ఫ్రెండ్స్‌ను అప్పు అడిగారా? రూ.లక్ష తీసుకుంటే రూ.లక్ష IT పెనాల్టీ కట్టాల్సిందే- ఈ నిజాలు తెలుసుకోండి! – IT PENALTY ON FRIEND CASH LOANS.
నగదు రుణాలపై 100 శాతం ఐటీ పెనాల్టీలు– ఆరోగ్య బీమా ప్రీమియం, హెల్త్ చెకప్ పేమెంట్లలోనూ బీ అలర్ట్– భారీ నగదు విత్‌డ్రాలకు ‘టీడీఎస్‘ గండం
IT Penalty On Friend Cash Loans : అందరికీ ఏదో ఒక సమయంలో అత్యవసరాలు వస్తుంటాయి. అలాంటప్పుడు మనలో చాలామంది బంధువులు, స్నేహితులు, సహోద్యోగుల దగ్గర అప్పు చేస్తుంటారు. కొందరైతే నేటికీ నగదు రూపంలోనే అప్పులను ఇచ్చి, పుచ్చుకుంటుంటారు. ఇలాంటి వాళ్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ డేగ కళ్లతో కాచుకు కూర్చుంది. ఇటీవలే రాహుల్ అనే వ్యక్తి తన స్నేహితుడి నుంచి నగదు రూపంలో రూ.1.20 లక్షలను అప్పుగా తీసుకున్నాడు. దీన్ని గుర్తించిన ఐటీ శాఖ అతడిపై అంతే మొత్తాన్ని (రూ.1.20 లక్షలను) జరిమానాగా విధించింది. దీంతో నీళ్లు నమలడం తప్ప రాహుల్‌కు ఏమీ మిగల్లేదు. ఈ నేపథ్యంలో అప్పులు, విరాళాలు, హెల్త్ చెకప్‌లు, ఆరోగ్య బీమా ప్రీమియంల వ్యవహారాల్లో నగదు వినియోగంపై ఉన్న పరిమితులు ఏమిటి ? బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రాకు ఉన్న లిమిట్స్ ఏమిటి ? వీటిని దాటితే విధించే ఐటీ పెనాల్టీ, టీడీఎస్ ఎంత? ఈ కథనంలో తెలుసుకుందాం.
రాహుల్పై రూ.1.20 లక్షల పెనాల్టీ కారణమిదీ
రాహుల్ అనే వ్యక్తి ఎంతైతే నగదు రూపంలో అప్పు చేశాడో, అంతే (100 శాతం) మొత్తాన్ని అతడిపై ఐటీ పెనాల్టీగా విధించారు. ‘ట్యాక్స్ బడ్డీ’ చేసిన ట్వీట్‌తో ఈ అంశంపై ఇప్పుడు ‘ఎక్స్’ వేదికగా వాడివేడి చర్చ జరుగుతోంది. ఆ ట్వీట్ ప్రకారం, ఫ్రెండ్ నుంచి రాహుల్ నగదు రూపంలో రూ.1.20 లక్షలను అప్పుగా తీసుకున్నాడు. ఇందుకుగానూ అతడిపై రూ.1.20 లక్షలను ఐటీ పెనాల్టీగా విధించడం గమనార్హం. సాధారణంగా ఐటీ పెనాల్టీ అంటే వెయ్యి రూపాయలో, రెండువేల రూపాయలో ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఐటీశాఖకు చెందిన సెక్షన్ 269ఎస్ఎస్, సెక్షన్ 271డీఏలను ప్రశాంతంగా చదివితే అసలు విషయం అర్థమవుతుంది. పరిమితికి మించిన నగదు లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ ఎంత సీరియస్‌గా పరిగణిస్తోందో బోధపడుతుంది. సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం రూ.20వేలకు మించిన అప్పును లేదా డిపాజిట్ లేదా అడ్వాన్స్‌ను నగదు రూపంలో మనం స్వీకరించడానికి వీల్లేదు. ఇలాంటి లావాదేవీకి సరి సమానమైన (100 శాతం) మొత్తాన్ని ఐటీ పెనాల్టీగా విధిస్తారని సెక్షన్ 271డీఏ చెబుతోంది. రాహుల్‌పై ఏకంగా రూ.1.20 లక్షల ఐటీ పెనాల్టీ పడటానికి కారణం ఈ రెండు నిబంధనలే.
రూ.2 లక్షలకుపైగా నగదును స్వీకరించినా అంతే
మనం ఒక వ్యక్తి నుంచి ఒక రోజు వ్యవధిలో రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించకూడదు. ఇలా చేస్తే ఐటీశాఖకు చెందిన సెక్షన్ 269ఎస్‌టీ ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఎంతైతే మొత్తాన్ని మనం ఒక రోజు వ్యవధిలో స్వీకరించామో, అంతే మొత్తాన్ని ఐటీ పెనాల్టీగా విధిస్తారు.
