నిరుద్యోగ యువత కోసం ‘డీట్’ యాప్ – ఉద్యోగ అవకాశాల సమాచారం మీ చేతుల్లో.
నిరుద్యోగ యువతకు వరంలా మారిన డీట్ యాప్ – ప్రయోజనాలివే
Deet app For Jobseekers in TG : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ప్రభుత్వం ఎన్నో రకాల వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే యువ వికాసం కార్యక్రమంతో నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయాన్ని అందించి ఉపాధి కల్పించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి చర్యలను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. మరో అడుగు ముందుకేసి నిరుద్యోగ అభ్యర్థుల ప్రయోజనం కోసం ‘డీట్’ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ) ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టింది.
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న నిరుద్యోగ యువకులకు అర్హత ఆధారంగా వారికి సరిపడే ఉద్యోగ సమాచారాన్ని అందిస్తోంది. ఈ యాప్ కంపెనీలకు, నిరుద్యోగ యువతకు ఓ వారధిగా పనిచేస్తోంది. అంతేకాకుండా స్కిల్స్‌ను పెంచుకునేందుకు శిక్షణ సంస్థల సమాచారాన్ని అందిస్తోంది. రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా అభ్యర్థి రెజ్యూమెను తయారు చేస్తోంది. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తోంది.
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే :
మీ స్మార్ట్‌ఫోన్‌లోకి వెళ్లి గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి ఈ యాప్‌ను(డీట్ యాప్) డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అందులో ఉద్యోగార్థిగా చేరాలి.
ఇంటిపేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు ఎంటర్ చేయాలి.
పుట్టిన తేదీ, లింగం, విభిన్న వికలాంగులు, సామాజిక స్థితి, చిరునామా నమోదు చేయాలి
ఈ విధంగా ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి.
అంతేకాకుండా తెలిసిన భాషలు, విద్యార్హత, స్కిల్స్, విద్యాభ్యాస సమాచారం, అనుభవం తదితర వివరాలను పూరించాలి.
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం : తర్వాత యాప్‌లోకి వెళ్లి మెనూకు వెళ్లి ఉద్యోగాలను అన్వేషించాలి. ఉద్యోగాన్ని ఆమోదిస్తే ఉద్యోగదారుడితో సంభాషించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ పిలిస్తే నిర్దేశిత తేదీ రోజున వెళ్లాలి. అనంతరం ఉద్యోగానికి ఎంపికైతే ఉద్యోగ నియామక పత్రాన్ని పొందుతారు. డీట్ యాప్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నామని వికారాబాద్ జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ మహేశ్వర్ వెల్లడించారు.
యువత సాధికారతకు ప్రభుత్వం చర్యలు : ఓ వైపు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే మరోవైపు నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతనందించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఇవ్వనున్న రుణాల్లో అత్యధికంగా రూ.4 లక్షలు రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. యూనిట్ విలువ ఎక్కువ ఉంటే రాయితీ కూడా అధికంగానే ఉందన్న ఉద్దేశంతోనే చాలామంది ఇటువైపు మొగ్గుచూపినట్లుగా తెలుస్తోంది.
ముందుగానే విలువ కేటాయింపు : యువతకు స్వయం ఉపాధి కోసం ఉపాధి కోసం వివిధ రకాల వ్యాపారాలకు ఒక్కోరకమైన యూనిట్ విలువను ముందుగానే ప్రభుత్వం కేటాయించింది. దరఖాస్తుదారులు ఆ రకంగా అందులో తమకు నచ్చిన వ్యాపారాన్ని ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. రూ.50 వేల లోన్ తీసుకుంటే పూర్తిగా రాయితీ కల్పిస్తారు. అంటే తిరిగి ప్రభుత్వానికి లోన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అనర్హులను గుర్తించేందుకు సాంకేతిక వినియోగం : దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు ఐదేళ్లపాటు మరోసారి లోన్ పొందేందుకు అనర్హులవుతారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్నటువంటి డేటాబేస్‌తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ వివరాలను ఆధార్ డేటాబేస్‌తో పరిశీలించి, సరైన ఖాతాలు ఇచ్చారా, లేదా పరిశీలించారు.