కుక్కలు కరవడానికి వస్తే ఇలా చేయండి – గమ్మున పక్కకు వెళ్లిపోతాయి.
ఏటా పెరుగుతున్న రేబిస్ మరణాలు – అధిక కేసులు కుక్క కాటు కారణంగానే – కుక్క కాటుకు గురవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ప్రత్యేక కథనం
Precautions To Be Taken For Dog Bite : కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేవారు. ఇప్పుడు సూది మందు అంటున్నారు. దాని ప్రభావం అలా ఉంటుంది మరి. అవన్నీ కాకుండా అసలు అవి కరవకుండా చూసుకోవడం మేలు. తరుముకొచ్చే వీధి కుక్కల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు :
- దేశవ్యాప్తంగా రేబిస్‌తో ఏటా 20 వేల మంది మరణిస్తున్నారు. వీరిలో 95 శాతం మందికి కుక్క కాటువల్లే రేబిస్ వస్తోంది.
- స్థానిక సంస్థలు, ప్రభుత్వాల చర్యలు నామమాత్రంగానే ఉండటంతో గ్రామాల నుంచి నగరాల దాకా వీధి కుక్కలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కుక్క కాటు కేసులు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
- ద్విచక్ర వాహనదారుల నుంచి పాదచారుల దాకా ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధి శునకాల కారణంగా గుబులు పడాల్సి వస్తోంది.
- ఏపీలోని బద్వేలు పట్టణంలో ఇటీవల ఒక పిచ్చి కుక్క 56 మందిపై దాడి చేసి కరిచింది.
- వాహనాలపై ప్రయాణిస్తూ హారన్ మోగిస్తే కుక్కలు పైకి దూకుతాయి, ఎగబడతాయి. వాటి సమీపంలో హారన్ కొట్టొద్దు.
- కుక్కలు కరుస్తాయని వాహనాన్ని స్పీడ్‌గా నడిపితే అవి మరింత పరుగెడతాయి. ఆ హడావుడిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
- కుక్కలను ఎవరైనా తెలియక తొక్కినపుడు కూడా ప్రాణరక్షణ కోసం కరిచే అవకాశం ఉంటుంది.
శునకాలు దగ్గరికి వస్తే ఇలా చేయాలి :
- కుక్కల కళ్లలోకి చూడకూడదు. అలా చేస్తే రెచ్చగొట్టినట్లుగా భావిస్తాయి. పెంపుడు కుక్కలు కూడా కొన్ని సందర్బాల్లో ఇలాగే ప్రవర్తిస్తాయి.
- కుక్కలు తినే సమయంలో కదలించకూడదు.
- నోటి నుంచి లాలాజలం వస్తుంటే అప్రమత్తంగా ఉండాలి.
- కోపంతో ఉన్నప్పుడు కుక్కలు పళ్లు బయటపెడతాయి.
- ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, నీడ దొరక్క చికాకుతో ఉన్నప్పుడు వాటిని కదలిస్తే మరింత రెచ్చిపోతాయి.
- ఆగస్టు-సెప్టెంబరు, ఫిబ్రవరి-మార్చి నెలల్లో కుక్కల గర్భధారణలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో వాటి జోలికి వెళ్లొద్దు.
- కుక్క దగ్గరికి వస్తుంటే పరిగెత్తకుండా నిలబడి ఉండాలి. అలా చేస్తే చాలావరకు మౌనంగా వెళ్లిపోయే అవకాశం ఉంది.
- కుక్కలు పొట్లాడుకునే సమయంలో అటుగా వెళ్లకుండా ఉంటే మంచిది. కుక్కను దగ్గరికి తీసుకునే క్రమంలో వీపు మాత్రమే నిమరాలి.
కాటు వేస్తే ఏం చేయాలి : కుక్క కరిచిన వెంటనే గాయమైన చోట నీటి ధారలో సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. వైద్యుల సూచనల మేరకు వెంటనే టీకాలు తీసుకోవాలి.
పెంపుడు కుక్కలు పెంచుతున్నారు :
- ఇంట్లోని పెంపుడు కుక్కలతోనూ జాగ్రత్తగా ఉండాలి. వాటికి 4 నెలల వయసులో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించాలి.
- 3 నెలల అనంతరం బూస్టర్ డోస్ వేయించాలి. తర్వాత ప్రతి పది నెలలకు వ్యాక్సిన్ వేయిస్తే మంచిది.
- కుక్కల విసర్జకాల ద్వారా ఇంట్లోని వారికి పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- పెంపుడు కుక్కలకు కొందరు అన్నం తినిపించి, అదే చేతులతో వారు తింటారు. అది అస్సలు మంచిది కాదు. కుక్క లాలాజలం తగిలితే తర్వాత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.