కు పొరుగున ఉన్న కట్ని జిల్లాలో బంగారు నిక్షేపాలను గుర్తించారు. అయితే, జబల్పూర్ అన్వేషణ…ఆ రాష్ట్ర మైనింగ్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీయనుంది. ఈ గోల్డ్‌మైన్‌తో మధ్యప్రదేశ్ దశ తిరిగనుంది. ఆ రాష్ట్రంపై కనక వర్షం కురవనుంది. ఖనిజాలతో నిండిన సంపన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఖనిజ నిక్షేపాల కోసం ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. మట్టి నమూనా పరీక్షలు, రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చామని GSI శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న భూగర్భ పరిశోధనలు, శాంపిల్ టెస్టింగ్, ల్యాబ్ అనాలసిస్, ఈ ప్రాంతంలో ఉన్న బంగారం నిక్షేపాలు వాణిజ్యపరంగా తవ్వకాలు జరపడానికి అనుకూలమని నిర్ధారించాయి కూడా. జబల్పూర్ జిల్లాలో ఇప్పటికే 42 గనులనుంచి ఇనుము, మాంగనీస్, లాటరైట్, సున్నపురాయి , సిలిసియా ఇసుకను వెలికితీస్తున్నారు. ఇనుప ఖనిజంలో ఎక్కువ భాగం చైనా వంటి దేశాలకు ఎగుమతి అవుతోంది. .
ఈ భారీ గోల్డ్ మైన్…భారత్‌కు గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ గోల్డ్ మైన్ గనుక అందుబాటులోకి వస్తే…భారీ స్థాయిలో బంగారం మన దేశంలోనే లభిస్తుంది. అయితే దీనివల్ల సామాన్యుడికి కలిగే ఉయోగం ఏంటో తెలుసుకుందాం..
మన దేశంలో ఉత్పత్తయ్యే బంగారం అతి స్వల్పం అన్న విషయం తెలిసిందే. దేశీయ అవసరాల కోసం భారీగా బంగారం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. విదేశాల నుంచే వస్తున్న దాదాపు 90 శాతం బంగారం దిగుమతి అవుతోంది. ఏటా 700 నుంచి వెయ్యి టన్నుల వరకు పసిడి దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి సుంకాలతో గోల్డ్ రేటు తడిసిమోపెడవుతుంది. జబల్పూర్ గోల్డ్ మైన్ అందుబాటులోకి వస్తే..దేశీయంగానే బంగారం ఉత్పత్తి సాధ్యపడుతుంది. గోల్డ్‌ని దిగుమతి చేసుకునే అవసరమే ఉండదు. దీంతో బంగారం రేట్లు తగ్గే చాన్స్ ఉందంటున్న నిపుణులు.
ఆదివారం 24 క్యారట్ల పది గ్రాముల బంగారం రేటు..లక్షా 3 వేల 40 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారట్ల పది గ్రాముల గోల్డ్ రేటు 94 వేల 450 రూపాయలుగా ఉంది. సో…జబల్‌పూర్ గోల్డ్‌మైన్‌లో తవ్వకాలు ప్రారంభిస్తే…దేశీయంగానే బంగారం ఉత్పత్తి అవుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కష్టాలు కూడా ఉండవు. దీంతో బంగారం రేట్లు దిగివస్తాయని, భవిష్యత్తులో సామాన్యులకు కూడా అందుబాటులో వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.