వీడియో పెడితే లక్షల్లో వ్యూస్ – రూ.వేలల్లో ఆదాయం : అదరగొడుతున్న గ్రామీణ యూట్యూబర్లు – VILLAGERS ROCKING ON YOUTUBE
వీడియోలు చేస్తు అర్జిస్తున్న గ్రామీణ యూట్యూబర్లు – వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ వీడియోలు – మిలియన్స్‌లో వ్యూస్ సంపాదిస్తున్న యూట్యూబర్లు
Villagers Making YouTube Videos And Making Money : ఈ మధ్య కాలంలో రీల్స్ చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వివిధ అంశాల మీద రీల్స్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో కొందరు సామాజిక అంశాలను ఎంచుకుని ప్రజలకు వినోదం, విజ్ఞానం పంచుతూనే తామూ కొంత సంపాదిస్తున్నారు. పట్టణాలకే కాదు పల్లెల నేపథ్య రీల్స్‌కు ఆదరణ పెరగడంతో గ్రామీణులు సైతం దీనిపై దృష్టి సారిస్తున్నారు. కొందరు ఆచారాలు, సంప్రదాయాలు అంటే, మరికొందరు రైతుల రోజువారీ పనులు చూపించడం, ఇంకొందరు స్పెషల్ వంటకాలు, ప్రాంతాలు ఇలా ఎన్నెన్నో అంశాలను ఎంచుకుని రీల్స్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగులో 15 మంది రీల్స్ రూపకర్తలు ఉండటం ఇందుకు నిదర్శనం.
ఆళ్ల శివప్రసాద్‌కు 12 ఏళ్ల ప్రైవేట్ టీచర్‌గా అనుభవం ఉంది. సులభతరంగా పాఠాలు బోధించాలన్న ఆలోచనతో రీల్స్ చేస్తున్నారు. అక్షరాలు, అంకెలు, ఎక్కాలు, పాఠాలు ఒక్కటేమిటి విద్యకు సంబంధించిన అన్ని విషయాలపైనా వెయ్యికి పైగా వీడియోలు రూపొందించినట్లు శివప్రసాద్ పేర్కొన్నారు. వాటిని అనుసరించే వారి సంఖ్య గణనీయంగా ఉందని, అవి విద్యార్థుల ఉన్నతికి దోహద పడితే చాలంటున్నారు.” – ఆళ్ల శివప్రసాద్
డిగ్రీ చదివిన బరిగెల శేఖర్‌కు ఎంబీఏ చదివిన ఉమారాణితో వివాహం అయ్యింది. ఇద్దరూ రైతులే. ‘ఇస్మార్ట్ ఉమాశేఖర్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను మొదలెట్టారు. తొలుత ఆవు పొదుగుకు వైద్యం 2.2, సాగునీటి పైపులకు మరమ్మతులు 3.1, కొత్తగా పొలం అచ్చుకట్టే రీల్‌కు 9.9 మిలియన్ల వీక్షకులు కామెంట్ల రూపంలో మెచ్చుకున్నారు. తన భార్యే వీడియోలు తీసి, ఎడిట్ చేస్తుందని, ఆలోచనలన్నీ ఆమెవేనని శేఖర్ తెలిపారు. ఇలా నెలకు రూ.40 వేల దాకా గడించినట్లు ఉమారాణి వివరించారు.
“అక్షరాలు తెలియని బరిగెల హేమలత సమాజాన్ని చదివింది. పల్లె జీవనశైలిపై ఆసక్తికర అంశాలతో రీల్స్ చేసి, మిలియన్ల వీక్షకులను మెప్పిస్తుంది. ఇంటర్ వరకు చదివిన భర్త పుల్లయ్య సహకారం అందిస్తున్నారు. మొదట తోటకు నీళ్లు పెట్టే రీల్ చేయగా, 50 వేల మంది వీక్షకులు సై అన్నారు. వాకిలి ఊడ్చి, ముగ్గు వేయడాన్ని 14 మిలియన్లు, బావిలో ఈతకొట్డడాన్ని 20 మిలియన్ల వీక్షకులు ఆదరించారని హేమలత–పుల్లయ్య తెలిపారు. ఇలా నెలకు రూ.20 వేలు ఆదాయం వస్తుందన్నారు.” – బరిగెల హేమలత
“బండి కిరణ్ రెండేళ్లుగా రీల్స్ చేస్తున్నారు. తొలుగ గణేశ్ మండపం వద్ద కోలాటం వీడియో తీయగా, వీక్షకుల ఆదరణ బాగా లభించింది. దీంతో ప్రయాణంలో చూడదగ్గ ప్రదేశాలపై రూపొందిస్తున్నారు. ఇలా నాలుగైదు వందల దాకా రీల్స్ చేశానని, వాటికి వీక్షకాదరణ బాగా లభిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ప్రయాణ ప్రయోజనమైనవి మరిన్ని చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నానంటున్నారు.” – బండి కిరణ్
ఇలా ప్రజలకు తమ వీడియోల ద్వారా అవగాహన కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని వారు చెబుతున్నారు. ఇటు సమాచారం ఇవ్వడంతో పాటు వారి పని సక్రమంగా చేసుకోవడం, అలాగే ఎంతోకొంత సంపాదిస్తున్నామంటున్నారు. మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనా, ఇప్పుడు వీడియోలు చేయడం అలవాటైపోయింది అంటున్నారు.