మీ ప్రాంతంలో చెత్త పేరుకుపోయిందా? – వాట్సాప్ ఫిర్యాదుతో సమస్యకు పరిష్కారం! – GHMC SANITATION COMPLAINTS NUMBER
హైదరాబాద్ నగరంలో చెత్త సమస్యకు జీహెచ్ఎంసీ సరికొత్త పరిష్కారం – వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన జీహెచ్ఎంసీ – చెత్త సమస్యలపై ఫిర్యాదు చేసే విధానం తదితర వివరాలు మీకోసం
GHMC WhatsApp Number For Sanitation Complaints : శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ మహానగరంలో జనాభాతో పాటు చెత్త సమస్య కూడా క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడంతో పాటు కుండీలు నిండిపోవడం లాంటి సమస్యలు తరచూ చూస్తుంటాం. దీని వల్ల స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రజారోగ్యానికి కూడా ముప్పు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి పరిష్కారంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఓ సరికొత్త పరిష్కారంతో ముందుకొచ్చింది. సులభంగా ఓ మెసేజ్ పెట్టి సమస్యను పరిష్కరించుకోవచ్చు. చెత్త సమస్యలపై జీహెచ్ఎంసీకి ఏవిధంగా ఫిర్యాదు చేయాలి? ఏయే వివరాలు ఇవ్వాలనే విషయాలును ఇప్పుడు తెలుసుకుందాం.
చెత్త సమస్యపై ఫిర్యాదు చేయడం ఎలా? :
- 81259 66586 నంబరును సెల్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.
- ఆ నంబరుకు వాట్సప్ ద్వారా హాయ్ అనే మేసేజ్ పంపిస్తే జీహెచ్‌ఎంసీ నుంచి నమస్తే అని బదులొస్తుంది.
- దాంతో పాటు ఒక లింక్ వస్తుంది.
- దానిపై క్లిక్ చేయగానే ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో సమస్య ఉన్న ప్రాంతం, ఫొటో, కచ్చితమైన స్థానం పేర్కొంటూ పూర్తి వివరాలను పంపించాలి.
- ప్రస్తుతం మై జీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్, సామాజిక మాధ్యమం ఎక్స్ (@GHMConline), కంట్రోల్‌రూమ్ నంబరు 040 2111 1111 ద్వారా జీహెచ్‌ఎంసీ అన్ని రకాల ఫిర్యాదులను స్వీకరిస్తోంది. కేవలం శానిటేషన్ కోసం ప్రత్యేకంగా ఈ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది.
2,500 చెత్త కుప్పలు : బస్తీల్లో 20 శాతం మంది స్థానికులు ఇంట్లోని చెత్తను స్వచ్ఛ ఆటోలకు ఇవ్వట్లేదు. నెలకు రూ.100 చెల్లించడం భారంగా భావిస్తున్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లేటప్పుడో సాయంత్రం లేదా రాత్రి వేళల్లోనో చెత్తను ప్లాస్టిక్ కవర్లలో నింపి రోడ్డుపై పడవేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తామని, జరిమానాలు వేస్తామన్న జీహెచ్‌ఎంసీ ప్రకటనలు కాగితాలకే పరిమితమవడంతో సమస్య పరిష్కారం కావట్లేదనే విమర్శలొస్తున్నాయి. వ్యర్థాల నిర్వహణ(సోలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) సరిగా చేయకపోవడం వల్ల ప్రజా ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి, నీరు కలుషితమై అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి.
ఇంటింటికి ఆటోలు వెళ్తున్నా: యూసుఫ్‌గూడ హైదరాబాద్ నగరంలోని ప్రధానమైన ప్రాంతం. జూబ్లీహిల్స్‌లో గంటకు 4 సెంటీమీటర్లకు మించి వర్షం పడితే కృష్ణానగర్ ఏ, బీ, సీ బ్లాకులు, పలు కాలనీల జలమయమవుతున్నాయి. రోడ్లపై నడుముల్లోతున నీరు ప్రవహించి ఇబ్బంది కరంగా మారుతోంది. ప్రవాహం దాటికి ద్విచక్ర వాహనాలు, తోపుడుబండ్లు, నీటిలో కొట్టుకుపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దానికి ప్రధాన కారణం రోడ్లపై ఆరుబయట చెత్తను పడేయటం వల్లే. స్థానికంగా ఉండే బాధ్యతలేని నిర్లక్ష్యపు పౌరులు తమ ఇళ్లలోని పాత వస్తువులను రోడ్లపై పడేస్తున్నారు.
అరచేతిలో జీహెచ్ఎంసీ సేవలు : హైదరాబాద్ నగర పరిధిలోని ప్రజలకు పలు సేవలను మై జీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్ ద్వారా అందిస్తోంది. ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మీ స్మార్ట్‌ఫోన్ నుంచే బల్దియా సేవలను పొందవచ్చు. మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా పారిశుద్ధ్యం (శానిటేషన్), ఆరోగ్యం, వీధి దీపాలు, ఇంజినీరింగ్, మురుగు నీటి సమస్య, రహదారులను ఊడ్చటం లాంటి సమస్యలకు సంబంధించి ఫిర్యాదు చేయాలనుకుంటే ఫొటోను తీసి సమస్య ఉన్న ప్రాంతం నుంచే ఫిర్యాదు చేయవచ్చు.