‘కానిస్టేబుల్’ నియామకాల్లో మెరిసిన యువత – ఒకేసారి ముగ్గురు సోదరులకు ఉద్యోగాలు – AP POLICE CONSTABLE RESULTS 2025
రాష్ట్రంలోనే టాపర్స్‌గా నిలిచిన ఇద్దరూ ఉమ్మడి విశాఖవాసులే – ఒకే ఇంట్లో నలుగురు కానిస్టేబుళ్లు – దర్జీ కుటుంబంలో ఇద్దరు సోదరులు
AP Police Constable Results 2025: ఏపీ కానిస్టేబుల్ ఫలితాల్లో 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు నిన్న విడుదల అయ్యాయి. మొత్తం 6100 పోస్టులకు 5.3 లక్షల మంది అఫ్లై చేసుకున్నారు. 4.59 లక్షల మంది హాజరయ్యారు. ఫైనల్స్‌కి 33921 మంది అర్హత పొందారు. ఒకే కుటుంబం కుటుంబం నుంచి ముగ్గురు అన్నదమ్ములు, మరొక ఇంట్లో ఏకంగా నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. సివిల్లో 27 ర్యాంక్‌తో పాటు ఏపీఎస్పీలో టాపర్‌గా నిలిచారు. అక్కాతమ్ముళ్లు కలిసి విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే దీక్షగా చదివిన వారు ఉన్నారు. వీరందరీ గురించి తెలుసుకుందామా!
రాష్ట్రంలోనే టాపర్స్గా: ‘కానిస్టేబుల్’ నియామక ఫలితాల్లో మెరిసిన యువత రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా అత్యధిక మార్కులతో రాష్ట్రంలోనే టాపర్స్‌గా నిలిచిన ఇద్దరూ ఉమ్మడి విశాఖవాసులే. సివిల్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రిజల్స్‌లో గండి నానాజీ 200 మార్కులకు 168 మార్కులు సాధించారు. ఏపీఎస్పీ ఎగ్జామ్స్‌లో మల్లవరపు నరసింహం 145.5 మార్కులు వచ్చాయి. దాంతో వీరిద్దరూ తమదైన సత్తా చాటారు.
అన్నదమ్ములు ముగ్గురికీ పోలీసు కొలువులు: సాధారణంగా కుటుంబంలో ఒకరికో, ఇద్దరికో ఒకేలాంటి ఉద్యోగాలు వస్తాయి. కానీ, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ముగ్గురు సోదరులూ ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. వాళ్ల తండ్రి కూడా పోలీసే! గుత్తి పట్టణంలోని జెండాగేరికి చెందిన మహబూబ్ దౌలా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా అనంతపురంలో పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు మహ్మద్ అలీ, రెండో కుమారుడు మహ్మద్ గౌస్ డిగ్రీ చదివారు. చిన్నబ్బాయి మహ్మద్ సమీర్ బీటెక్ చదివారు. అలీ, గౌస్ ఎస్‌ఐ పోస్టులకు ప్రయత్నించినా కొద్దితేడాలో చేజారింది. ఈసారి ముగ్గురూ కలిసి కానిస్టేబుల్ కొలువులకు ప్రయత్నించి విజయం సాధించారు. రోజూ పరేడ్‌గ్రౌండ్స్‌లో చేసిన సాధనతోనే తమకు ఉద్యోగాలు వచ్చాయని ‘న్యూస్‌టుడే’తో ఆనందాన్ని పంచుకున్నారు.
సివిల్లో 27 ఏపీఎస్పీలో టాపర్: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చుక్కపల్లికి చెందిన మల్లవరపు నరసింహం ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఫలితాల్లో టాపర్‌గా విజయం సాధించారు. పరీక్షల నోటిఫికేషన్ సమయంలో మొదటి ప్రాధాన్యం సివిల్‌కు ఇవ్వడంతో సివిల్ ఫలితాల్లోనూ ర్యాంకు 27గా వచ్చింది. దీంతో సివిల్ వైపు వెళ్లనున్నట్లు నరసింహం తెలిపారు. తండ్రి వరహాలరావు వ్యవసాయం చేస్తున్నారు. తల్లి కుమారి గృహిణి. నరసింహంకు చెల్లి, తమ్ముడు ఉన్నారు. విశాఖలోని కృష్ణా కాలేజీలో డిగ్రీ 85 శాతం మార్కులతో పూర్తి చేసిన నరసింహం మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ కొలువు సాధించారు. సమాజంలో గౌరవం ఉన్న ఉద్యోగం చేయాలన్న కోరిక ఉండేదని, తన మేనమామ సలహాతో ఇది సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు.
