EWS Quota in DEECET: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. డీఈఈసెట్లో EWS కోటా అమలుకు పాఠశాల విద్యాశాఖ ఓకే..!
పార్లమెంట్లో చేసిన చట్టం ఆధారంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 2021లోనే జీవో కూడా విడుదల చేసింది. కానీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. దీంతో రంగంలోకి దిగిన పాఠశాల విద్యాశాఖ ఆరా తీసింది. దీనిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి DEECETలో అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు..
హైదరాబాద్, జులై 11: డీఈఈసెట్ కౌన్సెలింగ్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. దీనిని 2026-27 విద్యా సంవత్సరం నుంచి తప్పక అమలు చేస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో చేసిన చట్టం ఆధారంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడం తప్పనిసరని పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2021లో జీఓ విడుదల చేసినట్లు తెలిపారు. డీఈఈసెట్లో కూడా ఈ రిజర్వేషన్‌ను అమలు చేయాల్సి ఉందని, అయితే వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
దీనిపై ఇప్పటికే నవీన్ నికోలస్.. డీఈఈసెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ సంచాలకుడు రమేశ్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం ఎందుకు అమలు చేయడం లేదని ఆరా తీశారు. గత మూడేళ్లుగా కన్వీనర్‌గా శ్రీనివాసాచారి ఉన్నారని, అప్పుడు అమలు చేయలేదని అన్నారు. అందువల్లనే తాను కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. దీంతో గతంలో తప్పు చేస్తే దాన్ని మీరు కూడా కొనసాగిస్తారా? అంటూ ఎస్సీఈఆర్టీ సంచాలకుడు రమేశ్ నికోలస్ నిలదీశారు. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాదికి ఇప్పటికే రెండు విడతల సీట్ల కేటాయింపు పూర్తయింది. అందువల్లనే ఈ ఏడాదికి సాధ్యం కావడంలేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ఆయన అన్నారు.
ఏపీ డీఈఈసెట్ 2025 కౌన్సెలింగ్ వెబ్ ఐచ్ఛికాలు షురూ
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా డీఈడీలో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జులై 9 నుంచి 12 వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు. జులై 13 నుంచి 16 వరకు సీట్ల కేటాయింపు, జులై 17 నుంచి 22 వరకు డైట్ కాలేజీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. జులై 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.