ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీగా అవకతవకలు – ఏకంగా రూ.13.71 కోట్లు గోల్మాల్ – MASSIVE IRREGULARITIES IN SBI
ఎస్బీఐలో భారీగా బంగారం, నగదు గోల్మాల్ – క్యాషియర్ అందుబాటులోకి లేకపోవడంతో అనుమానాలు – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
RS 14 Crore Scam in SBI Chennur branch : ఎస్బీఐ బ్యాంకులో రూ.13.71 కోట్ల విలువైన నగదు, బంగారం గోల్మాల్ అయింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐ బ్యాంకు రెండవ బ్రాంచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇవాళ పోలీసులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడంతో మూడు రోజులుగా ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకులో జరిగిన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి.
బ్యాంక్ క్యాషీయర్‌గా పని చేస్తున్న రవీందర్ పరారీలో ఉండటం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూర్చాయి. మొత్తం రూ.12.61 కోట్ల విలువ చేసే బంగారం, రూ.1.10 కోట్ల నగదు లెక్క తేలకపోవడంతో బ్యాంకు అధికారులు క్యాషీయర్ రవీందర్‌తో పాటు మరో పది మంది అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ దేవేందర్ తెలిపారు.
పరారీలో క్యాషియర్ : ఇంకా పూర్తి వివరాలను సీఐ దేవేందర్ తెలిపారు. చెన్నూరు ఎస్బీఐ శాఖలో అవకతవకలు జరిగాయని బ్యాంకు అధికారులు గుర్తించి ఫిర్యాదు చేశారన్నారు. మొత్తం రూ.13.71 కోట్లు విలువ చేసే బంగారం, నగదు మిస్ అయినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇది అంతా క్యాషియర్ రవీందర్ ఆధీనంలోనే జరిగినట్లు తెలుస్తోందన్నారు. అతడు కూడా పరారీలో ఉండటంతో ఆరోపణలకు ఇంకా బలం చేకూర్చింది.
అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నామని, గాలిస్తున్నామని వివరించారు. అతడికి మరో 9 మంది సహకరించినట్లు సమాచారం. వారంతా జైపుర్ వంటి ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోందని, వారిని అనుమానితులుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఖాతాదారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అతడు పట్టుబడితే పూర్తి వివరాలు బయటకు వస్తాయని సీఐ తెలిపారు.
“చెన్నూర్ ఎస్బీఐ శాఖలో అవకతవకలు జరిగాయని బ్యాంకు అధికారులు గుర్తించి, అందుకు సంబంధించిన ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. అందులో రూ.12.61 కోట్ల విలువైన బంగారం, రూ.1.10 కోట్ల విలువైన నగదు మిస్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎస్బీఐలో క్యాషియర్‌గా పని చేసే రవీందర్ ఆధీనంలోనే ఇది జరిగినట్లు ఆరోపించారు. అతడు కూడా పరారీలో ఉన్నాడు. ఇతని గురించి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. మా పై అధికారుల ఆదేశాల ప్రకారం కొన్ని టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాము. ఆ వ్యక్తి దొరికిన వెంటనే పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. ఈ విషయంపై ఖాతాదారులు ఎవరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అతడిని పట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నాము. తొందరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం. అనుమానితులను గుర్తిస్తున్నాం. పది మందిపై కేసు నమోదు చేయడం జరిగింది.” – దేవేందర్, చెన్నూరు సీఐ