ED increases its aggression in the sheep distribution case.

ED increases its aggression in the sheep distribution case..

Telangana: గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో అవినీతికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు చోట్ల చేసిన సోదాల్లో భారీగా నగదు కట్టలు, ఆస్తులు గుర్తించారు ఈడీ అధికారులు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 10 చోట్ల సోదాలు నిర్వహించింది ఈడీ. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్, అత్తాపూర్‌తో పాటు పలు చోట్ల సోదాలు చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, కాంట్రాక్టర్ ఖాజా మొయినొద్దీన్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. లోలోన కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు జరిపింది. ఈక్రమంలో మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ.. కొన్ని గంటల పాటు విచారించారు. అంతకుముందు దిల్‌సుఖ్‌నగర్‌లోని కల్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. కల్యాణ్‌ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకుంది. దిల్‌సుఖ్‌ నగర్‌లో ఐదుప్లాట్లు, LB నగర్‌లో బినామీల పేర్లతో ఇండిపెండెంట్ ఇళ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. మనీలాండరింగ్ జరిగినట్టు గుర్తించింది. గొర్రెల పంపిణీలో ప్రైవేట్‌ వ్యక్తులతో లాలూచీ పడ్డట్లు నిర్ధారించింది. రైతులకు చెల్లించాల్సిన రూ.2.10 కోట్లు.. అప్పటి సీఈవో రాంచందర్‌తో కలిసి కల్యాణ్ పంచుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈకేసులో కీలక నిందితుడిగా ఉన్న మొయినుద్దీన్ విదేశాల్లో ఉన్నారు. ఈకేసులో ఏ1గా ఉన్న మొయినుద్దీన్‌ భార్య ఖాతాలోకి భారీగా నగదు మళ్లించినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. మొయనుద్దీన్‌ భార్య ఉంటున్న మూవీ టవర్స్‌లో తనిఖీలు నిర్వహించారు. ఓవరాల్‌గా గొర్రెల పంపిణీ కేసులో.. రూ. 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేశారు. గతంలోనే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించింది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రాంచందర్‌‌‌‌నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌‌ ‌‌ సహా మొత్తం 17మందిని ఏసీబీ గతంలోనే అరెస్ట్ చేసింది. కల్యాణ్ సహా కొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు.

గొర్రె పిల్లల కొనుగోలు కోసం కొండాపూర్‌‌‌‌లోని ‘లోలోనా ది లైవ్ కంపెనీ’కి గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన సయ్యద్ ఖాజా మొయినొద్దీన్‌తో పాటు పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి ఏపీలో 18 మంది రైతుల దగ్గర 133 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన 2కోట్ల 10 లక్షలు తమ బినామీల అకౌంట్స్‌‌లో డిపాజిట్ చేసుకున్నారు. తమకు రావాల్సిన డబ్బును ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన ఇతరుల అకౌంట్స్‌‌లో డిపాజిట్‌‌ అయినట్లు గుర్తించారు. 2023 డిసెంబర్‌‌‌‌లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కాంగ్రెస్ సర్కార్.. ఏసీబీకి బదిలీ చేసింది. అదే సమయంలో ఖాజా మొయినొద్దీన్, ఆయన కొడుకు దుబాయ్‌కి పారిపోయారు. ఈ కేసుపై ఈడీ ఫోకస్ నగదు లావాదేవీలు, అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఈడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top