రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ – కేవలం రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్
నామమాత్ర ఫీజుతో వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య రిజిస్ట్రేషన్‌లు – గ్రామ/వార్డు సచివాలయాల్లో త్వరలో ప్రారంభం
Hereditary Lands Registrations in AP : గ్రామ/వార్డు సచివాలయాల్లో నామమాత్ర ఫీజుతో వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య (సక్సెషన్) రిజిస్ట్రేషన్‌లు త్వరలో జరగనున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ రూ.10లక్షల లోపు ఉంటే రూ.100, ఆపైన ఉంటే రూ.1,000 ఫీజును స్టాంపు డ్యూటీ కింద తీసుకోనున్నారు.
ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగిలిన వాటిని యథావిధిగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చేస్తారు. తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు తహసీల్దారుకు దరఖాస్తుచేసి, కాగితాలపై రాసుకుంటున్నారు.
సుమారు 55 వేల ఫిర్యాదులు : వీటికి మ్యుటేషన్‌లు సకాలంలో జరగడం లేదని, తహసీల్దారు కార్యాలయాల సిబ్బంది పదేపదే తిప్పుతున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గత ఏడాదిలో సుమారు 55 వేల ఫిర్యాదులు ఇలా ప్రభుత్వానికి అందాయి. మరోవైపు తమ ఆస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి అనే ఉద్దేశంతో కొందరు ఉంటున్నారు. దీనివల్ల చనిపోయిన వారి పేర్లు భూముల రికార్డుల్లో అలాగే ఉండిపోతున్నాయి. ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి.
డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ : గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా మరణ ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. యజమాని మరణించిన అనంతరం వచ్చిన ఆస్తులను వారసులు భాగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. సచివాలయాల్లో అది కూడా నామమాత్ర ఫీజులతో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వారసులు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఆటోమేటిగ్గా మ్యుటేషన్ : రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాల నమోదు (మ్యుటేషన్) ఆటోమేటిగ్గా జరుగుతుంది. ఈ-పాస్‌బుక్ కూడా జారీ అవుతుంది. వారసులుగా ఉన్న వారి నుంచి ఈ-కేవైసీ సైతం తీసుకుంటారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు జారీచేసిన ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి ఈ విధానం అమలుపై మార్గదర్శకాలు రానున్నాయి. దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ చర్యలు తీసుకుంటుంది.
ఆ భూములకే రిజిస్ట్రేషన్ : ఇందుకు కనీసం రెండు, మూడు నెలల సమయం పట్టనుంది. గత వైఎస్సార్సీపీ పాలనలో గ్రామ/వార్డు సచివాలయాల్లో అనాలోచితంగా ప్రవేశపెట్టిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు వారసత్వ భూములకే రిజిస్ట్రేషన్ చేస్తారు. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్‌లు ఎలా చేయాలన్న దానిపై డిజిటల్ అసిస్టెంట్లకు మరోదఫా శిక్షణ ఇచ్చే అవకాశముంది.