ఈ బాలుడి మెదడు సూపర్ కంప్యూటర్- 11 ఏళ్లకే 9వ తరగతిలోకి- టెన్త్ విద్యార్థులకూ మ్యాథ్స్ పాఠాల బోధన – SUPER IQ OF JABALPUR BOY ARAV PATEL
అసాధారణ బాలుడు ‘ఆరవ్ పటేల్‘- 11 ఏళ్ల వయసులోనే 9వ తరగతిలోకి అడ్మీషన్– హైకోర్టు ఆదేశాలతో బాలుడికి ఐక్యూ టెస్ట్– అసాధారణ ఐక్యూ ఉందని తేల్చిన నిపుణులు– న్యాయపోరాటం చేసి గెల్చిన తండ్రి
Super IQ Of Jabalpur Boy Arav Patel : అతడొక అసాధారణ బాలుడు. మెదడు సూపర్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది. గణితం, సైన్స్, ప్రపంచ దేశాలకు సంబంధించిన ఏ ప్రశ్న అడిగినా క్షణాల్లో సమాధానాలు చెప్పేస్తాడు. 11 ఏళ్ల వయసు కలిగిన ‘ఆరవ్ పటేల్’కు సాధారణ పిల్లల కంటే చాలా ఎక్కువ ఐక్యూ ఉంది. సాక్షాత్తూ హై కోర్టు నియమించిన మనస్తత్వ నిపుణుల టీమ్ ఈ విషయాన్ని తేల్చింది. ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ (సీబీఎస్ఈ) రూల్స్‌కు కట్టుబడి ప్రస్తుతం 9వ తరగతే చదువుతున్న ఈ లిటిల్ స్టార్, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా టెన్త్ క్లాస్ విద్యార్థులకు మ్యాథ్స్‌ను బోధిస్తుండటం విశేషం. ఆరవ్ పటేల్ అసాధారణ బాలుడిగా ఎలా మారాడు? ఆయనకు ఐక్యూ టెస్ట్ చేయమని హై కోర్టు ఎందుకు ఆదేశించింది? 11 ఏళ్ల వయసులోనే 9వ తరగతి దాకా ఎలా చేరాడు? తెలియాలంటే ఈ కథనాన్ని చదివేయండి.
తల్లిదండ్రుల వల్లే వెలుగులోకి
మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ పరిధిలో ఉన్న రంఝీ పట్టణంలో 2014 మార్చి 19న ఆరవ్ పటేల్ జన్మించారు. ఆయన తండ్రి పేరు దిలీప్. అటవీ శాఖలో గార్డుగా ఉద్యోగం చేస్తున్నారు. ఆరవ్ తల్లి సంధ్య బీఈడీ చేశారు. దీంతో పిల్లల సైకాలజీ, ట్యాలెంట్‌ను ఆమె ఈజీగా గుర్తించగలరు. పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉండే అసాధారణ నైపుణ్యాలను, సామర్థ్యాలను గుర్తించి సానబెట్టాల్సిన, ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ఈ బాధ్యతను ఆరవ్ తల్లిదండ్రులు చక్కగా నిర్వర్తించారు. ఆరవ్‌కు మొదటి గురువు తల్లి సంధ్యే.
బీఈడీ చేసి ఉండటంతో ఆమెకు విద్యాబోధనా నైపుణ్యాలపై మంచి పట్టు ఉంది. అందుకే స్కూల్లో చేర్పించకముందే, ఇంట్లోనే ఆరవ్‌కు జీకే, మ్యాథ్స్, సైన్స్‌కు సంబంధించిన చాలా బేసిక్స్‌ను నేర్పించారు. తల్లి నేర్పిన ప్రతీ విషయాన్ని ఆరవ్ వేగంగా నేర్చుకున్నారు. ఫలితంగా రెండున్నర సంవత్సరాల వయస్సులోనే అట్లాస్‌లోని అన్ని దేశాల పేర్లను, వాటి రాజధానుల పేర్లను చెప్పగలిగాడు.
నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అక్కర్లేదన్నారు!
ఆరవ్ పటేల్ తండ్రి దిలీప్‌కు అటవీ శాఖలో గార్డు ఉద్యోగం వచ్చాక, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో మొదటి పోస్టింగ్ లభించింది. దీంతో తన కుటుంబాన్ని అక్కడికి తీసుకెళ్లారు. ఆరవ్‌కు రెండున్నర సంవత్సరాల వయసు ఉండగా, దేవాస్ పట్టణంలోని ఒక స్కూల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు వెళ్లారు. అక్కడి ఉపాధ్యాయులు ఆరవ్తో మాట్లాడాక, ఈ పిల్లవాడికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అక్కర్లేదన్నారు. నేరుగా మొదటి తరగతిలో ఆరవ్‌కు అడ్మిషన్ ఇచ్చారు. క్లాస్‌రూంలో ఇతర పిల్లల కంటే అతడు ఎంతో చురుగ్గా ఉండేవారు.
