గ్రంథాలయాన్నే ఇల్లుగా మార్చుకున్న యువకుడు – క్యూ కట్టిన ఉద్యోగాలు – KAMAREDDY MAN GETS 5 GOVT JOBS
5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కామారెడ్డి జిల్లా యువకుడు – గ్రంథాలయాన్ని నివాసంగా మార్చుకుని ప్రిపరేషన్ – ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న యువ కిరణం.
A Young Man From Kamareddy has Secured 5 Govt Jobs : 1, 2, 3, 4, 5. ఇవి వస్తువులను లెక్కించడానికి చెబుతున్నవో, కార్పొరేట్ విద్యాసంస్థలు సాధించిన ర్యాంకుల అంకెలో కాదు. ఓ యువకుడు పట్టుదలతో చదివి సంపాదించిన ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క సర్కారు కొలువు సాధించడమే కష్టం. అలాంటిది ఇప్పటికే ఐదు కొలువులు దక్కించుకున్నాడు ఆ యువకుడు. తాజాగా మరో ఉద్యోగాన్నీ సాధించి ఎంతో మంది యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. అసలు ఎవరా యువకుడు? అతని విజయ రహస్యమేంటి? ఏవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి : కామారెడ్డి జిల్లా గాంధారిలోని జువ్వాడిలో నివాసం ఉంటున్న భూమవ్వ-రాజయ్యల కుమారుడు రవి కుమార్. కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. దానిపై వచ్చిన అతి కొద్ది ఆదాయంతోనే రవి కుమార్‌ను చదివించారు. చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల కష్టనష్టాలను చూస్తూ పెరిగిన రవికుమార్, వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. చదువుల్లో ముందుండేవాడు. అమ్మానాన్నల కష్టం వృథా అవ్వకుండా ఎప్పటికైనా ప్రభుత్వ కొలువు సాధించాలన్నది ఆ యువకుడి కల. అదే లక్ష్యంతో పట్టుదలతో రాత్రింబవళ్లు చదివాడు.
రోజుకు 16 గంటలు చదివి : సర్కారీ కొలువు సాధించాలనే తన లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్ రాంనగర్‌లోని గ్రంథాలయాన్నే తన గృహంగా మార్చుకున్నాడు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్‌లో 80 శాతానికి పైగా మార్కులతో ప్రతిభ చూపి శెభాష్ అనిపించుకున్నాడు. అనంతరం హైదరాబాద్ రాంనగర్లో ఉంటూ రోజుకు 16 గంటలకు పైగా ఏకాగ్రతతో చదివి సన్నద్ధమయ్యారు. ఆ కష్టానికి ప్రతిఫలంగా తొలిసారి 2018లో భారత ఆహార సంస్థ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో గ్రేడ్-3 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఆ జాబ్ చేస్తూనే ఉన్నత కొలువే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2019లో అగ్నిమాపక శాఖలో ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించారు. అదే ఏడాది అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని దక్కించుకున్నారు.
యువకుడి ప్రతిభకు క్యూ కట్టిన ఉద్యోగాలు : 2024లో గ్రూప్-4 పరీక్ష రాసి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంటుగా ఎంపికయ్యాడు. గాంధారి తహసీల్దార్ ఆఫీస్‌లో ఆ ఉద్యోగం చేస్తూనే 2022లో వెలువడిన గ్రూప్-2, 3 పరీక్షలను రాశారు. వాటిలోనూ ప్రతిభ చూపడంతో ఇటీవల 1:1 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే మరో ఉన్నత ఉద్యోగ నియామక పత్రం కూడా అందుకోనున్నానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. తమకు ప్రభుత్వ ఉద్యోగం రాదని, ఇక ఏమీ సాధించలేమోనని నిరాశ, నిస్పృహలతో ఉంటున్న యువతరానికి ఈ యువకుడు నిజంగా ‘రవి’కిరణం కాదంటారా?
పోటీ పరీక్షల్లో విజయ సాధనకు మార్గాలు :
- మంచి స్టడీ మెటీరియల్ సమకూర్చుకోవాలి.
- సబ్జెక్టులను వీలైనన్ని సార్లు రివిజన్ చేయాలి.
- ప్రాక్టీస్ టెస్ట్‌లు రాసి ఎక్కడ వెనకబడి ఉన్నారో చెక్ చేసుకోవాలి.
- వార్తా పత్రికలను రోజూ చదువుతుండాలి. నోట్సు తయారు చేసుకోవాలి.
- చదివేందుకు ఓ టైం టేబుల్‌ను సిద్ధం చేసుకోవాలి.
- పోటీ పరీక్షల విజేతల, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
- చదివిన సబ్జెక్టులను స్మార్ట్ నోట్సు రాసుకోవాలి.
- పాత పరీక్షా పత్రాలను సాధన చేయాలి.