‘నంబర్ ట్రిక్’ – చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికుల కొత్త ఎత్తుగడ – DRIVING WITHOUT NUMBER PLATE
నెంబర్ ప్లేట్లో నెంబర్ కనిపించకుండా వాహనదారుల ఐడియాలు – దొరికితే ఎక్కడ చలాన్ వేస్తారోనని ప్లాన్స్
Driving Vehicles Without Number Plates : రాష్ట్రంలో పోలీసులు వాహన తనిఖీలు పెంచారు. హెల్మెట్ ధరించకపోయినా, స్పీడ్‌గా వెళ్లినా జరిమానాలు విధిస్తున్నారు. ఈ జరిమానాలు తప్పించుకోవడానికి కొందరు వ్యక్తులు నెంబర్ ప్లేట్ కాకుండ, ఆ మొత్తం నెంబర్లో నుంచి ఓ అంకెను తొలగించి, రాజకీయ పార్టీలు, నాయకుల పేర్లు, నినాదాలు ముద్రించుకుని నడుపుతున్నారు. అయితే ఇలా చేసి పోలీసులకు చిక్కినప్పుడు సమాధానం చెప్పలేకపుతున్నారు. దీంతో నెంబర్ ప్లేట్ సరిగ్గా కనిపించకుండా ఉండానికి పేపర్ అంటించడం లేదా మట్టి రాస్తున్నారు. అది కనిపించదు అలాగే వాళ్లు ఎలా వెళ్లినా చలాన్ పడదని అనుకుంటారు.
నెంబర్ ప్లేట్ కనిపించకుండా నానా విధాలుగా : కొందరైతే నెంబర్ ప్లేట్ కనిపించకూడదని కాలు అడ్డం పెడుతుంటారు. వెనక్కి తిరిగి నెంబర్ ప్లేట్‌పై చేతులు పెడ్తారు. ఇలా చేసినప్పుడు బ్యాలెన్స్ తప్పి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు లేకపోతే ఆరు నెంబర్ ఉంటే ఆరులో సగం కనిపించేలా మిగత దాన్ని పేపర్‌తో కవర్ చేస్తారు. వాటికి క్లిక్ మనిపించినా సెర్చ్ చేస్తే వాహనం ఎవరిదో అన్న విషయం తెలియదు. నెంబర్ కూడా తప్పు అని చూపిస్తుంది. సాధారణ ప్రజలకు జరిమానాలు విధిస్తున్నా పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిలో అసాంఘిక శక్తులు ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు నిబంధనలు అతిక్రమించి ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
సంవత్సరాలు అయినా నెంబర్ ప్లేట్ మార్చకుండా : కొత్తగా కారు కొన్నప్పుడు మొదటగా టీఆర్ నంబర్ ఇస్తారు. నెల రోజుల్లో శాశ్వత నెంబర్ వస్తుంది. దీన్ని కచ్చితంగా తీసుకోవాలి. కార్లు అతివేగంగా నడిపితే స్పీడ్ గన్లతో, నిబంధనలు అతిక్రమించి రహదారులపై నిలిపినప్పుడు ఫొటోలు తీసి పోలీసులు జరిమానా వేస్తున్నారు. దీన్ని తప్పించుకోవడానికి వాహనదారులు కారు కొనుగోలు చేసి ఐదారేళ్లు అవుతున్నా కొందరు టీఆర్ నంబర్‌తోనే రాకపోకలు సాగిస్తున్నారు.
అధికారులే అవాక్కయ్యారు : హైదరాబాద్ నుంచి వాహనాలను దొంగలించిన ముఠా నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ ప్రజలకు అమ్మి బురిడీ కొట్టించారు. సగం ధరకే అమ్మడంతో సరైన పత్రాలు లేకున్నా కొనుగోలు చేసిన కొందరు మోసపోయారు. ఈ చోరీ చేసి అమ్మిన వాహనాలను పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. తర్వాత విచారించగా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో అవి చోరీ చేసినట్లు ఆన్లైన్లో నమోదై ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ మేరకు దాదాపు పది వరకు వాహనాలకు పట్టుకుని హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. వాహనాలు కొనేటప్పుడు తొందరపడకూడదని, సరైన పత్రాలు లేకుంటే తీసుకోకపోవడం మంచిదన్నారు. సరైన పత్రాలు లేకుండా తక్కువ ధరకు వాహనాలు వస్తున్నాయని తొందర పడి తీసుకుంటే భవిష్యత్తులో మీరే ఇబ్బందులకు గురవుతారని వివరించారు.
“వాహనాల తనిఖీలు పెంచాం. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నాం. సరైన పత్రాలు చూపించకపోతే వాహనం జప్తు చేస్తున్నాం. నెంబర్ సరిగా లేని వాహనాలపై చర్యలు తీసుకుంటున్నాం.” – అశోక్, సీఐ, బాన్సువాడ