Oral Cancer: నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం వద్దు సుమా…
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. క్యాన్సర్ లో అనేక రకాలున్నాయి. వాటిల్లో ఒకటి నోటి క్యాన్సర్. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. నోటి క్యాన్సర్ కారణంగా.. పెదవులు, నాలుక, బుగ్గలు, గొంతు కణజాలాలు ప్రభావితమవుతాయి. నోటి క్యాన్సర్ పొగాకుతో పాటు..అనేక ఇతర కారణాల వల్ల కూడా వస్తుందని మీకు తెలుసా? అవును నోటి క్యాన్సర్ ప్రమాదం పెరగడానికి గల కారణాలు ఏమిటి? దాని లక్షణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
నోటి క్యాన్సర్ ని ఓరల్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. పెదవులు, నాలుక, చిగుళ్ళు, బుగ్గల లోపలి భాగం, అంగిలి, గొంతు కణజాలాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. పొగాకు, సిగరెట్లు దీనికి ప్రధాన కారణాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ వ్యాధి బారిన తక్కువ శ్రద్ధ పెట్టే అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి క్యాన్సర్ ధూమపానంతో పాటు, అనారోగ్యకరమైన జీవనశైలి కూడా కారణమవుతుంది. ఈ రోజు ఏ అలవాట్లు నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి? దీనిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే 5 అలవాట్లు:
- పొగాకు, ధూమపానం: పొగాకు నమలడం, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు కాల్చడం నోటి క్యాన్సర్‌కు అతిపెద్ద కారణాలు. పొగాకులో ఉండే నికోటిన్, క్యాన్సర్ కారక అంశాలు నోటి కణజాలాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి.
- మద్యం సేవించడం: ఆల్కహాల్ నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఆల్కహాల్, పొగాకు రెండింటినీ ఉపయోగించేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- అనారోగ్యకరమైన ఆహారం, పోషక లోపాలు: పండ్లు, కూరగాయలు తక్కువగా తినడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు లోపానికి దారితీస్తాయి. ఎందుకంటే పండ్లు, కూరగాయలు తినడం వలన కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వీటిని తినక పోవడం వలన శరీరంలో విటమిన్లు A, C, E లోపం ఏర్పడి.. నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
- నోటి పరిశుభ్రత నిర్లక్షం: దంతాలు, నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇది దీర్ఘకాలంలో నోటి క్యాన్సర్‌కు దారితీస్తుంది.
- HPV ఇన్ఫెక్షన్: కొన్ని రకాల HPV వైరస్ నోటి క్యాన్సర్‌కు కారణమవుతుంది.ఈ వైరస్ అసురక్షిత శారీరక కలయిక లేదా ఈ HPV వైరస్ సోకిన వ్యక్తితో కలయిక ద్వారా వ్యాపిస్తుంది.
నోటి క్యాన్సర్ లక్షణాలు ఏమిటి?
- నోటిలో లేదా పెదవులపై దీర్ఘకాలికంగా ఉండి నయం కాని పుండు లేదా గడ్డ
- నోరు లేదా గొంతులో నిరంతర నొప్పి.
- గొంతు లేదా నోటిలో తెలుపు లేదా ఎరుపు దద్దుర్లు.
- మింగడానికి లేదా నమలడానికి ఇబ్బంది.
- స్వరంలో మార్పు లేదా నిరంతర గొంతు నొప్పి.
- నోటి నుంచి రక్తస్రావం లేదా దంతాలు వదులు అవ్వడం
- మెడ లేదా దవడలో వాపు.
నోటి క్యాన్సర్ ప్రమాద నివారణకు ఏమి చేయాలంటే
- పొగాకు, ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.
- మద్యం అస్సలు తాగవద్దు. కొద్ది మోతాదులో తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం.
- సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇందులో పండ్లు, ఆకుపచ్చ కూరగాయలనుచేర్చుకోవాలి
- క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలి. నోటి పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవాలి.
- HPV వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా HPV ఇన్ఫెక్షన్ ను నివారించండి.