బల్దియాలో ఇంటి దొంగ! – రూ.56 లక్షలు కాజేసి – ఒక్కరోజులోనే ఆ మొత్తాన్ని కట్టేసి – CIVIC SERVICE CENTERS ISSUES
ఆడిట్లో తేలిన ఆస్తిపన్ను అక్రమాలు – చందానగర్ సీఎస్సీలో రూ.56 లక్షలు మాయం – బకాయిలు మదింపు చేసి వసూళ్లు – చేతివాటానికి అడ్డాగా మారుతున్న సీఎస్సీ కేంద్రాలు
Officials Looting at Civic Service Centers in GHMC : బల్దియాలో ఇంటి దొంగలున్నారని మరోసారి తేలింది. ఉన్నతాధికారుల కళ్లుగప్పి చందానగర్ సర్కిల్లోని పౌర సేవా సరఫరా ఉద్యోగిని రూ.56 లక్షలు కాజేసింది. ఆడిట్ అధికారులు గుర్తించడంతో ఒక్కరోజు వ్యవధిలోనే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించింది. అయితే అంతా ఒకేసారి చెల్లించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే కాదు ఇతర సర్కిళ్లలోని పౌర సేవా కేంద్రాల్లోనూ ఈ తరహా దోపిడీలు చోటుచేసుకుంటున్నాయి. నోటరీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇవ్వడం, ఆస్తిపన్ను మొండి బకాయిలను మాఫీ చేసే పథకాలు, ఇతరత్రా కార్యక్రమాల్లో భాగంగా పౌరులు చెల్లించే పన్నులు, రుసుములను సీఎస్సీ కేంద్రాల్లో ఉద్యోగులు మాయం చేస్తున్నారు. బల్దియా ఖజానాలో జమ కావాల్సిన నిధులతో జేబులో నింపుకొంటున్నారు.
వ్యాపార భవనాలను ఇళ్లుగా చూపుతూ : సూపర్ స్ట్రక్చర్స్, వీఎల్టీ రూపంలో వచ్చే ఆదాయాన్ని కొందరు అధికారులు, సిబ్బంది మింగేస్తున్నారు. ఏటా రూ.10 కోట్లతో జేబు నింపుకొంటున్నారని అంచనా. ఆస్తిపన్ను బకాయిలో సగం చెల్లిస్తే మొత్తం మాఫీ చేస్తామంటూ కొందరు వసూళ్లకు తెరలేపారు. మరికొందరు వాస్తవ విస్తీర్ణాన్ని తగ్గించి పన్ను విలువను తక్కువ చేసి వారి దగ్గరి నుంచి దోచుకుంటున్నారు. అనుమతి లేకుండా కట్టే అదనపు అంతస్తులు, అపార్ట్మెంట్లకు నామమాత్రపు పన్ను వేస్తున్నారు. వ్యాపార భవనాలను ఇళ్లుగా చూపుతున్నారు. నోటరీ పత్రాలతో క్రయవిక్రయాలు జరిగే వందలాది కాలనీల్లో జారీ అవుతోన్న ఇంటి నంబర్లే నిదర్శనం. ఇటీవల మూపాపేట, అల్వాల్ సర్కిళ్లలోనూ నకిలీ ఇంటి నంబర్ల ఘటనలు వెలుగు చుశాయి. వాటన్నింటినీ నియంత్రిస్తే ఆదాయం పెరుగుతుంది.
జీహెచ్ఎంసీ మూడేళ్ల కిందట ఆస్తిపన్ను చెల్లింపును నగదు రహితం చేసింది గానీ జీవో 299 ద్వారా సూపర్ స్ట్రక్చర్స్ (నోటరీ స్థలాలు, అనుమతి లేని నిర్మాణాలు, అదనపు అంతస్తులు)కు ఆస్తిపన్ను మదించే ప్రక్రియను, ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ) వసూళ్లను అందులో చేర్చలేదు. అదే అదనుగా బల్దియా సిబ్బంది, అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. సర్వేల పేరుతో కనిపించిన ప్రతి ఇంటికి నోటీసు ఇవ్వడం, పన్ను కట్టలేదని, ఇంటి నంబర్లు లేవని యజమానులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారి నుంచి మూడేళ్ల కాలానికి పన్ను వసూలు చేస్తున్నారు. కొందరు నిబంధనల ప్రకారం పన్ను మదింపు చేస్తున్నారు. మరికొందరు పన్ను మదింపును వసూళ్లకు వాడుకుంటున్నారు. సీఎస్సీ కేంద్రాల్లో పన్ను చెల్లించినట్టు రసీదులు సృష్టించి, వాటితో పన్ను మదింపును చేస్తున్నారు. చందానగర్లో వెలుగు చూసిన ఉదంతం ఈ కోవలోనిదే.
సీఎస్సీ కేంద్రంల్లోనూ : ఇటీవల సీఎస్సీ కేంద్రం లావాదేవీలను ఆడిట్ చేసిన అధికారి తన ఇంటికి సంబంధించిన లావాదేవీ కనిపించకపోవడంతో కంగుతిన్నారు. లోతుగా విచారణ చేయగా దాదాపు 250కిపైగా ఇంటి నంబర్లకు సంబంధించిన రూ.56 లక్షల పన్ను జీహెచ్ఎంసీ ఖాతాలో జమ కానట్లు తేలింది. గత ఉపకమిషనర్ హయాంలో నకిలీ ఇంటి నెంబర్ల జారీ పెద్దఎత్తున జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బదిలీ అవడంతో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని, ఇతర సర్కిళ్లలోని సీఎస్సీ కేంద్రంల్లోనూ ఆడిట్ చేసి, 2020 నుంచి జరిగిన లావాదేవీలను పరిశీలించాల్సి ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై సర్కిల్ ఉపకమిషనర్ శశిరేఖ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని 15 ఏళ్లుగా పనిచేస్తోందని తెలిపారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు విచారణ చేపట్టామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.