అక్కాతమ్ముళ్లు కలిసి సాధించారు!
కానిస్టేబుల్ ఫలితాల్లో చిత్తూరు జిల్లాకు చెందిన అక్కాతమ్ముళ్లు ఇద్దరూ ఒకేసారి కొలువులు సాధించారు. పెనుమూరు మండలం కామచిన్నయ్యపల్లె పంచాయతీ గొల్లపల్లెకు చెందిన చంగల్రాయులు, జగద దంపతుల కుమార్తె రేవతి, కుమారుడు తిరుమలయ్య ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలకు హాజరయ్యారు. రేవతి సివిల్ విభాగంలో 113 మార్కులు సాధించింది. తిరుమలయ్య ఏఆర్ విభాగంలో 118 మార్కులు వచ్చాయి. వీరిద్దరూ ఉద్యోగాలు సాధించారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే తాము విజయం సాధించామని వారు తెలిపారు.
దీక్షగా చదివి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం-పరవాడ మధ్య ఉన్న దొప్పెర్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు అయ్యబాబు, జయమ్మల కుమారుడు నానాజీ. అన్నయ్య రవి ఎలక్ట్రీషియన్. విశాఖలో బీటెక్ 69శాతం మార్కులతో పూర్తి చేసిన నానాజీకి చిన్నప్పటి నుంచి పోలీస్ యూనిఫాం వేసుకోవాలన్న కోరిక ఉండేది. ఈ నేపథ్యంలో బీటెక్ పూర్తవ్వగానే ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించగా 8 మార్కుల తేడాతో విజయం దూరమయింది. ఆ వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగానే, పరీక్షలు రాసి రాష్ట్రస్థాయిలో సివిల్ కానిస్టేబుల్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచారు.
తొలి ప్రయత్నంలోనే: అనకాపల్లి జిల్లా రంగలివానిపాలెంకు చెందిన సత్యనారాయణ, లక్ష్మిల కుమారుడు రొంగలి వెంకట నరేంద్ర తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. సివిల్ కానిస్టేబుల్ ఫలితాల్లో 160 మార్కులతో రాష్ట్రస్థాయిలో 14వ స్థానంలో సాధించారు.ముగ్గురు అక్కచెల్లెల్లు వారిలో ఒకరైన రమాదేవి కానిస్టేబుల్‌గా ఎంపికవ్వాలని ప్రయత్నించినా త్రుటిలో విజయం దూరమయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా కానిస్టేబుల్ కొలువు సాధించాలని కష్టపడ్డారు నరేంద్ర. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. విశాఖలో బుల్లయ్య కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన నరేంద్ర మద్దిలపాలెంలో ఉంటూ పరీక్షకు సాధన చేశారు.
ఒకే ఇంట్లో నలుగురు కానిస్టేబుళ్లు: ఒక తల్లికి పుట్టిన ముగ్గురు పిల్లలు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. తాజాగా విడుదైలన ఫలితాల్లో మరొకరు కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యారు. వడ్డాదికి చెందిన నేతల పైడిరాజు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడు తారకేశ్వరరావు 2009లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం విశాఖలో కోర్టు కానిస్టేబుల్‌గా, ఆయన భార్య సంధ్య అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడో కుమారుడు పవన్ ఈ సంవత్సరం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తమిళనాడులో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.తాజాగా విడుదలైన ఫలితాల్లో రెండో కుమారుడు మోహన్ సిటీ సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. దీంతో ఈ ఇంట్లో మొత్తం కానిస్టేబుళ్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది.
దర్జీ కుటుంబంలో ఇద్దరు సోదరులు:ఆనందపురం మండలం కుసులవాడకు చెందిన చిప్పాడ గణపతి 161 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో నిలిచారు. ఆయన సోదరుడు రామకృష్ణ 136.5 మార్కులతో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు కానిస్టేబుల్ ర్యాంకు సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతని తండ్రి చిప్పాడకు చెందిన దర్జీ. అతని తల్లి దేవుడమ్మ గృహిణి. గణపతి ఎస్సై ఎగ్జామ్స్ రాసి చాలా తక్కువ మార్కుల తేడాతో ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆ తర్వాత, అతను డీఎస్పీ రాయగా, విడుదలైన కీ ప్రకారం, అతను 100కి 87.5 మార్కులు రావొచ్చని భావిస్తున్నాడు. అతను ఉద్యోగం సాధించేందుకు ఒక అడుగు దూరంలో ఉండగా, కానిస్టేబుల్ సివిల్ ఫలితాల్లో 8వ స్థానంలో నిలిచాడు.