ఉపాధి హామీలో జియో ట్యాగింగ్ – అలా చేయడం కుదరదిక! – NREGA MOBILE MONITORING SYSTEM
ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగం – కూలీల హాజరు పకడ్బందీ అమలుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం
National Mobile Monitoring System For MGNREGA Workers Attendance : గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీల వలసలు అరికట్టేందుకు, ఉన్న ఊరిలోనే పనులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. చెరువులు, కుంటలు, బావులు, నదులు, కాలువల్లో పూడికతీత, వ్యవసాయ క్షేత్రాలను చదును చేయడం, రహదారుల నిర్మాణం, వర్షపు నీరు ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతల ఏర్పాటు, మహోత్సవంలో మొక్కలు నాటి చుట్టూ రక్షణ కంచెలు వంటి తదితర వాటితో ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది.
ఇప్పటికే కూలీల హాజరు పకడ్బందీగా అమలుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) విధానాన్ని తీసుకొచ్చింది. ఉదయం పనులకు వచ్చిన వారి ఫొటో తీయడం పూర్తి అయిన తర్వాత మరోసారి చరవాణితో చిత్రం తీసి సదరు పోర్టల్లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినా కొందరు అందులోని కొన్ని లొసుగులతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. చేసిన పనులే మళ్లీ చేయడం వంటివి చేస్తున్నారు. అలాంటి వాటిని పూర్తిగా అరికట్టేందుకు పారదర్శకత పెంపునకు పెద్ద పీట వేస్తూ కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
పకడ్బందీగా : పనుల ఎంపిక సమయంలో గ్రామసభలు నిర్వహించి గుర్తిస్తారు. వాటి ఆమోదం, ప్రాధాన్యతతో ఎంపీడీవోలకు అక్కడి నుంచి గ్రామీణాభివృద్ధిశాఖ అధికారికి నివేదికలు చేరుతాయి. సదరు దస్త్రాలను జిల్లా కలెక్టర్ తుది పరిశీలన చేపట్టి ఆమోదం ఇవ్వనున్నారు. ఇన్ని స్థాయిల్లో పరిశీలనలు చేస్తున్నా చేసిన పనినే మళ్లీ చేసి నట్లు రికార్డులు సృష్టించడం, మరోసారి గుర్తించడం వంటివి చేస్తూ నిధుల దుర్వినియోగానికి కొందరు పాల్పడుతున్నారు. వీటికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు జియో సెన్సింగ్ విధానాన్ని రూపొందించారు.
ఒక ప్రదేశంలో పని గుర్తించే ముందుగా జియో ట్యాగింగ్ చేయనున్నారు. పని ప్రదేశం ఎంత విస్తీర్ణం, అయ్యే వ్యయం, తదితర వాటి అంచనాను టెక్నికల్ అసిస్టెంట్లు రూపొందించనున్నారు. సదరు అదికారుల ఆమోదంతో తుదిగా కలెక్టర్కు చేరుకుంటుంది. ఒక పని చేస్తే మళ్లీ అదే దానిని చేసే వీలు లేకుండా దీన్ని రూపొందించారు. జవాబుదారీతనాన్ని మెరుగుపర్చేందుకు, హాజరు పర్యవేక్షణ, కూలీలు, పనులు, తదితర వాటిని ప్రతిఒక్కరూ తెలుసుకునేలా ‘జన్ మన్ రేగా’ తీసుకొచ్చారు. ‘ఉపాధి’కి సంబంధించిన పూర్తి సమాచారం సాధారణ వ్యక్తులు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. పారదర్శకత పెంపునకు, కూలీలు పూర్తి స్థాయిలో ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెండింటిని అమల్లోకి తీసుకొచ్చింది.
జిల్లా | మండలాలు | పంచాయతీలు | జాబ్ కార్డులు | కూలీలు |
ఆదిలాబాద్ | 17 | 479 | 1,10,188 | 1,02,730 |
ఆసిఫాబాద్ | 15 | 336 | 89,429 | 82568 |
మంచిర్యాల | 16 | 311 | 77,959 | 73,318 |
నిర్మల్ | 18 | 400 | 1,29,666 | 124,600 |
గ్రామ స్థాయిలో విజిలెన్స్ కమిటీలు : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు మే నెలలోనే నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలోనే విజిలెన్స్ కమిటీలు ఉన్నాయి. తొలిసారి గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సామాజిక తనిఖీ రిపోర్టులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.