రూ.50 లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టిన యువతి – తల్లిదండ్రులకు కారు, ఇల్లు బహుమానం – JNTU STUDENT GOT RS 50 LAKH JOB
రూ.50 లక్షల ప్యాకేజీని సాధించిన యువతి – ఐదు కొలువులు సాధించిన జేఎన్టీయూ విద్యార్థి – సమయానుసారం, పక్కా ప్రణాళికతో కోర్సులు పూర్తి – క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఐదు కొలువులు కొల్లగొట్టిన యువతి
Sangareddy Dist Girl Get Software Job with Fifty Lakh Rupees Annual Salary : ఆ యువతి విజయ మార్గం నేటి యువతకు స్ఫూర్తి. ఆమె ఆలోచనలు నలుగురికి ఆచరణాత్మకమైనవి. చిన్ననాటి నుంచి అన్ని విషయాల్లో పక్కా ప్రణాళికతో చేయడం అలవాటు. చెయ్యాల్సిన పనులకు తగు సమయాన్నిమాత్రమే కేటాయించడం ఆ యువతిని విజయ మార్గం వైపు నడిచేలా చేసింది. సామాజిక మాధ్యమాలను కూడా చదువుకోసమే ఉపయోగించుకుంటూ తనకున్న జ్ఞానానికి పదునుపెట్టి ఏకంగా యూనీవర్సిటీ ప్రాంగణ ఎంపికల్లో ఐదు కొలువులు సాధించింది. చివరికి 50 లక్షల వార్షిక ఆదాయం ఇస్తున్న ఓ సాఫ్ట్వేర్ పరిశ్రమని ఎంచుకుని, నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఐదు ఉద్యోగాలు సాధించిన ప్రవీణ : సంగారెడ్డి జిల్లాకు చెందిన వీరారెడ్డి-రెణుకల కుమార్తె ప్రవీణ. ఎంటెక్ పూర్తి చేసి క్వాల్కమ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఒక ఉద్యోగం సాధించాలంటేనే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ప్రవీణ మాత్రం ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. పక్కా ప్రణాళిక, చేయగలమన్న ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తోంది ప్రవీణ. సమయం వృద్ధా చేయకుండా కోర్సులు పూర్తి చేసుకొని ఉద్యోగ అవకాశాలు సాధించింది.
రూ.50 లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టిన యువతి – తల్లిదండ్రులకు కారు, ఇల్లు బహుమానం (ETV)
రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం : సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూలో బీటెక్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్ పూర్తి చేసింది. ఇటీవల క్వాల్కమ్లో సీనియర్ ఇంజినీర్‌గా పదోన్నతి పొంది రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకుంది. ఇంజినీరింగ్ తొలి సంవత్సరం నుంచే అన్ని అంశాలపై దృష్టి సారించింది. రెండో ఏడాదిలో సీ ప్లస్ ప్లస్‌లో పట్టు సాధించింది. మూడో ఏడాదిలో కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ప్రణాళికలు వేసుకుంది. పలు అంశాలపై ప్రయోగాలు చేపట్టి గిట్హాబ్లో పొందుపర్చుకుంది. ఇలా ఇంజినీరింగ్ చేస్తూనే ఉద్యోగ సాధనకు అవసరమైన నైపుణ్యాలు సాధించింది.
రెడ్ మార్కులను తగ్గించే విధంగా ప్రిపరేషన్ : సహజంగా సెలవు దినాలు వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లదకరమైన ప్రాంతాలకు వెళ్లడం, సినిమాకి వెళ్లడం అందరూ చేస్తుంటారు. కానీ ప్రవీణ మాత్రం సెలవు దినాలను చదువు కోసం కేటాయించి చదువులో ఎంజాయ్‌మెంట్‌ని వెతుకుంటుంది. రోజులో దాదాపు 8 గంటల పాటు చదువుకుంటూ మరిన్ని అంశాలపై పట్టు సాధించుకుంది. తాను చేయాల్సిన పనులను కాగితంపై రాసి అంటిబెట్టుకుని పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయ్యేది . ఒకవేళ ఏదైన వేరే పని మీద ఆరోజు చదవలేదంటే గోడపై రెడ్ మార్కు పడాల్సిందే. ఇలా నెలలో ఎన్ని రెడ్మార్కులు ఉంటే తన చదువు అంతగా సన్నగిల్లిపోతోందని ప్రవీణ అంచనాకు వచ్చేది. దానికి అనుగుణంగా రెడ్ మార్కులను తగ్గించే విధంగా ప్రిపేర్ అయ్యేది.
