FARMER OFFERING RS 10 VEG BIRYANI

 రూ.10కే వెజ్ బిర్యానీ – ఆకలితో ఉన్నవారికి కడుపు నింపుతున్న రైతు – FARMER OFFERING RS 10 VEG BIRYANI

కేవలం రూ.10కే వెజ్ బిర్యానీ అందిస్తున్న రైతు వీరమాచనేని శివాజీతెల్లవారుజామున 4 గంటలకు లేచి స్వయంగా వంటలు చేస్తున్న రైతు

Farmer Offering Veg Biryani for Just Ten Rupees in AP : ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో వివిధ పనులతో చాలా మంది ఉదయం లేచింది మొదలు బయట తిరుగుతూ బిజీబిజీగా గడుపుతుంటారు. ఆ పనిలో పడి వారికి తిండి మీద దృష్టే ఉండదు. తీరా ఎప్పుడో ఆకలి వేసినప్పుడు కడుపునిండా మంచి భోజనం చేయాలనిపిస్తే సరైన హోటళ్లు ఉండవు, చేతిలో సమయానికి డబ్బులు ఉండవు. ప్రస్తుత కాలంలో చేతిలో కనీసం రూ.100 లేకుంటే బయట కడుపునిండా మంచి భోజనం తినలేని పరిస్థితి నెలకొంది.

ఇక పెద్ద నగరాల్లో అయితే వందల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఈ కష్టాలను కళ్లారా చూసి, ఆకలి విలువ తెలిసిన ఓ రైతు మాత్రం కేవలం పది రూపాయలకే వెజ్ బిర్యానీ వడ్డిస్తున్నారు. పది రూపాయలకు సరైన టీ దొరకడమే కష్టమైన ఈ రోజుల్లో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారికి కేవలం 10 రూపాయలకే భోజనం పెడుతూ అందరి మన్నలను పొందుతున్నారు.

ఆకలితో అలమటిస్తున్న ప్రజలు : ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, బ్యాంకులకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు నిత్యం వస్తుంటారు. అయితే వారొచ్చిన సమయంలో కొన్ని సార్లు అధికారులు అందుబాటులో ఉండరు. దీంతో వారు ఇంటికి వెళ్లి మళ్లీ రాలేక కాలే కడుపులతో కొందరు అక్కడే అలమటిస్తుంటారు.

నాలుగేళ్ల పాటు రూ.5కే వెజ్బిర్యానీ : దీన్ని గుర్తించిన స్థానిక రైతు వీరమాచనేని శివాజీకి మనసు కలచివేచింది. సామాజిక స్పృహతో తక్కువ ధరకే వారి ఆకలి తీర్చాలని నిశ్చయించుకున్నారు. దీనికోసం తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన సేంద్రియ బియ్యంతో బిర్యానీ తయారు చేస్తున్నారు. కేవలం రూ.10కే వెజ్‌ బిర్యానీ వడ్డిస్తున్నారు. 2016 నుంచి 2019 వరకు సుమారు నాలుగేళ్ల పాటు రూ.5కే వెజ్‌ బిర్యానీ అందించారు. అయితే గడిచిన ఐదేళ్లు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సేవ కార్యక్రమాన్ని ఆపేశారు. అయితే వారం క్రితం మళ్లీ తిరిగి ప్రారంభించారు.

తెల్లవారుజామున 4 గంటలకు లేచి : ప్రస్తుతం రూ.10కి 200 గ్రాముల వెజ్‌ బిర్యానీ ఇస్తున్నారు. అలాగే రూ.10కి పెరుగన్నం పెడుతున్నారు. రోజుకు దాదాపు 75 నుంచి 100 మంది రైతు శివాజీ వద్దకు వచ్చి తింటున్నారు. ‘రోజూ ఉదయాన్నే 4 గంటలకు లేచి, నేనే కూరగాయలు తరుగుతా. 10 గంటలకు వంట ప్రారంభించి 12 గంటల కల్లా సిద్ధం చేస్తా. సహాయకురాలిగా ఒకరిని పెట్టుకున్నా. నాకు లాభం అవసరం లేదు. ఒక రైతుగా, ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా ఇది చేస్తున్నా’ అని రైతు శివాజీ చెబుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top