Engineering courses with tenth qualification now.. Government signs key agreement with Tata Group
ఇక టెన్త్ అర్హతతో ఇంజినీరింగ్ కోర్సులు.. టాటా గ్రూప్‌తో సర్కారు కీలక ఒప్పందం
: దేశంలోని పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో మానవ వనరుల కొరతను తీర్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఐటీఐలను అప్ గ్రేడ్ చేసేలా కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర కార్మిక శాఖ కలిసి పనిచేస్తూ.. నైపుణ్యం కలిగిన మ్యాన్ పవర్ ను తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాయి. యువతలో వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చి నిరుద్యోగాన్ని తగ్గించే చర్యలు అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్ అర్హతతో మాత్రమే ఇంజినీరింగ్ కోర్సులు అందించే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వారికి మాత్రమే గుర్తింపు, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాలు లభించేవి.
అయితే, ప్రస్తుతం పదో తరగతి లేదా, అంతకు తక్కువ అర్హతలు కలిగి ఉన్నవారికి సైతం ఇంజినీరింగ్ కోర్సులు చదివేలా గతేడాది నుంచి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ (ఐటీఐ)ల్లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కేంద్రాల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఏడాది నుంచి రెండేళ్ల కాల పరిమితిలో పూర్తి చేసేలా కోర్సులను రూపొందించారు. మొదటి విడతలో గతేడాది (2024-25) విద్యా సంవత్సరంలో 25 ఐటీఐల్లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కాగా, ఈ ఏడాదిలో అదనంగా మరో 40 ఐటీఐల్లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
టాటా గ్రూప్‌తో పదేళ్ల ఒప్పందం
అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల నిర్వహణ బాధ్యతలు, వాటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం టాటా గ్రూప్ తో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో ఈ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థుల పరిశోధనలు, ప్రయోగాలకు అవసరమైన సహాయ, సహకారాలను టాటా గ్రూప్ అందించనుంది. ప్రస్తుతం అంత్యంత ఆదరణ పొందుతున్న ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాలకు సంబంధించి కావాల్సిన నైపుణ్యాలను సైతం ఈ ఏటీసీల్లో నేర్పించనున్నారు. అంతేకాకుండా అడ్వాన్స్డ్ మెషినింగ్ టెక్నీషియన్, ఆర్టిసాన్ యూజింగ్ అడ్వాన్స్ డ్ టూల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆటోమేషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్, వర్చువల్ వెరిఫయర్ మెకానికల్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్రూట్స్, విజిటేబుల్స్ ప్రాసెసింగ్, స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నీషియన్, స్మార్ట్ సిటీ టెక్నీషియన్, స్మార్ట్ హెల్త్ కేర్ టెక్నీషియన్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్ లాంటి కోర్సులను ప్రవేశపెట్టారు.
అవసరాలకు అనుగుణంగా..
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లను అప్ డేట్ చేస్తూ, అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర కార్మిక శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కేంద్రాలు దేశ ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం కలిగిన మానవశక్తిని అందించడం, పరిశ్రమ అవసరాలను తీర్చడంలో కీలక పాత్రను పోషిస్తాయి. రోబోటిక్స్ నుంచి మొదలుకొని కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విధంగా ఈ ఇనిస్టిట్యూట్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో, ప్రస్తుతం 25 అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు, 63 ప్రభుత్వ ఐటీఐలు, 220 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. వీటిల్లో మూడో విడత అడ్మిషన్లకు ఉపాధి, శిక్షణ డైరెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేలా అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లలో ఆరు ట్రెడ్ లలో (కోర్సులు) శిక్షణ ఇస్తున్నారు. మూడు కోర్సులకు రెండేళ్లు, మరో మూడు కోర్సులకు ఏడాది కాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి చదివిన వారు ఈ కోర్సులు చేసేందుకు అర్హులు.