ఉపాధ్యాయుల ప్రశ్నలకు తత్తరపాటు లేకుండా సరైన సమాధానాలు చెప్పేవారు. దీంతో 1వ తరగతిలో పాసయ్యాక నేరుగా 3వ తరగతిలోకి ఆరవ్‌ను ప్రమోట్ చేశారు. ఈలోగా ఆరవ్ తండ్రి దిలీప్‌కు ఉద్యోగం జబల్‌పుర్‌కు బదిలీ అయింది. జబల్‌పుర్‌లోని రంఝీలో ఉన్న సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో ఆరవ్‌ను చేర్పించారు. అతడు 8వతరగతి వరకు అక్కడే చదువుకున్నారు. ప్రతీ క్లాస్‌లోనూ ఏ+ గ్రేడ్‌ను సాధించాడు. అయితే ఆరవ్ ఎన్నడూ ట్యూషన్లకు వెళ్లలేదు. ఇంట్లోనూ గంటల కొద్దీ చదువుకోలేదు. స్కూల్లో చెప్పే పాఠాలను ఆసక్తిగా విని గుర్తుంచుకునేవారు.
ఆరవ్‌కు ఐక్యూ పరీక్షలు ఎందుకు చేశారు ?
తొమ్మిదో తరగతిలో చేరే క్రమంలో మాత్రం ఆరవ్‌కు సాంకేతికపరమైన అవాంతరం ఎదురైంది. పిల్లాడికి 11 ఏళ్ల వయసే ఉన్నందున, అందుకు నిబంధనలు అనుమతించవని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. దీంతో ఈ అంశంపై ఆరవ్ తండ్రి దిలీప్ మధ్యప్రదేశ్ హై కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడి వయసు చిన్నదే అయినప్పటికీ, ఐక్యూ మాత్రం ఎక్కువే ఉందని వాదన వినిపించారు. దీంతో ఆరవ్‌కు ఐక్యూ పరీక్ష నిర్వహించాలని ముగ్గురు మనస్తత్వ నిపుణుల బృందాన్ని హై కోర్టు నియమించింది. ఈ టీమ్ ఆరవ్‌కు ఐక్యూ పరీక్షలు చేసి, సాధారణ పిల్లల కంటే ఎక్కువ ఐక్యూ ఉందని తేల్చింది. దీంతో అతడు తొమ్మిదో తరగతిలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. అందుకు సంబంధించి సీబీఎస్ఈ ఛైర్మన్ ఈ ఏడాదే ఆరవ్‌కు ప్రత్యేక అనుమతిని మంజూరు చేశారు.
భారత సివిల్ సర్వీసుల్లో చేరుతా : ఆరవ్ పటేల్
‘మా అమ్మానాన్న అందించిన ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైంది. నాకు మ్యాథ్స్, సైన్స్ అంటే చాలా ఇష్టం. నాకొక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్ పాఠాలు చెబుతుంటాను. ఐఐటీలో చదివి, భారత సివిల్ సర్వీసుల్లో చేరాలనేది నా జీవిత ఆశయం. మనదేశానికి నా వంతుగా సేవ చేయాలని అనుకుంటున్నాను’ అని ఆరవ్ ఈటీవీ భారత్‌కు తెలిపారు.
ఆరవ్‌ను అందరిలో ప్రత్యేకంగా నిలిపింది ఆ అంశమే : సంధ్య, ఆరవ్ తల్లి
‘నా కొడుకు ఆరవ్ ఎప్పుడూ ట్యూషన్లకు వెళ్లలేదు. ఇంట్లోనూ ఎక్కువ గంటలు చదువుకోలేదు. చాలా తక్కువ టైమే అతను ఇంట్లో చదువుతాడు. కానీ మ్యాథ్స్, సైన్స్ కాన్సెప్ట్‌లను త్వరగా అర్థం చేసుకుంటాడు. ఈ విషయమే అతడిని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతోంది. స్కూల్లో చేరకముందే వివిధ సబ్జెక్టుల బేసిక్ అంశాలను ఆరవ్‌కు నేర్పించాను. నేను ఊహించిన దాని కంటే చాలా వేగంగా అతడు అవన్నీ నేర్చుకున్నాడు’ అని ఆరవ్ తల్లి సంధ్య చెప్పారు.
నా కుమారుడి కోసం న్యాయపోరాటం చేసి గెలిచాను : దిలీప్, ఆరవ్ తండ్రి
‘ఆరవ్ అద్భుతమైన తెలివితేటలు, ఆలోచనా శక్తిని మేం గుర్తించి ప్రోత్సహించాం. అతడికి మొదటి నుంచే మ్యాథ్స్, సైన్స్ అంటే బాగా ఇష్టం. చాలా చిన్న వయసులోనే ఆరవ్ 8వ తరగతిని పూర్తి చేశాడు. 9వ తరగతిలోకి చేర్చుకునేందుకు సీబీఎస్ఈ నో చెప్పింది. దీంతో నేను హై కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేశాను. హైకోర్టు నియమించిన నిపుణుల కమిటీ నా కుమారుడు ఆరవ్‌కు అసాధారణ ఐక్యూ ఉందని తేల్చింది. దీంతో 11 ఏళ్ల వయసులోనే 9వ తరగతిలో చేరే అవకాశం మా అబ్బాయికి దక్కింది’ అని ఆరవ్ తండ్రి దిలీప్ వివరించారు.