Online betting under the guise of a MeeSeva center.
మీసేవ సెంటర్ ముసుగులో గుట్టుగా ఆన్లైన్ బెట్టింగ్.. పోలీసులు ఎలా గుర్తించారంటే?రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్‌పై నిర్మల్ జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఏడాది కాలంగా భైంసా అడ్డాగా కొనసాగుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ మాపియా భరతం పట్టారు. పక్కా స్కెచ్ వేసి ఆన్ లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి భారీగా నగదు, నగలు, డాక్యుమెంట్స్ సీజ్ చేశారు.
ఏడాది కాలంగా భైంసా అడ్డాగా కొనసాగుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ మాపియా భరతం పట్టారు నిర్మల్ జిల్లా పోలీసులు.పక్కా స్కెచ్ వేసి ఆన్ లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి భారీగా నగదు, నగలు, డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది కాలంగా భైంసా ప్రాంతంలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా నిర్వహిస్తున్న భైంసా పట్టణానికి చెందిన సయ్యద్ ఆజమ్ ను అరెస్ట్ చేశాం.. ఇతను గత కొంత కాలంగా మీ సేవ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మీసేవ సెంటర్ ముసుగులో All pannel.com అనే బెట్టింగ్ యాప్ ద్వారా ఈ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు.
బాధితుల నుండి బ్యాంక్ ఖాతాలు తీసుకొని, వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సిస్ కూడా తీసుకొని, వాళ్ల ట్రాన్జక్షన్స్ అన్ని కూడా ఇతని ఆధీనంలో పెట్టుకుని వారికి నెలకు కొంత డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని బెట్టింగ్ దందా సాగించినట్టుగుర్తించామని.. బెట్టింగ్‌లో వచ్చిన డబ్బులను అవాలా రూపంలో ఇతర అకౌంట్లకు మారుస్తున్నట్టు తేల్చమన్నారు. ఇందుకు సంబంధించిన ఇన్కమ్ టాక్స్ ప్రూఫ్‌ల కోసం ఫేక్ సర్టిఫికెట్స్‌ని క్రియేట్ చేశాడని.. ఇన్కమ్ సర్టిఫికెట్స్ ని ఐటీ రిటర్న్స్ ఫేక్ గా క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్స్ రైట్స్ తో ఈ దందా సాగించినట్టు గుర్తించామన్నారు ఎస్పి జానకీ షర్మిల.
ఓవైసీ నగర్ లోని ఓ మందిరం సమీపంలో గురువారం రాత్రి మెరుపు దాడి చేసి ఈ బెట్టింగ్ నిర్వాహకుణ్ణి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుని వద్ద నుండి 16.3 లక్షల రూపాయల నగదు, 384.38 గ్రాముల బంగారు ఆభరణాలు(లక్క, దారం తో పాటు కలిపి), 55 గ్రాముల,24 క్యారెట్లు గల మూడు బంగారు బిస్కెట్ బిల్లలు, ఆస్తికి సంబంధించి 21 దస్తావేజులు, మూడు మొబైల్ ఫోన్లు (ఇందులో ఒకటి పని చేయని ఎమ్.ఐ ఫోన్), ఒక లక్ష రూపాయల విలువ చేసే రోల్ గోల్డ్ వస్తువు, ఎనిమిది ఏటీఎం కార్డులు, నిందితుని వద్ద ఉన్న బాధితుల యొక్క పాన్ ఆధార్ కార్డులు సీజ్ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు.
జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొనే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఇలాంటి నేరాలకు పాల్పడితే ఎవరిని వదలబోమని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలకు లోబడకుండా జాగ్రత్త వహించాలని, ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.