స్నేహితుల చెడు సావాసాల వల్లే యువత చెడిపోతోంది : బీటెక్ రెండో సంవత్సరం నుంచి గేట్ పరీక్షకు సిద్దమైంది. సోషల్ మీడియాను విజ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించింది. దీంతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించగలిగినట్లు చెబుతోంది ప్రవీణ. దీంతో పాటు రాత్రి 9 గంటలలోపే పడుకోవడం, ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి చదువుకోవడంతో తాను మరింత జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లు చెబుతోంది. బీటెక్‌లో ఉన్న నాలుగు సంవత్సరాలను విభజించుకుని ఒక్కో సంవత్సరం ఒక సబ్జెక్ట్ కోర్సులు నేర్చుకోవడంతో చదువు పూర్తైన వెంటనే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, తను ఆ పద్దతిని అనుసరించినట్లు చెబతున్నారు ప్రవీణ. చదువుకునే సమయంలో ఏ విద్యార్థికి అయినా ఒత్తిడి అనే మాట చాలా చిన్నగా అనిపిస్తోందని ప్రవీణ చెబుతోంది. యువత ఒత్తిడి వల్లే మాదకద్రవ్యాల వైపు నడుస్తోందనే మాట అవాస్తవమని, కేవలం స్నేహితుల చెడు సావాసాల వల్లే యువత చెడిపోతోందని స్ఫష్టం చేస్తోంది.
మద్యం, గంజాయి వంటి చెడు అలవాట్లకు ఒక్కసారి అలవాటు పడితే మన జీవితాన్నిపూర్తిగా నాశనం చేస్తాయని ప్రవీణ చెబుతున్నారు. తాను ఇంతటి విజయాన్ని సాధించడానికి తమ కుటుంబం ఎంతో సపోర్ట్ చేసినట్లు ప్రవీణ చెబుతున్నారు. రాత్రి 9 అవ్వగానే ఇంట్లోవారందరూ కూడా ఆమెకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో త్వరగా పడుకునే వారని చెబుతోంది. ఏదైనా శుభకార్యాలకు సైతం తనని తీసుకెళ్లే వారు కాదని, పూర్తిగా చదువుకునే అవకాశాన్ని కల్పించినట్లు చెబుతోంది. చాలాసేపు కూర్చోని చదువుకోవడం వల్ల కొంత ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. వాటిని అదిగమించడానికి తన తండ్రితో పాటు గ్రౌండ్‌కి వెళ్తూ పరుగుపందేలకు వెళ్లి మారథాన్‌లో పతకాలను కాడా సాధించింది.
తల్లిదండ్రులకు కారు, ఇల్లు బహుమానం : చిన్ననాటి నుంచి కూడా ప్రవీణకి ఎక్కువగా చదువుపై ఆసక్తి ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాను ఏది సాధించాలి అంటే దానిని లక్ష్యంగా పెట్టుకుని క్షేత్రస్థాయి నుంచి నేర్చుకునేదని తల్లీదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంత మంచి ఉద్యోగం కేవలం తన స్వశక్తి, పట్టుదలతో సాధించగలిగిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తె తన జీతంతో ఇల్లు, కారు కొని తమకు బహుమతిగా ఇవ్వడం మరుపురాని అంశంగా తాము భావిస్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.
కళాశాలలో అన్ని కోర్సులు ఉన్నాయి : ప్రవీణ చదువుల్లో ముందుంటుందని, తమకు కావాల్సిన జ్ఞానాన్ని ఉపాధ్యాయులను అడిగి మరీ తెలుసుకునేదని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ప్రిన్సిపల్ చెబుతున్నారు. పైగా ఆయన ప్రవీణకు క్లాస్ టీచర్ కావడం, కావాల్సిన మెటీరియల్ కూడా అందించడంతో కోర్సు పూర్తయిన తొలి ఎడాది నుంచే మంచి ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ప్రిన్సిపల్ తెలిపారు. తమ కళాశాలలో అన్ని కోర్సులు ఉన్నాయని, వాటికి అనుగుణంగా ల్యాబ్ అందుబాటులో ఉండటం, వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడానికి ఫ్యాకల్టీ కూడా నైపుణ్యం కలిగిన వారు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. చదువు పట్ల ఆసక్తి, సాధించాలనే పట్టుదల, స్థిరమైన లక్ష్యం, పక్కా ప్రణాళిక ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది ప్రవీణ.
“రాత్రి 9 గంటలలోపే పడుకోవడం, ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి చదువుకోవడంతో తాను మరింత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. చదువుకునే సమయంలో ఏ విద్యార్థికి అయినా ఒత్తిడి అనే మాట చాలా చిన్నగా అనిపిస్తోంది. యువత ఒత్తిడి వల్లే మాదకద్రవ్యాల వైపు నడుస్తోందనే మాట అవాస్తవం.కేవలం స్నేహితుల చెడు సావాసాల వల్లే యువత చెడిపోతోంది.”- ప్రవీణ, సంగారెడ్డి