ఇకపై పకడ్బందీగా బర్త్, డెత్ సర్టిఫికెట్స్ – గతంలోని లోపాల వల్ల చలామణిలో నకిలీ ధ్రువపత్రాలు.
నకిలీ బర్త్ సర్టిఫికేట్లలో రోహింగ్యాలవే అధికంగా ఉన్నట్టు గుర్తించిన ఎన్‌ఐఏ – వీటిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం – కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓఆర్‌జీఐ వెబ్‌పోర్టల్లో ఇకపై రిజిస్ట్రేషన్లు
ORGI Web Portal will be Used for Issuing Certificates in Telangana : నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధ్రువపత్రాల జారీకి జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం వాడుతున్న సాఫ్ట్‌వేర్‌ను విడిచిపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ ఇండియా (ఓఆర్‌జీఐ) వెబ్‌పోర్టల్‌ను ఉపయోగించేందుకు జీహెచ్‌ఎంసీ అనుమతులు తీసుకుంది. ఈ కొత్త విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. అప్పటి నుంచి ధ్రువపత్రాల జారీకి ఆధార్ తప్పనిసరిగా ఉండాలి.
ప్రస్తుతం పాత పోర్టల్‌లోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆయా ఆధార్ నంబర్లు నిజమైనవా కావా అని పరిశీలించే వ్యవస్థ మాత్రం బల్దియా దగ్గర లేదు. దీనివల్ల వేలాది నకిలీ సర్టిఫికెట్లు చలామణిలోకి వచ్చాయి. అందులో రోహింగ్యాలవి అధికంగా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. కేంద్ర విధానాన్ని అందిపుచ్చుకోవాలన్న జీహెచ్‌ఎంసీ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
తక్షణ సేవలకు బ్రేక్ : జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న విధానంలో జనన, మరణాల నమోదు చట్టం-1969లోని పది సెక్షన్లు ఉల్లంఘనకు లోనవుతున్నాయి. అందులో ఇన్‌స్టంట్ సేవలు ప్రధానమైనవి. ఆసుపత్రుల్లోని జనన, మరణాలకు జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం 24 గంటల్లో సర్టిఫికెట్ ఇచ్చేస్తోంది. ఈ విధానం సామాన్య ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతుందో కేటుగాళ్లకూ అంతే సహాయపడుతోంది.
దీనిని వినియోగించుకుని పుట్టని పిల్లలకు పుట్టినట్టు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. బతికున్న వ్యక్తులకు చనిపోయినట్టు ధ్రువపత్రాలు ఇచ్చేస్తున్నారు. ఆస్తులను కాజేయడానికి, ఇతర దేశాల వారిని ఈ దేశస్థులుగా చేసేందుకు దీనిని వాడుకుంటున్నట్టు ఎన్‌ఐఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆసుపత్రులు ఆన్‌లైన్‌లో నమోదు చేసే వివరాల ఆధారంగా సంబంధిత పత్రాలను పరిశీలించకుండా సర్టిఫికెట్లు జారీ చేసే ఇన్‌స్టంట్ విధానంపై ఎన్‌ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా కమిషనర్ కర్ణన్ చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు.
ఓఆర్ఐజీతో ఉపయోగాలు : ఒకరికి రెండు ధ్రువీకరణపత్రాలు జారీ కావు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే అధికారులు, వివరాలు ఇచ్చే వైద్యులు, ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటారు. మరణ ధ్రువీకరణ పత్రం దరఖాస్తులో గడువు ప్రకారం అధికారులు దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుంది. పకడ్బందీగా నమోదయ్యే గణాంకాలను దేశ భద్రత కోసం నిఘా సంస్థలు వాటిని ఉపయోగించుకుంటాయి. జన గణనకూ సమాచారం ఉపయోగపడుతుంది. మీసేవా కేంద్రాలపై ఆధారపడక్కర్లేదు.
ఎవరీ రోహింగ్యాలు : రోహింగ్యాలు ముస్లింలలో ప్రత్యేక తెగకు చెందినవారు. వీరు తరతరాలుగా మయన్మార్‌లో నివసిస్తున్నారు. కానీ, 1982లో మయన్మార్ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంలో 135 స్థానిక జాతులను గుర్తించింది. కాగా దానిలో రోహింగ్యాలను తమ పౌరులుగా గుర్తించలేదు. రోహింగ్యా అనేది బెంగాలీ పదం అని వారంతా బంగ్లాదేశ్ నుంచి తమ దేశానికి అక్రమంగా వచ్చారని మయన్మార్ వాదిస్తోంది. తమ దేశం నుంచి వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటోంది.
ఆ దేశ సైన్యం జరిపే మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాదిమంది రోహింగ్యాలు 2017లో బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. మయన్మార్‌లో గతేడాది సైనిక తిరుగుబాటు అనంతరం వారి వలసలు మరింత పెరిగాయి. దీంతో దక్షిణ బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. పరిస్థితులు క్షీణించడంతో అక్కడి వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. సముద్రాలలో నాటు పడవల్లో ప్రయాణిస్తూ బంగ్లాదేశ్‌తోపాటు భారత్, థాయ్‌లాండ్, మలేసియా తదితర దేశాలకు చేరుకుంటున్నారు.