అప్పు తీర్చేందుకు అంత ఇచ్చినా పెనాల్టీ
అప్పు లేదా డిపాజిట్‌ను మనం చెల్లించే సమయంలోనూ అలర్ట్‌గా ఉండాలి. ఈ వ్యవహారాల కోసం రూ.20వేలకు మించిన నగదును స్నేహితుడు, బంధువు, పరిచయస్తుడికి ఇస్తే సెక్షన్ 269టీ ప్రకారం ఐటీ శాఖ చర్యలు తీసుకుంటుంది. మనపై ఐటీ పెనాల్టీని విధిస్తుంది.
వ్యాపారులు రూ.10వేలకుపైగా నగదు పేమెంట్ చేసినా ఇబ్బందే
వ్యాపారాలు చేసేవారు ఒక రోజు వ్యవధిలో ఎవరికైనా రూ.10వేలకుపైగా నగదు చెల్లింపు జరిపినా ఇబ్బందే. వ్యాపారుల లాభాలను లెక్క కట్టేటప్పుడు, ఇలాంటి నగదు లావాదేవీలను ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకోదు. దీనివల్ల నగదు లావాదేవీలు జరిపిన వ్యాపారులు అదనపు పన్నును కట్టాల్సి వస్తుంది.
నగదు విరాళాలతో ప్రయోజనం సున్నా
ఎంతోమంది ఆలయాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలకు విరాళాలు ఇస్తుంటారు. నగదు రూపంలో రూ.2వేలకు మించి విరాళాలు ఇస్తే, పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందలేరని ఐటీ శాఖకు చెందిన సెక్షన్ 80జీ చెబుతోంది. ఈవిషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో నగదు రూపంలో విరాళాలను ఇస్తుంటారు. చెక్కు, యూపీఐ, బ్యాంకు ట్రాన్స్‌ఫర్ వంటి వాటి ద్వారా విరాళాలను ఇస్తే ఐటీ శాఖ నుంచి పన్ను ప్రయోజనాలను మనం క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఆరోగ్య బీమా ప్రీమియం, హెల్త్ చెకప్ పేమెంట్లలోనూ బీ అలర్ట్
ఆరోగ్య బీమా పాలసీ కోసం మనం ప్రీమియంలను చెల్లిస్తుంటాం. ఐటీ శాఖ రూల్స్ తెలియక కొందరు నగదు రూపంలో ఈ చెల్లింపులు చేస్తుంటారు. దీనివల్ల పన్ను ప్రయోజనాలను పొందే ఛాన్స్‌ను కోల్పోతారు. హెల్త్ చెకప్ కోసం నగదు చెల్లింపు రూ.5వేలను మించితే పన్ను ప్రయోజనం దక్కదని ఐటీశాఖకు చెందిన సెక్షన్ 80డీ చెబుతోంది.
నగదు విత్‌డ్రాకు ‘టీడీఎస్‘ గండం
‘టీడీఎస్’ అంటే ‘మూలం వద్దే పన్ను మినహాయింపు’. నగదును విత్‌డ్రా చేసే వాళ్లంతా దీని గురించి కనీస అవగాహనకు రావాలి. భారీ నగదు విత్‌డ్రాలపై టీడీఎస్‌ను విధిస్తామని ఐటీ శాఖకు చెందిన సెక్షన్ 194ఎన్ స్పష్టంగా చెబుతోంది. ఒక ఆర్థిక సంవత్సరం వ్యవధిలో రూ.1 కోటికి మించి నగదును విత్‌డ్రా చేసే వాళ్ల నుంచి 2 శాతాన్ని టీడీఎస్‌గా వసూలు చేస్తారు. వరుసగా మూడేళ్లుగా ఐటీ రిటర్న్‌ను ఫైల్ చేయని వారు, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించి నగదు విత్‌డ్రాలు చేస్తే 5 శాతం దాకా టీడీఎస్‌ను విధిస్తారు.
డిజిటల్ లావాదేవీలే బెస్ట్
మొత్తం మీద పన్ను నిపుణులు చెప్పేది ఏమిటంటే మనం డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యతను పెంచాలి. బ్యాంకు ట్రాన్స్‌ఫర్లు, యూపీఐ లావాదేవీలు, చెక్కులపై ఎక్కువగా ఆధారపడాలి. దీనివల్ల పన్ను ప్రయోజనాలను పొందే అర్హత ఎలాగూ లభిస్తుంది. దీనికి అదనంగా ఐటీ పెనాల్టీల మోత నుంచి తప్పించుకోవచ్చు. నెక్ట్స్ టైం భారీ క్యాష్ పేమెంట్ కోసం మీ పర్సును తీసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి.