ఈ విమానం ఎక్కాలంటే రూ.599 ఉంటే చాలు – లోపలికి వెళితే అవాక్కు అవ్వాల్సిందే!! – FLIGHT RESTAURANT IN HYDERABAD
భాగ్యనగరవాసుల్ని ఆకట్టుకుంటున్న ఫ్లైట్ రెస్టారెంట్ – వినూత్నంగా ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి – దాదాపు రూ. 50 లక్షలతో ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు – అచ్చం ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్
Flight Restaurant in Hyderabad : జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొందరి సాధ్యపడకపోవచ్చు. అలాంటి వారి కోసం అసలు విమానాన్నే రెస్టారెంట్‌గా చేసి అందులో భోజనం చేసిన వారికి అచ్చం ఫ్లైట్ జర్నీ ఫీలింగ్‌ను తెప్పిస్తున్నారు. అదే హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో గండిమైసమ్మలో ఏర్పాటు చేసిన టెర్మినల్-1 ఫ్లైట్ రెస్టారెంట్. అక్కడ ఫ్లైట్‌లో ఉన్నట్లుగానే సీట్లు, ఎయిర్ హోస్టెస్ మాదిరి సిబ్బంది, వెల్కమ్ డ్రింక్స్ సహా భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు దీని కథనం తెలుసుకుందాం.
ఈ విమానం ఎక్కాలంటే రూ.599 ఉంటే చాలు – లోపలికి వెళితే అవాక్కు అవ్వాల్సిందే!! (ETV)
తక్కువ ఖర్చుతో ప్రజలకు విమానం ఎక్కిన అనుభూతిని కలిగించాలని పశ్చిమ గోదావరికి చెందిన వెంకట్‌రెడ్డి అనుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివారు గండిమైసమ్మ ప్రాంతంలో ఫ్లైట్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. మలేషియాలోని ఓ తుక్కు దుకాణం నుంచి రూ.35 లక్షలకు విమానాన్ని కొనుగోలు చేశారు. విడిభాగాలుగా తీసుకొచ్చి రెస్టారెంట్ మాదిరిగా మార్చారు. ఈ రెస్టారెంట్‌కు వచ్చే వినియోగదారులకు విమానం ఎక్కిన అనుభూతి కల్పిస్తున్నారు.
ఈ విమాన రెస్టారెంట్లో మనం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా ప్రోసెస్ జరుగుతుందో అలానే మొత్తం ఉంటుంది. ముందుగా రెస్టారెంట్లో అయితే టోకెన్ తీసుకొని డబ్బులు చెల్లించి లోపలికి వెళ్లి నచ్చినది ఆర్డర్ ఇచ్చి ఎంచక్కా తినేస్తాం. కానీ ఇక్కడ టోకెన్‌కు బదులు విమానం ఎక్కేటప్పుడు ఎలా అయితే పాస్‌పోర్టు, వీసా చెకింగ్ చేస్తారో? ఇక్కడా కూడా ఆ రెండు ఇచ్చి చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. అనంతరం స్టాంపింగ్ చేసి లోపలికి పంపిస్తారు.
అనంతరం ఇక్కడ కూడా సేమ్ విమానంలో ఎలా అయితే ఉంటుందో అదే దీనిలో బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారు. అక్కడ మనకు ఏం తినాలో చెబితే దానికి టికెట్ ఇచ్చి విమానం లోపలికి వెళ్లడానికి సిద్ధంగా ఉండమని చెబుతారు. దానికన్నా ముందు రద్దీ ఎక్కువగా ఉంటే వెయిటింగ్ లాంజ్‌లో విశ్రాంతి గదులు కేటాయించారు. ఆ తర్వాత మన టోకెన్ నంబరు వచ్చినప్పుడు విమానంలోకి వెళ్లితే ఎయిర్ హెస్టెస్లు వచ్చి స్వాగతం పలుకుతారు. అనంతరం మీ సీట్లో మీరు కూర్చున్న తర్వాత వారే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పడం, అలాగే స్వాగత పానీయం ఇవ్వడం, ఆర్డర్ చేసిన భోజనాన్ని అందించడం చేస్తారు.
డోర్స్ అవే క్లోజ్ అవుతాయి. ఇలా నచ్చినది తింటూ కేవలం 45 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. అచ్చం ఫ్లైట్ జర్నీ చేసిన ఫీలింగ్‌ను రప్పిస్తుంది ఈ టెర్నినల్ -1 ఫ్లైట్ రెస్టారెంట్. భోజనం అయిన తర్వాత విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఇచ్చినట్లుగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి బయటకు పంపుతున్నారు. ఇందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత భోజన ప్రియులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తొలి విమాన రెస్టారెంట్ : దేశంలోనే ఇది తొలి విమాన రెస్టారెంట్ అని ఇందుకోసం రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు నిర్వాహకుడు వెంకట్‌రెడ్డి తెలిపారు. వినియోగదారులకు స్టిములేషన్‌తో ఎగిరే అనుభూతి కలిగిస్తున్నట్లు అన్నారు. ఈ విమానం ఎక్కేందుకు రూ.599 వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. 45 నిమిషాల పాటు ఫ్లైట్ రెస్టారెంట్లో గడపొచ్చని వివరించారు. తమకు విమానంలో ప్రయాణించినట్లే ఉందని వినియోగదారులు అంటున్నారు.