పింఛన్ కోసం అప్లై చేయాలా? – ఆధార్ ఒక్కటే సరిపోదు, ఆ 2 ధ్రువపత్రాలు తప్పనిసరి! – INCOME CERTIFICATE TO APPLY PENSION
పింఛన్ల దరఖాస్తుకు కొత్త తిరకాసు – స్థానికత గుర్తింపు కోసం వీటిని పరిగణనలోకి తీసుకుంటున్న డీఆర్డీఏ అధికారులు – పింఛన్ల దరఖాస్తులో కొత్తగా ఓటరు ఐడీ, ఆదాయ ధ్రువీకరణ
New Pension Applications Requirements : జిల్లాలోని పురపాలిక, నగరపాలిక పరిధిలో పింఛన్ల దరఖాస్తుకు కొత్త నిబంధనలు అమలు చేస్తూ వృద్ధులను, దివ్యాంగులను, వితంతువులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఉన్న సర్టిఫికెట్స్ స్థానంలో కొత్తగా రెండు రకాలు జత చేయడంతో అనర్హులు ఉండరనే ఆలోచనతో ఇలా చేస్తున్నామని అధికారులు అంటున్నారు. సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఇప్పటివరకు ఇలా : కరీంనగర్ బల్దియాలో పింఛన్ల కోసం దరఖాస్తు చేయాలంటే వృద్ధులకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు పాసు పుస్తకం, వితంతువులు అయితే భర్త చనిపోయిన ధ్రువపత్రం, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్, ఒంటరి మహిళకు విడాకుల పత్రం, చేనేత, గీత, బీడి కార్మికులకు వారు జత చేస్తే పింఛన్లు మంజూరు చేసేవారు. దీనికి అదనంగా ఓటరు గుర్తింపు కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కొర్రీలతో తిప్పలు :
- స్థానికతకు ఎక్కడైనా ఆధార్ ఉంటే సరిపోతుందంటారు. కానీ ఇక్కడ ఓటరు కార్డు కూడా కావాలని చెబుతున్నారు. కొన్నిసార్లు ఎక్కడో మూలన ఉన్న కార్డును తీసుకురావడం కొందరికి కష్టమవుతుంది.
- మరొకటి ఆదాయ ధ్రువీకరణ పత్రం. మీ సేవలో రేషన్ కార్డు, ఆధార్‌కార్డుతో ఆయా తహసీల్దార్లకు దరఖాస్తు చేస్తే ఇది ఇస్తారు. ఆర్ఐలు విచారణ జరిపి రేషన్ కార్డు ఉందా? లేదా అక్కడి వాస్తవాన్ని బట్టి ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అలాంటప్పుడు పింఛన్ల దరఖాస్తుకు రేషన్ కార్డు సరిపోతుంది.
- పది రోజులుగా ఈ రెండు తీసుకురావాలని నగరపాలికలో కొర్రీలు పెట్టి దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు ఇబ్బంది పడుతున్నారు.
- ఇలా పలు కారణాలతో దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆగ్రహిస్తున్నారు. అధికారులు స్పందించి ఏదైనా దరఖాస్తు చేసుకోవడానికి సులభమైన మార్గాన్ని సూచిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
”పింఛన్ల దరఖాస్తులో కొత్తగా ఓటరు ఐడీ, ఆదాయ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని డీఆర్డీఏ అధికారులు తెలిపారు. స్థానికత గుర్తింపు కోసం వీటిని పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇబ్బందుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.” – జె.సువార్త, అదనపు కమిషనర్, కరీంనగర్ నగరపాలిక
తిరకాసుతో తిప్పలు : తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వృద్ధులకు ప్రభుత్వం పింఛన్ అందిస్తోంది. వీరితో పాటు వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తూ బాసటగా నిలుస్తోంది. ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటి వరకు ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రం/ వయస్సును సూచించే ఏదైనా కార్డు చూపిస్తే సరిపోయేది. ఇప్పుడు ఆధార్‌తో పని అవ్వదని, దాంతోపాటు ఓటర్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం సైతం కావాలని తిరకాసు పెడుతుండటంటో పలువురు ఇబ్బందులు పడుతున్నారు.