మీ బండిని వర్షంలోనే వదిలేస్తున్నారా? – కేర్ తీసుకోకపోతే డైరెక్టుగా షెడ్డుకే! – PREPARE YOUR VEHICLE IN HEAVY RAIN
వర్షకాలంలో వాహనాల సంరక్షణపై దృష్టి – కారు నీళ్లలో తడిస్తే ఇంజిన్, ఎలక్ట్రికల్ భాగాలు, బ్యాటరీ, ఇతర ముఖ్య భాగాలకు నష్టం – మీది విద్యుత్తు వాహనామా? మరిన్ని జాగ్రత్తలు
Precautions Vehicle Gets Wet in the Rain : వర్షాకాలంలో బైకు, కారు, ఆటో ఏదైనా సంరక్షణపై దృష్టి పెట్టాలి. లేదంటే ఇష్టపడి, కష్టపడి కొనుగోలు చేసిన వాహనం మరమ్మతులకు ఖర్చు ‘మోపెడు’ అవుతుంది. కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు మీ వాహనాన్ని సంరక్షించుకోవచ్చు.
- వర్షం కురుస్తున్నప్పుడు తప్పనిసరైతేనే బండిని బయటకు తీయాలి. వేగంగా వెళితే ప్రమాదానికి తోడు ఇంజిన్‌తో పాటు ప్లగ్‌లోకి నీరు చేరి వాహనం మొరాయిస్తుంది.
- ద్విచక్ర వాహనాన్ని ప్రతి 6 వేల కిలోమీటర్లకు ఓసారి సర్వీసింగ్ చేయాలి. అదే కారు అయితే ప్రతి 5 వేల కిలోమీటర్లకు వీల్ ఎలైన్‌మెంటు బ్యాలెన్సింగ్ తప్పనిసరిగా చేయించాలి.
- నీటిలో సైలెన్సర్ మునిగినప్పుడు బండి ఇంజిన్ ఆపకూడదు.
- వర్షం పడే సమయంలో కారు కిటికీలు మూయకపోతే వాన నీరు చేరి అవి సరిగా మూసుకోవు, అలాగే సీట్లు తడుస్తాయి.
- అరిగిపోయిన టైర్లుంటే బ్రేకు వేసేటప్పుడు అప్రమత్తంగా వేయాలి. లేకపోతే రోడ్డుకు, చక్రానికి మధ్య ఘర్షణ జరిగి ప్రమాదం జరగొచ్చు.
వర్షంలో వాహనం తడిస్తే నష్టాలివే :
- వాహనం వర్షపు నీటిలో తడిసినప్పుడు పైనుంచి కురిసే నీరు క్లచ్‌లోకి చేరి వైరు కొంత కాలానికి బిగుతుగా మారి పని చేయడం ఆపేస్తుంది.
- గుంతల్లోంచి వాహనం వెళితే నీరు ఇంజిన్‌లోకి ప్రవేశిస్తుంది. గేర్లు పని చేయడానికి సహకరించే క్లచ్ ప్లేట్లు ఇంజిన్‌ని పెట్రోల్ ద్వారా మండించి ముందుకు నడిపించే పిస్టన్లు దెబ్బతింటాయి.
- పదే పదే తడిస్తే వాహన కేబుళ్లు దెబ్బతిని బ్యాటరీ నుంచి హారన్, స్టార్టింగ్ యంత్రాలు, హెడ్‌లైటుకు విద్యుత్తు సరఫరా జరగడం ఆగిపోతుంది.
- స్పార్క్ ప్లగ్‌లు దెబ్బతిని వాహనం స్టార్ట్ కాకుండా మొరాయిస్తుంది.
మీది విద్యుత్తు వాహనమా? : ఉరుములు, మెరుపుల సమయంలో ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది. తడిసిన ఛార్జింగ్ పోర్టు, ప్లగ్ వల్ల విద్యుత్తు సరఫరాలో హెచ్చు తగ్గులు ఏర్పడి షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది.
జాగ్రత్తలు : కారు నీళ్లలో తడిస్తే ఇంజిన్, ఎలక్ట్రికల్ భాగాలు, బ్యాటరీ, ఇతర ముఖ్య భాగాలకు నష్టం జరుగుతుంది.
- వర్షంలో బయలుదేరడం తప్పనిసరి అయితే ఎయిర్ కండిషనర్, వైపర్లు, ప్రధాన ప్లగులు పని చేస్తున్నాయో? లేదో? పరిశీలించాలి.
- బయటికి వెళ్లే సమయంలో టైర్లలోని గాలిని సరి చూసుకోండి.
- రోడ్ల మీదుండే దుమ్ము-బురద పొర వల్ల జారుడు స్వభావం ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి.
- వాహనాన్నినీరు పడని చోట పార్కింగ్ చేయండి లేదా దానిపై ఓ కవర్ వేయండి.
- నీటి గుంతల్లోంచి నడిపితే ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
- ఎలక్ట్రికల్ భాగాల్లోకి వర్షపు నీరు చేరితే షాట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది.
”టైర్లు, బ్రేకులు, ప్లగులు పరిశీలించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో మార్చుకోవాలి.ఇంటికి తిరిగి వచ్చాక తడిసిన వాహనాన్ని ఏదైనా వస్త్రంతో శుభ్రం చేయాలి.”– జానీ షరీఫ్, మెకానిక్, డోర్నకల్
”ఇటీవల వరుసగా వర్షాలు కురిశాయి. ఆ సమయంలో వరద నీటిలో బైక్ నడపాల్సి వచ్చింది. తరచూ నీటిలో నడపడడంతో వాహనం మొరాయించింది. మరమ్మతు చేయించాల్సి వచ్చింది.” – రాజు, వాహన చోదకుడు, డోర్నకల్