హైదరాబాద్‌లో ఈవీ, సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు కొత్త రూల్స్ – మరీ మీకు తెలుసా?
ఓఆర్ఆర్ లోపల కొత్త ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి – ఇటీవల ఆటోలకు సంబంధించిన జీవోను విడుదల చేసిన మంత్రి పొన్నం – ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజుపై వంద శాతం రాయితీ
Electric Autorickshaws in Hyderabad : హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) లోపల కొత్తగా సీఎన్జీ, ఎల్పీజీ, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ఆదివారం(జులై 6) ఉత్తర్వులను జారీ చేశారు. ఓఆర్ఆర్ లోపల సంబంధిత ఆటోలకు అనుమతి కల్పిస్తూ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఇటీవల జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా మార్గదర్శకాలను కమిషనర్ సురేంద్ర మోహన్ జారీ చేశారు. దీనిలో భాగంగా సంబంధిత ఈవీ, సీఎన్జీ, ఎల్పీజీ వాహనాలను రాష్ట్రంలోని ఏ ఆటోరిక్షా డీలర్ వద్ద అయినా కొనుగోలు చేయవచ్చు.
నిబంధనలు ఇలా
- ఆటో లైసెన్స్ కలిగిన వ్యక్తి ఓఆర్ఆర్ లోపల నివసిస్తూ ఉండాలి.
- ఒకరికి ఒక ఆటో కొనుగోలు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.
- తన పేరుపై మరో ఆటో లేదని సంబంధిత వ్యక్తి ధ్రువీకరణ పత్రమివ్వాలి. ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వీసు పద్ధతిలో పర్మిషన్ ఇస్తారు.
- ఆమోదించిన 60 రోజుల్లో ఆటోను సదరు రవాణా శాఖ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేనిపక్షంలో అది క్యాన్సిల్ అవుతుంది.
డీలర్లకు సూచనలు
- డీలర్ల వద్దకు వచ్చిన పత్రాలను పరిశీలించి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డ్రైవింగ్ లైసెన్సు వివరాలను డీలర్ లాగిన్‌లో నమోదు చేయాలి.
- అన్నిపత్రాలను పూర్తిగా పరిశీలించే బాధ్యత మొత్తం డీలర్లదే. ఆ తర్వాతే పూర్తి వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేయాలి.
- వాహనం అమ్మకపు ధర కంటే ఎక్కువ మొత్తానికి డీలర్ కొనుగోలుదారుడికి అమ్మకూడదు. అనుమతుల కోసం ఫీజుల వసూలు చేయడం, బ్లాక్ మార్కెట్లో అమ్మడం తదితరాలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
నూతన ఈవీ పాలసీ : విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి రవాణా శాఖ గతంలోనే శుభవార్త చెప్పింది. రోడ్ పన్ను, వాహన రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ పాలసీని రూపొందించామని ఈ సరికొత్త విధానం అమల్లోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
పరిమితంగానే వాహనాలకు గత ప్రభుత్వం ఈవీ పాలసీని రూపొందించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్యపై పరిమితుల్ని పూర్తిగా ఎత్తేసినట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. ఈ రాయితీ పథకం 2026 డిసెంబరు 31 వరకు తెలంగాణ రాష్ట్ర పరిధిలో విద్యుత్ వాహనాలు ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే అన్నింటికీ వర్తించనుంది.
రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు : అవసరమైతే ఈ గడువును పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, పన్నులు, ఫీజుల మినహాయింపుతో ఏటా రూ.వందల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయినా భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. బైక్‌లు, కార్లు, ఆటోలు, ఆర్టీసీతో పాటు ఐటీ, ఫార్మా సహా ఇతర పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల ట్రాన్స్పోర్ట్ కోసం ఎలక్ట్రిక్ బస్సులు కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు ఇస్తామని తెలిపారు.
ప్రస్తుత ఈవీ పాలసీ నిబంధనల మేరకు రెండో వాహనం కొనుగోలు చేస్తే వాహనదారు అదనంగా 2 శాతం పన్ను చెల్లించాలి. అయితే రెండో ఎలక్ట్రిక్ వాహనం కొన్న వారికి 2 శాతం అదనపు ట్యాక్స్‌ను కూడా మినహాయిస్తామని పేర్కొన్నారు.
జీవో జారీ : ఎలక్ట్రిక్ వాహన నూతన పాలసీ – 2025కి సంబంధించిన జీవో 41ని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ జారీ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు – ద్విచక్ర వాహనాలు, కార్లు, కమర్షియల్ ప్యాసింజర్ వాహనాలైన ట్యాక్సీలు, టూరిస్టు క్యాబ్‌లు, మూడు చక్రాల ఆటో రిక్షాలు, తేలికపాటి గూడ్సు వాహనాలు, ట్రాక్టర్లు, బస్సులకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.