డెలివరీ టైంలో వివరాలు నమోదు చేయిస్తున్నారా? – ఈ తప్పులు అస్సలు చేయకండి.
జనన ధ్రువపత్రాల్లో తప్పులు – చిన్న చిన్న తప్పుల వల్ల అదనంగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి – ‘మీ సేవ‘ల చుట్టూ తిరగలేకపోతున్నామంటూ వాపోతున్న జనం
Problems With Birth Certificates : కరీంనగర్ జిల్లా నేరెల్లకు చెందిన దావవనపెల్లి పూజ ఏప్రిల్ 29న జగిత్యాలలోని మాతాశిశు ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. జనన ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసేందుకు మీ సేవకు వెళ్తే ఆన్‌లైన్‌లో దావనపెల్లికి బదులుగా దావన్‌పల్లి అని వచ్చింది. ఇంటి పేరులో ‘ఏ’ అనే అక్షరం పడకపోవడం, అడ్రెస్ ముందు ఇంటి నంబరు సరిగా లేకపోవడంతో చిరునామ సరిగా నమోదు కాలేదు. దీంతో అఫిడవిట్ కోసం రూ.300 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఆసుపత్రుల్లో జనన ధ్రువీకరణ పత్రాల్లో వివరాలు తప్పుగా నమోదు చేయడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. తప్పుగా నమోదయిన వివరాలు సరి చేసుకోవడానికి మీ-సేవలో దరఖాస్తుతో పాటు అఫిడవిట్ జత చేయాల్సి వస్తుంది. దీంతో రూ.300 నుంచి రూ.400 వరకు అదనంగా ఖర్చవుతున్నట్లు పలువురు వాపోతున్నారు. జగిత్యాల జిల్లాలో 44 ప్రైవేటు ఆసుపత్రులతో పాటు జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్లలోని ప్రధాన ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరుగుతుంటాయి. జూన్ నెలలో ప్రభుత్వాసుపత్రుల్లో 396 మంది శిశువులు జన్మించగా, ప్రైవేటు హాస్పిటల్స్‌లో 278 మంది శిశువులు జన్మించారు.
ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం కోసం వెళ్లినప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా సంబంధిత డాక్టర్ వివరాలను ధ్రువీకరిస్తారు. తర్వాత సిబ్బంది ఆధార్ కార్డులో ఉన్న విధంగా తల్లి, తండ్రి పేర్లు, చిరునామా నమోదు చేయాలి. ఆ వివరాలన్నీ ఆ ఆసుపత్రి పట్టణ పరిధిలో ఉంటే మున్సిపల్, గ్రామ పరిధిలో ఉంటే పంచాయతీ లాగిన్‌కు వెళ్తాయి. దీని ఆధారంగా బర్త్ సర్టిఫికెట్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో ధ్రువపత్రం జారీ అవుతుంది.
సమయంతో పాటు డబ్బులు వృథా : తండ్రి, తల్లి పేరులో అక్షర దోషాలు, పేరుకు ముందు ఇంటి పేరు లేకపోవడం, చిరునామాలో ఇంటి నెంబరు లేకపోవడం, స్పష్టంగా చిరునామా లేకపోవడం, కొన్నిసార్లు జెండర్ నమోదులో తప్పులు దొర్లడంతో ఆధార్‌కార్డు తీసేటప్పుడు, ఇతర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా జరిగినప్పుడు తప్పనిసరిగా సవరణ కోసం మళ్లీ మీ సేవలో సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సవరణ కోసం డబ్బులు, సమయం వృథా అయ్యే అవకాశం ఉంటుంది.
ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి : ప్రసవ సమయంలో కుటుంబసభ్యులు ఆధార్ కార్డు ఆధారంగా ఇంటి పేరుతో సహా పేర్లను నమోదు చేయించాలి. ఇంటి నెంబర్‌తో పాటు పూర్తి చిరునామా నమోదు చేసేలా దగ్గరుండి చూసుకోవాలి. జెండర్ నమోదును కూడా పరిశీలించుకోవాలి. మౌఖికంగా చెప్పకుండా సిబ్బందికి ఆధార్ కార్డు ఇచ్చి నమోదయ్యేలా చూడాలి. ఆసుపత్రిలో వివరాలను నమోదు చేసేటప్పుడు సరిగా చూసుకుంటే, సవరణ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. వారు నమోదు చేసిన తర్వాత దగ్గరుండి చెక్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తవు.
కుటుంబ సభ్యులు సిబ్బందికి అందించే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని జగిత్యాల జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆధార్‌లో ఉన్న విధంగా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేసేలా సిబ్బందిని ఆదేశిస్తామన్నారు.