రూ.16 అని వదిలేస్తున్నారా? – మీ వల్ల వారికి రూ. వేలల్లో లాభాలు! – PENSION BENEFICIARIES LOSING MONEY
లబ్ధిదారులకు రూ.16 చెల్లించని తపాలా సిబ్బంది – తపాలా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇష్టారాజ్యం – ఇకపై పింఛను నగదు పంపిణీలో అవకతవకలు జరగకుండా ఆదేశాలు జారీ అధికారులు
Postal Staff did not Pay Sixteen Rupees to Pensioners : రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం మంజూరు చేసే పింఛన్ డబ్బుల్లో చిల్లరను కాజేస్తున్న వైనమిది. గ్రామీణ తపాలా కార్యాలయాల్లో నెలనెలా జరిగే తంతు గురించి తెలిసీ డీఆర్‌డీఏ, తపాలా ఉన్నతాధికారులు వదిలేస్తున్నారు. చిల్లరే కదా? అని అధికారులు అశ్రద్ధ చూపిస్తున్నారు. ఈ కారణంగా చివరకు, ‘ప్రజావాణి’లో కొందరు బాధితులు ఈ మధ్య ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిల్లర లేదంటూ : నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 2,68,691 మంది నెలనెలా పింఛన్లు తీసుకుంటున్నారు. వారి కోసం మొత్తం రూ.51 కోట్లు మంజూరవుతున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్, పురపాలకాల్లోని లబ్ధిదారులకు ఈ పింఛను డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇక్కడ ఏ ఇబ్బందీ లేదు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీస్ సిబ్బంది ద్వారా ఈ పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా మొదటి వారం రాగానే పింఛనర్లు కార్యాలయాల వద్ద బారులుదీరుతున్నారు.
దివ్యాంగులకు రూ.4,016, అలాగే ఇతర పింఛనర్లకు రూ.2,016 చొప్పున పంపిణీ అందజేస్తున్నారు. కానీ ఇక్కడి జిల్లా సిబ్బంది రూ.4000, రూ.2 వేల చొప్పున పంపీణీ చేస్తున్నారు. ఫించన్‌దారులకు చిల్లర లేదంటూ మిగతా రూ.16 కోత విధిస్తున్నారు. ప్రతినెలా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరైవరైనా గట్టిగా అడిగితేనే తప్ప చిల్లరను ఇవ్వడం లేదు. మరికొంత మందైతే చిన్న మొత్తమే కదా, గొడవెందుకని వదిలేస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో కనీసం 500 మంది వరకు పింఛనర్లు ఉంటున్నారు.
ఒక్కో గ్రామంలో రూ.4 వేలు నష్టం? : తపాలా, బ్రాంచి కార్యాలయాల పరిధిలో సగం మంది పింఛనుదారులు చిల్లర డబ్బులు తీసుకోవడం లేదు. అంటే ఈ లెక్కన ఒక్కో కార్యాలయం పరిధిలో నెలకు రూ.4 వేల వరకు నష్టపోతున్నారు. ఇంకా పెద్ద పంచాయతీలైతే ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటోందని అంచనా. జిల్లా గ్రామీణాభివృద్ధి, తపాలా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే క్షేత్రస్థాయి సిబ్బందితే ఇష్టారాజ్యంగా మారింది.
ఖాతా విధానమే పరిష్కారం : నగరపాలక, పట్టణాల్లో మాదిరిగా గ్రామాల్లోనూ లబ్ధిదారులకు ఖాతాల్లో పింఛను జమ చేయాలి. ఇలా చేస్తే ఈ గ్రామాల్లో చిల్లర దోపిడీకి వీలుండదు. మూడేళ్ల క్రితం డీఆర్డీఏ అధికారులు లబ్ధిదారులతో బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేయించారు. ఆ వివరాలనూ సేకరించారు. కానీ, ఆయా ఖాతాల్లో ఇప్పటివరకు ఇంకా పింఛను జమ చేయడం లేదు.
ఈ విషయంపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయాగౌడ్‌ను వివరణ అడగగా ‘పింఛను నగదు పంపిణీలో అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. తపాలా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి నిఘా ఏర్పాటు చేసేలా చూస్తా’ అని తెలిపారు.
ఇకపై ఫేసియల్ రికగ్నిషన్ : రాష్ట్రంలో జులై 29వ తేదీ నుంచి ముఖ గుర్తింపు (ఫేసియల్ రికగ్నిషన్) విధానంలో చేయూత పింఛన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత, గీత, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలసిస్ బాధితులకు మొత్తం 44 లక్షల మందికి రాష్ట్రంలో పింఛన్ అందజేస్తున్నారు. వృద్ధులు చాలా మంది వేళ్ల రేఖలు అదృశ్యం కావడం వల్ల బయోమెట్రిక్ సాధ్యంకాని సందర్భాల్లో వారికి పింఛన్లు రావడం లేదు. కొంతమంది పెన్షనర్ల నిధులు ఇతరులు కాజేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిణనలోకి తీసుకుని ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం అమలుకు నిర్ణయించింది.