ఆ స్పీడ్ దాటితే యాక్సిడెంట్స్ పక్కా! – మీ బండిని ఎంతలో పోనిస్తున్నారు? – HIGH SPEED ROAD ACCIDENTS
రోడ్డు ప్రమాదాల్లో రోజుకు సగటున 16 మంది మృత్యువాత – బండి స్పీడ్ 65 కిలోమీటర్లు దాటిదే ప్రమాదం జరిగే ఆస్కారం – – 80 శాతానికి పైగా రోడ్డు ప్రమాద మరణాలకు కారణమిదే
High Speed Accidents in Telangana : రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది ఎలా మరణిస్తున్నారో తెలుసా? ఇతర వాహనాలు ఢీకొట్టడం వల్ల కాదు, తాగి వాహనాల్ని నడపడం వల్ల కాదు, కేవలం అతివేగం కారణంగానే! ఉదాహరణకు ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2022లో జరిగిన 21,619 ప్రమాదాల్లో 7,559 మంది మరణించారు. వీటిలో 18,395 ఘటనల్లో అతివేగమే 6,592 మంది ప్రాణాలు తీసిందని చెబుతున్నాయి. అంటే మృతుల్లో 87.2 శాతం మంది ఈ కారణంతోనే చనిపోయారు. ఆ ఒక్క ఏడాదిలోనే కాదు ఏటా రోడ్డు ప్రమాదాల్లో 80 శాతానికి పైగా ఇలాంటి మరణాలే సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్ ఓఆర్ఆర్పై బొంగులూరు గేట్ సమీపంలో ఈనెల 18న తెల్లవారుజామున కారు అతివేగంగా వెళ్తూ ప్రమాదానికి గురికావడంతో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని గుర్తించడంలో విఫలమై కారును నియంత్రించలేకపోవడమే ప్రమాదానికి దారి తీసింది. అలాగే తాజాగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డీఎస్పీలు మరణించిన విషయం తెలిసిందే.
గరిష్ఠ వేగం కన్నా ఎక్కువగా : తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. వీరిలో సుమారు 16 మంది అతివేగం కారణంగానే మృతి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాజధాని చుట్టూ విస్తరించి ఉన్న ఓఆర్ఆర్పై 120 కి.మీ., ఇతర మార్గాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 80 కి.మీ. గరిష్ఠ వేగ పరిమితిని నిర్దేశించారు. అయితే సాఫీగా సాగుతున్న సమయంలో 100 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నా డ్రైవర్‌కు ఇబ్బందిగా అనిపించడం లేదు. కానీ, ఆకస్మికంగా నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే అదుపు చేయలేకపోతుండటం ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
35 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే నియంత్రణకు అవకాశం : ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన ప్రకారం, ప్రయాణ సమయంలో రోడ్డుపై ఏదైనా వస్తువును 35 మీటర్ల దూరంలోనే గమనించినప్పుడు వాహనాన్ని డ్రైవర్ సమర్థంగా ఆపగలడు. అయినప్పటికీ వాహనం 10 మీటర్ల దూరం వరకు ముందుకెళ్తుంది. వాహనాల్ని ఆపాల్సిన దూరం తగ్గుతున్న కొద్దీ ప్రమాద తీవ్రత అనేది పెరుగుతుంది. సాధారణంగా వాహనం 65 కి.మీ. లోపు వేగంతో ఉంటే నియంత్రించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతకంటే ఎక్కువ వేగం పెరిగితే సమర్థంగా నియంత్రించే అవకాశాలు తగ్గిపోతాయని తెలిపింది.
- 60 కి.మీ. వేగంతో ఉన్నప్పుడు నియంత్రించేందుకు డ్రైవర్ ప్రయత్నించినా ప్రమాదం సంభవించినప్పుడు 0-2 కి.మీ. వేగంతో ఢీకొంటుంది.
- 65 కి.మీ. వేగం దాటినప్పుడు బ్రేక్ వేస్తే 30 కి.మీ. వేగంతో ఢీకొట్టే ఆస్కారముంటుంది.
- వాహన వేగం 5 శాతం తగ్గితే ప్రమాదాలు సంభవించే అవకాశాలు 30 శాతం మేర తగ్గుతాయి.
- 50 కి.మీ. వేగంతో ఉన్న వాహనం పాదచారిని ఢీకొంటే అతడు మరణించే అవకాశం 20 శాతం ఉంటుంది. అదే వాహనం 80 కి.మీ. వేగంతో ఉంటే అది 60 శాతానికి పెరుగుతుంది.
దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి : 2022లో దేశవ్యాప్తంగా 4,46,768 రోడ్డు ప్రమాదాలు ఇప్పటివరకూ సంభవించాయి. వీటిలో అధిక వేగం కారణంగానే జరిగిన ప్రమాదాలు 2,79,674 కావడం విశేషం. వీటిలో 1,00,726 మంది మరణించగా, మొత్తం ప్రమాదాల్లో 62.6 శాతం అధిక వేగం కారణంగానే జరిగాయి.