Poisoned Water Makes 11 Students Illness

తోటి ఉపాధ్యాయులపై కోపం – పిల్లలు తాగే నీటిలో పురుగుల మందు కలిపిన టీచర్ – STUDENTS DRINK POISON WATER

తోటి ఉపాధ్యాయుడి మీద కోపంతో తాగే నీటిలో పురుగుల మందు కలిపిన టీచర్​ – ఆ నీటిని తాగిన 11 మంది విద్యార్థులకు అస్వస్థత – జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసిన ఘటన.
Poisoned Water Makes 11 Students Illness : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, మంచి మార్గంలో నడిపించాల్సిన గురువులే గతి తప్పి ప్రవర్తించారు. వారి మధ్య విభేదాలకు పిల్లలను బలి చేసేంత పని చేశారు. ఓ ఉపాధ్యాయుడు తాగు నీటిలో పురుగు మందు కలపగా, ఆ నీరు తాగిన 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్​ కాలనీలోని గురుకుల విద్యాలయంలో జరిగింది. దీంతో ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు మరో వ్యక్తిని జిల్లా కలెక్టర్​ సస్పెండ్​ చేశారు.

పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం వంట గది పక్కన ఉన్న ఆర్వో ప్లాంటు సమీపంలోని స్టీల్​ క్యాన్​లోని నీటిని విద్యార్థులు తాగారు. దీంతో కొందరు విద్యార్థులు కడుపునొప్పితో బాధపడగా, మరికొంతమంది వాంతులు చేసుకున్నారు. ఇలా అస్వస్థతకు గురైన 11 మందిని ఆసుపత్రికి తరలించారు. బాధిత విద్యార్థులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్​ రాహుల్​ శర్మ, ఎస్పీ కిరణ్​ ఖరే, అదనపు కలెక్టర్​ విజయలక్ష్మి, డీఈవో రాజేందర్​, పురపాలక కమిషనర్​ శ్రీనివాస్​ శనివారం పరామర్శించారు. ఈ ఘటన గురించి విద్యార్థులను ఆరా తీశారు. గతేడాది నుంచి గురుకుల విద్యాలయ ప్రత్యేకాధికారి వెంకన్నతో ముగ్గురు ఉపాధ్యాయులకు విభేదాలు ఉన్నాయని పలువురు విద్యార్థులు తెలిపారు.

అలాగే విద్యార్థులు పాఠశాలలో జరుగుతున్న అనేక విషయాలను అధికారులకు తెలిపారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాజేందర్​ మంచినీటిలో మోనో పురుగుల మందు కలపడంతో విద్యార్థులు ఆ నీటిని తాగి అస్వస్థతకు గురయ్యామని చెప్పారు. ఉపాధ్యాయులు తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అలాగే ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని ఏడ్చారు.

బయటకు చెబితే కొడతానన్నాడు : అర్బన్​ రెసిడెన్షియల్​ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే దీని అంతటికీ కారణం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాఠశాల సైన్స్​ టీచర్​ రాజేందర్​ మంచినీటి ట్యాంకులో మోనో పురుగుల మందు కలిపి అనుమానం రాకుండా ఉండేందుకు విద్యార్థుల దుప్పట్లపై చల్లారని తెలిపారు. చూసిన విద్యార్థులను బెదిరించి, ఈ విషయం బయటకి చెప్తే కొడతానని హెచ్చరించాడని తెలిపారు. రాజేందర్​ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా అస్వస్థతకు గురైన విద్యార్థులతో పాటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. సంబంధిత ఉపాధ్యాయులను, వంట మనిషిని సస్పెండ్​ చేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద కుటుంబాల విద్యార్థులను తల్లిదండ్రులు చదివించుకోవాలన్న ఉద్దేశంతో వసతి గృహాల్లో ఉంచుతున్నారని, పిల్లలపై ఇలాంటి ప్రయోగాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదే సమయంలో మొగుల్లపల్లి మండలంలోని కొరికిషాల కేజీబీవీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఎస్వో మధ్య విభేదాల కారణంగా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, నిరంతరం వారికి వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top