ఈ స్కీమ్‌కు అప్లై చేసుకుంటే “ఉచిత కుట్టు మిషన్”! – పూర్తి వివరాలు ఇవే – HOW TO APPLY FOR SEWING MACHINE
– దేశంలో ఉన్న హస్త కళాకారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు విశ్వకర్మ పథకం – 18 రకాల సంప్రదాయ వృత్తులను పోత్సహించేందుకు ఈ పథకం – మరి కుట్టుమిషన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి?
How to Apply for Free Sewing Machine: దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక, సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో పీఎం విశ్వకర్మ పథకం కూడా ఒకటి. సంప్రదాయ హస్త కళలను ప్రోత్సహించేందుకు, వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. సుమారు 18 రకాల సంప్రదాయ వృత్తులను పోత్సహించేందుకు ఈ పథకం తీసుకొచ్చింది. అందులో టైలరింగ్ కూడా ఒకటి. మరి ఈ స్కీమ్ ద్వారా కుట్టు మిషన్ లబ్ధి పొందేందుకు అర్హత ఏంటి? ఏఏ డాక్యుమెంట్లు కావాలి? ఎలా అప్లై చేసుకోవాలి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏంటీ పథకం: 2023 సెప్టెంబర్ 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ విశ్వకర్మ యోజనకు వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కమ్మరి, ఇనుప పరికరాలు తయారు చేసేవారు, ఇంటి తాళాలు తయారీదారులు, స్వర్ణకారులు, కుమ్మరి (కుండలు తయారుచేసేవారు), విగ్రహాల తయారీదారులు (మూర్తికార్, స్టోన్ కర్వర్, స్టోన్ బ్రేకర్), చర్మకారులు (చెప్పులు తయారుచేసేవారు), తాపీమేస్త్రీలు, బాస్కెట్/మ్యాట్/బ్రూమ్ మేకర్/నారతాళ్లు చేసేవారు, సంప్రదాయ బొమ్మలు తయారుచేసేవారు, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు(టైలరింగ్ చేసే వారు), చేప వలల తయారీదారులను అర్హులుగా కేంద్రం నిర్ణయించింది.
కుట్టు మిషన్ పొందేందకు అర్హతలు ఏంటి:
- మహిళలు, పురుషులు ఇద్దరూ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ చేసుకునే నాటికి 18 సంవత్సరాలు వయసు పూర్తై ఉండాలి.
- భారతీయ పౌరులై ఉండాలి.
కావాల్సిన డాక్యుమెంట్లు:
- ఆధార్ కార్డ్, ఓటర్ ID లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఐడీ ఉండాలి.
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా స్కూల్ TC.
- కుటుంబ ఆదాయం ధ్రువీకరణ పత్రం.
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
- బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్
- మొబైల్ నంబర్
- కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
- దివ్యాంగులు అయితే అందుకు సంబంధించిన సర్టిఫికెట్
- వితంతువులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్
ఇతర ప్రయోజనాలు: అర్హత కలిగిన వారికి కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు సుమారు రూ.15వేలను ఈ-వోచర్ రూపంలో బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఇక ఆ తర్వాత 5 నుంచి 15 రోజుల పాటు టైలరింగ్లో ఉచిత శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణా సమయంలో రోజుకు 500 రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ తర్వాత మొదటి విడతలో రూ.1 లక్ష (18 నెలల కాలానికి), రెండో విడతలో రూ.2 లక్షలు (30 నెలల కాలానికి) రుణాలు తక్కువ వడ్డీతో అందిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి: పీఎం విశ్వకర్మలో భాగంగా శిలాయ్ మిషన్ యోజనా పథకానికి రెండు రకాలుగా(ఆఫ్‌లైన్, ఆన్‌లైన్) అప్లై చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే అధికారిక వెబ్‌సైట్(https://pmvishwakarma.gov.in) ఓపెన్ చేసి లాగిన్ అయ్యి అప్లై
- ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు(Common Service Center)కి పీఎం విశ్వకర్మకు సంబంధించిన అప్లికేషన్ ఫారమ్ తీసుకుని పూర్తి వివరాలను ఫిల్ చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్స్‌ను జిరాక్స్ కాపీలను జత చేయాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌ను సీఎస్‌సీ ప్రతినిధికి ఇస్తే వారు దానిని ఆన్లైన్లో అప్లోడ్ చేసి అందుకు సంబంధించిన రిసిప్ట్ ఇస్తారు.